exercise officials
-
అధికార పార్టీ నేత అరాచకం
కొడవలూరు: అధికార పార్టీ నేతల అరాచకానికి పరాకాష్ట ఈ ఉదంతం. ఎలాంటి లెసైన్స్ లేకుండానే మద్యం షాపు నిర్వహిస్తుండగా, ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసిన ఘటన మండలంలోని తాటాకులదిన్నెలో బుధవారం సాయంత్రం చోటుచేసుకొంది. ఇక్కడ జూన్ ఆఖరి దాకా కూడా స్థానిక అధికార పార్టీ నేత మద్యం దుకాణం నిర్వహించారు. జూలై నుం చి ప్రారంభమైన నూతన మద్యం దుకాణాల్లో ఇక్కడి దుకాణం అధికార పార్టీ నేతకు రాకుండా మరో వ్యక్తికి వచ్చింది. దీంతో ఏవిధంగానైనా ఆ మద్యం దుకాణాన్ని దక్కించుకోవాలని అధికార పార్టీ నేత ఎమ్మెల్యే అండతో అరాచకానికి దిగారు. పంచాయతీ అనుమతి లేదంటూ మద్యం దుకాణ భవనాన్ని కూలదోయించారు. అతడిని ఎదుర్కోలేకపోయిన మద్యం దుకాణదారు కంటైనర్ తెచ్చి అందులో మద్యం దుకాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయినా వదలని అధికార పార్టీ నేత ఆ దుకాణానికి పక్కనే గదిలో మద్యం నిల్వలు ఉంచి అమ్మకాలు ఆరంభించారు. ఈ సమాచారం ఎక్సైజ్ అధికారుల దృష్టికి పోవడంతో ఎలాంటి అనుమతి లేకుం డా గదిలో మద్యం నిల్వలు ఉండటంతో మద్యంతోసహా ఆ గదిని సీజ్ చేశారు. అయితే ఎక్సైజ్ అధికారులపై ఎమ్మెల్యే నుంచి ఒత్తిడి రావడంతో సీజ్ చేసిన సరుకును మరలా వదిలేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం గమనార్హం. మద్యం నిల్వలు ఉన్నందునే సీజ్ చేశాం: కోటేశ్వరరావు, ఎక్సైజ్ సీఐ తాటాకులదిన్నెలో మద్యం దుకాణానికి పక్కనే గదిలో మద్యం నిల్వలు ఉన్నాయని సమాచారం అందడంతో వెళ్లి వాటిని సీజ్ చేశాం. కానీ మద్యం నిల్వలు ఉంచిన వ్యక్తికి మరోచోట మద్యం దుకాణానికి లెసైన్స్ ఉంది. కానీ ఇక్కడ మద్యం నిల్వలు ఉంచడం చట్టవిరుద్ధమైనందున సీజ్ చేశాం. మద్యం నిల్వలను రాత్రికిరాత్రే తీయించాలని ప్రయత్నించాం. కానీ గురువారం దాకా గడువు అడిగినందున ఇచ్చాం. -
మద్యం అమ్మితే ఉద్యమమే
మద్యంపై మహిళలు భగ్గుమన్నారు. ఏర్పాటు చేసిన దుకాణాల ముందే బైఠాయించారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది బెదిరించినా ససేమిరా అంటూ పిడికిలి బిగించారు. సంపాదించిన డబ్బులన్నీ మద్యానికి తగలేస్తే కాపురాలు ఎలా చేసేదంటూ నిలదీశారు. కందుకూరు : పట్టణంలోని నాంచారమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణంపై స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. గత నాలుగైదు రోజులుగా ఇళ్ళ మధ్య దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఎక్సైజ్ అధికారులు నాంచారమ్మకాలనీలోనే దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీంతో బుధవారం ఉదయం కాలనీలో మహిళలు పెద్ద ఎత్తున మద్యం షాపు వద్దకు చేరకుని బైఠాయించారు. వెంటనే మద్యం దుకాణం మూసివేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో షాపు వద్దకు చేరుకున్న ఎక్సైజ్ సిఐ ప్రసాద్‌రెడ్డి మహిళలకు, స్థానిక నాయకులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. మీకిష్టం లేకపోతే ముందుగా ఎక్సైజ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. షాపు ఏర్పాటు సమయంలోనే తాము వ్యతిరేకించామని, ఆందోళనను పట్టించుకోకుండా ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. వీరికి సిపిఐ నాయకులు, స్థానిక నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళన ఉధృతమవడంతో పట్టణ ఎస్సై వైవి రమణయ్య అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తాము వ్యవహరిస్తామని,అనవసరంగా ఆందోళన చేయవద్దంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఐ. ఏరియా కార్యదర్శి కె. వీరారెడ్డి, స్థానిక నాయకులు చిలకపాటి మధు, దారం మాల్యాద్రి, సురేష్, సిపిఎం నాయకులు మువ్వా కొండయ్య పాల్గొన్నారు. షాపు వద్ద బైఠాయించిన మహిళలు, గ్రామస్తులు మడనూరు (కొత్తపట్నం): మండల కేంద్రమైన మడనూరు గ్రామపరిధిలో మద్యం అమ్మకాలపై మహిళలు, గ్రామస్తులు భగ్గుమన్నారు. బుధవారం షాపు ముందు బైఠాయించారు. షాపును ప్రారంభించకుండా అడ్డుపడ్డారు. పేద ప్రజల జీవితాల్లో మద్యం యజమానులు చెలగాటమాడుతూ ఇష్టమొచ్చిన సమయంలో మద్యం విక్రయిస్తున్నారని, షాపు ప్రారంభించటానికి వీల్లేదని భీష్మించారు. మడనూరు నుంచి హైస్కూలుకు సుమారు 200 మంది విద్యార్థినీ, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారని, వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కష్టం చేసుకొని తెచ్చుకున్న డబ్బులన్నీ తాగటానికి సరిపోతుందని, అసలు మందు షాపులు మా ఊరిలో ఉండకూదదని తెగేసి చెప్పారు. ధర్నాలో మడనూరు పంచాయతీ మెంబర్ మార్టూరి బ్రహ్మ య్య, మడనూరు ఎంపీటీసీ బద్దెల ప్రమోద్‌రెడ్డి, ఎన్. ఆదెమ్మ, వై.సుబ్బులమ్మ, బత్తల శ్రీదేవి, పాల్గొన్నారు. -
కిక్కు.. ఎవరికి దక్కు?
కర్నూలు : మద్యం దుకాణాల కోసం ఆశావహులు పోటాపోటీగా దరఖాస్తు చేస్తున్నారు. జిల్లాలోని 175 మద్యం దుకాణాలకు శనివారం నాటికి సుమారు 5,781 పైగా దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 194 మద్యం దుకాణాలు ఉండగా, అందులో పది శాతం 19 దుకాణాలు ప్రభుత్వమే ప్రారంభించింది. నిబంధనల ప్రకారం దరఖాస్తుల స్వీకరణకు సాయంత్రం 5 గంటల వరకే అయినప్పటికీ క్యూలో నిల్చున్న ప్రతి టెండర్దారున్ని చివరిరోజు అనుమతించారు. రాత్రివేళలో అసౌకర్యానికి గురికాకుండా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వ్యాపారులతో ఎక్సైజ్ కార్యాలయం పరిసరాల్లో కూడా సందడి కనిపించింది. జిల్లాలో 14 ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు ఉన్నాయి. స్టేషన్ల వారీగా టెండర్ బాక్సులు ఏర్పాటు చేయడంతో సులువుగా దరఖాస్తు చేయగలిగారు. చివరిరోజు కూడా మహిళలు భారీగా తరలివచ్చి టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నారు. దాదాపు 300 మందికి పైగా దరఖాస్తులు దాఖలు చేసి మహిళామణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నిబంధనలకు తూట్లు... దరఖాస్తుతో పాటు రూ.5 లక్షలకు తగ్గకుండా ఈఎండీ చెల్లించాలనే నిబంధన ఉంది. అయితే అందుకు తూట్లు పొడుస్తూ కొంతమంది వ్యాపారులు బినామీలతో భారీ ఎత్తున దరఖాస్తులు వేయించారు. గూడూరు మద్యం దుకాణానికి(గెజిట్ నెం.63) ఒక పేరుతో తీసిన ఈఎండీని మరో పది మందికి కలర్ జిరాక్స్‌లు పంపిణీ చేసి దరఖాస్తులు దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలులో కూడా పదుల సంఖ్యలో దుకాణాలకు ఇదే తరహాలో దరఖాస్తులు చేసినట్లు సమాచారం. గత ఏడాది అత్యధికంగా ఒక దుకాణానికి 41 దరఖాస్తులు దాఖలు కాగా ఈ ఏడాది పదుల సంఖ్యలో దుకాణాలకు 100 నుంచి 150 దాకా దరఖాస్తులు దాఖలయ్యాయి. గత