కర్నూలు : మద్యం దుకాణాల కోసం ఆశావహులు పోటాపోటీగా దరఖాస్తు చేస్తున్నారు. జిల్లాలోని 175 మద్యం దుకాణాలకు శనివారం నాటికి సుమారు 5,781 పైగా దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 194 మద్యం దుకాణాలు ఉండగా, అందులో పది శాతం 19 దుకాణాలు ప్రభుత్వమే ప్రారంభించింది.
నిబంధనల ప్రకారం దరఖాస్తుల స్వీకరణకు సాయంత్రం 5 గంటల వరకే అయినప్పటికీ క్యూలో నిల్చున్న ప్రతి టెండర్‌దారున్ని చివరిరోజు అనుమతించారు. రాత్రివేళలో అసౌకర్యానికి గురికాకుండా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వ్యాపారులతో ఎక్సైజ్ కార్యాలయం పరిసరాల్లో కూడా సందడి కనిపించింది. జిల్లాలో 14 ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. స్టేషన్ల వారీగా టెండర్ బాక్సులు ఏర్పాటు చేయడంతో సులువుగా దరఖాస్తు చేయగలిగారు. చివరిరోజు కూడా మహిళలు భారీగా తరలివచ్చి టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నారు. దాదాపు 300 మందికి పైగా దరఖాస్తులు దాఖలు చేసి మహిళామణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
నిబంధనలకు తూట్లు...
దరఖాస్తుతో పాటు రూ.5 లక్షలకు తగ్గకుండా ఈఎండీ చెల్లించాలనే నిబంధన ఉంది. అయితే అందుకు తూట్లు పొడుస్తూ కొంతమంది వ్యాపారులు బినామీలతో భారీ ఎత్తున దరఖాస్తులు వేయించారు. గూడూరు మద్యం దుకాణానికి(గెజిట్ నెం.63) ఒక పేరుతో తీసిన ఈఎండీని మరో పది మందికి కలర్ జిరాక్స్‌లు పంపిణీ చేసి దరఖాస్తులు దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కర్నూలులో కూడా పదుల సంఖ్యలో దుకాణాలకు ఇదే తరహాలో దరఖాస్తులు చేసినట్లు సమాచారం.
గత ఏడాది అత్యధికంగా ఒక దుకాణానికి 41 దరఖాస్తులు దాఖలు కాగా ఈ ఏడాది పదుల సంఖ్యలో దుకాణాలకు 100 నుంచి 150 దాకా దరఖాస్తులు దాఖలయ్యాయి. గత ఏడాది 28 దుకాణాలకు సింగిల్ టెండర్ దాఖలు కాగా ఈ ఏడాది ప్రతి దుకాణానికి ఏడుకు పైగా దరఖాస్తులు దాఖలయ్యాయి. గత సంవత్సరం 14 దుకాణాలకు దరఖాస్తులు రాకపోవడంతో మూడు విడతలుగా నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేయాల్సి వచ్చింది. ఈసారి మొత్తం 175 దుకాణాలకు కూడా దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
నేడు లక్కీడిప్...
లక్కీ డిప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకోసం జిల్లాపరిషత్ సమావేశ భవన్‌లో ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ విజయమోహన్ హాజరై లక్కీ డిప్‌ను ప్రారంభించనున్నారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో జిల్లాపరిషత్ హాల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కిక్కు.. ఎవరికి దక్కు?
Published Sun, Jul 5 2015 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM
Advertisement
Advertisement