మద్యంపై మహిళలు భగ్గుమన్నారు. ఏర్పాటు చేసిన దుకాణాల ముందే బైఠాయించారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది బెదిరించినా ససేమిరా అంటూ పిడికిలి బిగించారు. సంపాదించిన డబ్బులన్నీ మద్యానికి తగలేస్తే కాపురాలు ఎలా చేసేదంటూ నిలదీశారు.
కందుకూరు : పట్టణంలోని నాంచారమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణంపై స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. గత నాలుగైదు రోజులుగా ఇళ్ళ మధ్య దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఎక్సైజ్ అధికారులు నాంచారమ్మకాలనీలోనే దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీంతో బుధవారం ఉదయం కాలనీలో మహిళలు పెద్ద ఎత్తున మద్యం షాపు వద్దకు చేరకుని బైఠాయించారు. వెంటనే మద్యం దుకాణం మూసివేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో షాపు వద్దకు చేరుకున్న ఎక్సైజ్ సిఐ ప్రసాద్‌రెడ్డి మహిళలకు, స్థానిక నాయకులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. మీకిష్టం లేకపోతే ముందుగా ఎక్సైజ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. షాపు ఏర్పాటు సమయంలోనే తాము వ్యతిరేకించామని, ఆందోళనను పట్టించుకోకుండా ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు.
వీరికి సిపిఐ నాయకులు, స్థానిక నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళన ఉధృతమవడంతో పట్టణ ఎస్సై వైవి రమణయ్య అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము వ్యవహరిస్తామని,అనవసరంగా ఆందోళన చేయవద్దంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఐ. ఏరియా కార్యదర్శి కె. వీరారెడ్డి, స్థానిక నాయకులు చిలకపాటి మధు, దారం మాల్యాద్రి, సురేష్, సిపిఎం నాయకులు మువ్వా కొండయ్య పాల్గొన్నారు.
షాపు వద్ద బైఠాయించిన
మహిళలు, గ్రామస్తులు
మడనూరు (కొత్తపట్నం): మండల కేంద్రమైన మడనూరు గ్రామపరిధిలో మద్యం అమ్మకాలపై మహిళలు, గ్రామస్తులు భగ్గుమన్నారు. బుధవారం షాపు ముందు బైఠాయించారు. షాపును ప్రారంభించకుండా అడ్డుపడ్డారు. పేద ప్రజల జీవితాల్లో మద్యం యజమానులు చెలగాటమాడుతూ ఇష్టమొచ్చిన సమయంలో మద్యం విక్రయిస్తున్నారని, షాపు ప్రారంభించటానికి వీల్లేదని భీష్మించారు.
మడనూరు నుంచి హైస్కూలుకు సుమారు 200 మంది విద్యార్థినీ, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారని, వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కష్టం చేసుకొని తెచ్చుకున్న డబ్బులన్నీ తాగటానికి సరిపోతుందని, అసలు మందు షాపులు మా ఊరిలో ఉండకూదదని తెగేసి చెప్పారు. ధర్నాలో మడనూరు పంచాయతీ మెంబర్ మార్టూరి బ్రహ్మ య్య, మడనూరు ఎంపీటీసీ బద్దెల ప్రమోద్‌రెడ్డి, ఎన్. ఆదెమ్మ, వై.సుబ్బులమ్మ, బత్తల శ్రీదేవి, పాల్గొన్నారు.
మద్యం అమ్మితే ఉద్యమమే
Published Thu, Jul 9 2015 2:38 AM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM
Advertisement
Advertisement