ఏడాది 28 దుకాణాలకు సింగిల్ టెండర్ దాఖలు కాగా ఈ ఏడాది ప్రతి దుకాణానికి ఏడుకు పైగా దరఖాస్తులు దాఖలయ్యాయి. గత సంవత్సరం 14 దుకాణాలకు దరఖాస్తులు రాకపోవడంతో మూడు విడతలుగా నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేయాల్సి వచ్చింది. ఈసారి మొత్తం 175 దుకాణాలకు కూడా దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నేడు లక్కీడిప్... లక్కీ డిప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకోసం జిల్లాపరిషత్ సమావేశ భవన్లో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ విజయమోహన్ హాజరై లక్కీ డిప్‌ను ప్రారంభించనున్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో జిల్లాపరిషత్ హాల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నేటి నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు
నెల్లూరు(క్రైమ్): తొలిసారిగా జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఇన్చార్జి డీసీ శ్రీమన్నారాయణరావు నెల్లూరు, గూడూరు ఈఎస్‌లు డాక్టర్ శ్రీనివాస్, సుబ్బారావుతో గురువారం సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుపై చర్చించారు. అనంతరం వారు తమ సిబ్బందితో కలిసి దేవరపాళెంలోని ఐఎంఎల్ డిపోకు వెళ్లారు. ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం తరలింపుపై డిపో మేనేజర్‌తో చర్చించారు. నెల్లూరు జిల్లాలో 348 మద్యం దుకాణాలకు గానూ 35 దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించనుంది. మిగిలిన దుకాణాలకు ఇటీవల డ్రాను నిర్వహించారు. తాత్కాలిక లెసైన్స్‌లు జారీ అయి నూతన మద్యం దుకాణాలు జిల్లాలో ఏర్పాటయ్యాయి. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ఏయే ప్రాంతాల్లో దుకాణాలను ఏర్పాటు చేయాలని గుర్తించిన అధికారులు తాజాగా అందుకు తగిన భవనాలు, వసతుల కల్పనపై దృష్టి సారించారు. అధికార పార్టీ నేతలు తాము చెప్పిన చోట్లే దుకాణాలను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెస్తుండటం తలనొప్పిగా పరిణమించింది. సీఐల పర్యవేక్షణలోనే.. ప్రభుత్వ మద్యం దుకాణాలను శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకురావాలని ఇప్పటికే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారుల నుంచి జిల్లాస్థాయి అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా ప్రాంత సీఐలకు అప్పగించారు. వారి పర్యవేక్షణలో రెండేళ్ల పాటు ఇవి సాగనున్నాయి. దుకాణాల్లో పనిచేసేందుకు సిబ్బందిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం కానున్న దృష్ట్యా ఎక్సైజ్ శాఖలోని సిబ్బంది ద్వారానే విక్రయాలు సాగించాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు దుకాణాల్లో మద్యం విక్రయాలు సాగుతాయి. ఎమ్మార్పీకే మద్యం అందుబాటులో ఉంటుంది. లూజు విక్రయాలు, తాగేందుకు ఈ దుకాణాల్లో అనుమతి ఉండదు. ప్రభుత్వ మద్యం దుకాణాలివే.. నెల్లూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలోని సుబేదార్‌పేట, ములుమూడి బస్టాండ్, బుజబుజనెల్లూరు, ముత్తుకూరు, కావలి, బోగోలు, జలదంకి, కలిగిరి, కోవూరు, ఆల్లూరు, నార్తురాజుపాళెం, వవ్వేరు, సంగం, కొండాయపాళెం, మర్రిపాడు, వింజమూరు, దుత్తలూరు, ఇందుకూరుపేట, అనుమసముద్రంపేటల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. గూడూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలోని గూడూరు పట్టణం, మనుబోలు, చింతవరం, గోవిందపల్లి, దుగ్గరాజపట్నం, సూళ్లూరుపేట, తాళ్వాయిపాడు, తిరువెంకటనగర్, దొరవారిసత్రం, నాయుడుపేట బస్టాండ్, వెంకటగిరి, సైదాపురం, డక్కిలి, రాపూరు, పొదలకూరుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. -
మద్యంపై పోరుబాట
నెల్లూరు (టౌన్): సారా వ్యతిరేక ఉద్యమ పురిటిగడ్డ అయిన సింహపురిలో మద్యం మహమ్మారిపై మరో పోరు పురుడు పోసుకుంది. జిల్లాలో విచ్చలవిడి అమ్మకాలపై మహిళాలోకం దండెత్తింది. అన్నారెడ్డిపాలెం, నరుకూరు ప్రాంతాల్లో ప్రారంభమైన ఈపోరు జిల్లా అంతటా విస్తరించి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. మద్యం వ్యాపారంతో అందిన కాడికి కాసులు దండుకుందామని లాటరీలో షాపులు దక్కించుకున్న తెలుగు తమ్ముళ్లు, వ్యాపారులు తాజా పరిణామాలతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనని ఎక్సైజ్ అధికారులు కలవరపడుతున్నారు. బుధవారం నుంచి మద్యానికి సంబంధించి కొత్త పాలసీ అమలులోకి తీసుకువచ్చారు. మద్యం షాపులకు రాత్రి 11 గంటల వరకు అనుమతులు జారీ చేశారు. దుకాణాలకు సమీపంలో దేవాలయాలు, పాఠశాలలు, హైవేకి 150 మీటర్ల దూరంలో ఉండకూడదన్న నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. చాలా ప్రాంతాల్లో అధికారులు కన్నుసన్నుల్లోనే నిబంధనలుకు విరుద్ధంగా మద్యం షాపులు ఏర్పాటు చేశార న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం బాటిళ్లను ఎంఆర్పీ ధరకే విక్రయించాలన్న నిబంధనను వ్యాపారులు పక్కనబెట్టారు. వ్యాపారులను నియంత్రించాల్సిన అధికారు లు తమ్ముళ్లు, వ్యాపారుల మత్తులో తూలుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామస్తుల పోరుబాటు: మద్యం దుకాణాల ఏర్పాటుపై పోరు ప్రారంభమైంది. సంగం మండలం అన్నారెడ్డిపాలెంలో మద్యం దుకాణం వద్దంటూ రోడ్డెక్కారు. దీంతో మద్యం వ్యాపారి తొలిరోజు మిన్నకుండిపోయారు. అదేవిధంగా నరుకూరు సెంటరులో నిత్యం విద్యార్థులు, మహిళలు, స్థానికులు అధికంగా ఉంటారని, ఈ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేస్తే ఊరుకోబోమని గ్రామస్తులు గళమెత్తారు. దీంతో వ్యాపారుల్లో గుబులు పట్టుకుంది. షాపు నిర్వహణకు లక్షలు వెచ్చించి లాటరీలో దక్కించుకుంటే మద్యం అమ్మకంపై జనం ఉద్యమించడమేమిటని లోలోన మదనపడుతున్నారు. ఈరెండు గ్రామాలతో పాటు మరిన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటుపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వమే దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం అమ్మడంపై కూడా మహిళాలోకం మండిపడుతోంది. మద్యంతో ఇప్పటికే పేద, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డునపడి అల్లాడుతుంటే, కొత్తగా ఈ విధానాన్ని తీసుకురావడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు మద్యం అమ్మకాలపై రాత్రి సమయంలో 11 గంటల దాక అనుమతి ఇవ్వడంపైనా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి రాత్రులు నిద్రలేకుండా ఇబ్బందులు పడుతుంటే రాత్రి 11దాకా అనుమతిస్తే ఇళ్లు వదిలిపెట్టి పోవాల్సిందేనని పలువురు మండిపడుతున్నారు. -
ఎక్సైజ్ దోపిడీ!
సాక్షి, గుంటూరు : జిల్లాలో ఎక్సైజ్ అధికారులు అందిన కాడికి దోచేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికి మద్యం సిండికేట్లతో కుమ్మక్కై వాటాలు అందుకుంటున్నారని వినిపిస్తున్న ఆరోపణలు బలం చేకూరుస్తున్నాయి. ఎమ్మార్పీకి మద్యం విక్రయాలు జరపాలని, ఎక్కడా బెల్టుషాపులు ఉండకూడదనే నిబంధనలు జిల్లాలో అమలవుతున్నట్టు కనిపించడం లేదు. జిల్లాలో మొత్తం 342 మద్యం దుకాణాలకు ప్రస్తుతం 313 షాపులు నడుస్తున్నాయి. గుంటూరులోని మద్యం దుకాణదారులు క్వార్టర్ బాటిల్ ధరపై పది రూపాయల వరకు అధిక ంగా వసూలు చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రూ. 25 నుంచి రూ. 30 వరకు అధికంగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.కొత్త మద్యం విధానం ద్వారా దుకాణాలు కేటాయించిన ప్రభుత్వం ఎమ్మార్పీకి విక్రయాలు జరపాలని నిబంధన పెట్టినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఎమ్మార్పీని కాదని అధిక ధరలకు విక్రయాలు జరుపుతూ మందుబాబుల జేబులు కొల్లగొడుతున్నారు. దీనికి ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎమ్మార్పీకి మద్యం విక్రయాలు జరపాలని ఎక్కడైనా మందుబాబులు హడావుడి చేస్తే వెంటనే ప్రధాన బ్రాండులను పక్కనబెట్టి ఎవ్వరికీ తెలియని కొత్తరకం బ్రాండ్లను బయటకు తీసి అమ్మకాలు జరుపుతున్నారు. మందుబాబులు అలవాటు పడిన బ్రాండ్ మద్యం మాత్రమే తాగుతారని తెలిసిన వ్యాపారులు వారి బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు.ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం వసూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. కొంతమంది ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం సిండికేట్ వద్ద బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అధిక ధరలకు అమ్మగా వచ్చే లాభాల్లో తమకూ వాటా వచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. తమపై అధికారులకు నెలవారీ పంపాలంటూ మద్యం దుకాణాల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో బెల్టు షాపులు ... టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే మద్యం బెల్టు షాపులు రద్దు చేస్తూ చేసిన సంత కానికి విలువ లేకుండాపోయింది. నేటికీ అనేక గ్రామాల్లో మద్యం బెల్టు షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ షాపులను తొలగించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారు. అనేక ప్రాంతాల్లో టీడీపీ నేతలకు చెందిన మద్యం దుకాణాలు ఉండడంతో అధికారులు వాటి జోలి వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. అర్ధరాత్రి వరకు అమ్మకాలు... మద్యం దుకాణాల్లో రాత్రి 10 గంటల అనంతరం షట్టర్లకు తాళాలు వేసి దొడ్డి గుమ్మం నుంచి విక్రయాలు జరుపుతున్నారు. ఏ సమయంలో అమ్మితే మాకేంటి అనుకున్నారేమోగానీ ఎక్సైజ్ అధికారులు ఫోన్లు పక్కన పడేసి హాయిగా నిద్దరోతున్నారు. కొందరు పోలీసులు సైతం నెలవారీ సొమ్ములకు కక్కుర్తి పడి చూసీచూడనట్టు పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. రాత్రి వేళ నిబంధనలతో పనిలేకుండా మద్యం విక్రయాలు జరుపుకునేందుకు వ్యాపారులు పోలీసు శాఖలో జీపు డ్రైవర్ నుంచి అధికారి స్థాయి వరకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ప్రతినెలా అందజేస్తున్నట్లు సమాచారం. -
ఎంతకైనా అమ్ముకోండి...మాది మాకిచ్చేయండి
సాక్షి ప్రతినిధి, కడప: మీరేమీ నష్టపోనక్కర్లేదు.. ఎమ్మార్పీ రేట్లతో సంబంధం లేకుండా మద్యాన్ని అధిక ధరలకు విక్రయించుకోండి... మేమేమీ పట్టించుకోం.. మా మామూళ్లు క్రమం తప్పకుండా ఇవ్వండి .. బెల్ట్ షాపులు లేవంటే కుదరదు.. మద్యం నాణ్యత, అమ్మకాలపై చూసీ చూడనట్లు వెళతాం.. మద్యం వ్యాపారులతో ఎక్సైజ్ సిబ్బంది చేసుకుంటున్న మాటల ఒప్పందం ఇది. దీంతో మద్యం వ్యాపారులు యథేచ్ఛగా ఎమ్మార్పీ రేట్లను ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. జిల్లాలో 269 మద్యం షాపులున్నాయి. వాటి పరిధిలో సుమారు 2వేలకు పైగా బెల్ట్‌షాపులుండేవి. దీంతో క్రమం తప్పకుండా ఎక్సైజ్ యంత్రాంగానికి నెలవారీ మామూళ్లు లభించేవి. ఈమారు బెల్ట్‌షాపులు నిర్వహించరాదనే నిబంధనలు గట్టిగా ఉన్నాయి. దీంతో నెలవారీ మామూళ్ల ఒప్పందానికి కొందరు వ్యాపారులు అడ్డం తిరిగినట్లు సమాచారం. బెల్ట్‌షాపులు లేకుండా ఎలా ఆదాయం గడించాలి.. మీకెందుకు మామూళ్లు ఇవ్వాలని నిలదీసినట్లు తెలుస్తోంది. దీంతో ఎక్సైజ్ యంత్రాంగమే తరుణోపాయాన్ని సూచించినట్లు సమాచారం. మీకు ఆదాయం వస్తేనే మాకు మామూళ్లు ఇవ్వండంటూ ఉపదేశించారు. దీంతో మద్యం వ్యాపారులు అక్రమ ఆదాయానికి గేట్లు ఎత్తేశారు. అధిక రేట్లకు మద్యాన్ని విక్రయించడం మొదలు పెట్టారు. ఎమ్మార్పీ రేట్ల ఉల్లంఘన.... జిల్లాలోని 269 మద్యం షాపులకు ఇటీవల టెండర్లు పిలిచారు. 61 షాపులకు మద్యం వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రీటెండర్లను ఆహ్వానించారు. లెసైన్సు మంజూరుకు షాపును బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఎక్సైజ్ యంత్రాంగం నిర్ణయించింది. జూలై 1 నుంచి నూతన మద్యం షాపులు తెరచుకున్నాయి. దీంతో నెలమామూళ్లకు ఎక్సైజ్ యంత్రాంగం శ్రీకారం చుట్టారు. బెల్ట్‌షాపులు లేకపోవడంతో మామూళ్లు ఇవ్వడానికి కొందరు వ్యాపారులు అడ్డం తిరిగినట్లు సమాచారం. లెసైన్సు ఫీజు చెల్లించి మీరే విక్రయాలు చేసుకోండని కొందరు నిర్మోహమాటంగా అన్నట్లు తెలుస్తోంది. దీంతో అధిక రేట్లకు మద్యాన్ని విక్రయించుకోండి.. ఆదాయాన్ని గడించండి.. మా మామూళ్లు మాకివ్వండి అంటూ ఎక్సైజ్ సిబ్బంది హితబోధ చేసినట్లు సమాచారం. ఒక్కొక్క షాపులో ప్రతిరోజు 1000 నుంచి 1500 మద్యం బాటిళ్ల విక్రయాలుంటాయి. బాటిల్ మీద ఎమ్మార్పీ కంటే రూ.5 అధికంగా విక్రయించుకుంటే ప్రతినెలా సుమారు రూ.3లక్షల వరకూ ఆదాయం వస్తుందని.. అందులో రూ.50వేలు మాత్రమే మాకివ్వండని జిల్లా స్థాయి అధికారి ఒకరు కోరినట్లు సమాచారం. ఈ మేరకు అంగీకరించిన మద్యం వ్యాపారులు రూ. 5కు బదులు రూ. 10వరకు అధికంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్సైజ్ డీసీ విజయకుమారి ఏమంటున్నారంటే.. జిల్లాలో అధిక రేట్లకు మద్యం విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని కట్టడి చేయాలని ఆదేశించాను. అధిక రేట్లకు మద్యాన్ని విక్రయించుకోవాలని సూచిస్తున్న సిబ్బందిని గుర్తించి మెమోలు ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటాం. మందుబాబుల జేబులకు చిల్లులు... జిల్లాలో సరాసరిన నెలకు లక్షా 50వేల కేసుల మద్యం, 75వేల కేసుల బీర్లు విక్రయాలున్నాయి. ప్రస్తుతం ఎమ్మార్పీ రేట్లను ఉల్లంఘించిన నేపధ్యంలో క్వార్టర్ బాటిల్‌పై రూ. 10, బీరు బాటిల్‌పై రూ.15తో అధికంగా విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ప్రతి నెలా రూ.8.55కోట్ల మేరకు ప్రతి నెలా మందుబాబుల జేబులకు చిల్లులు పడే పరిస్థితి నెలకొంది. ఇందులో రూ. కోటి వరకు ఎక్పైజ్ యంత్రాంగానికి మామూళ్ల రూపంలో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు అందుతున్నట్లు సమాచారం.