ఎంతకైనా అమ్ముకోండి...మాది మాకిచ్చేయండి | Don't sale give it back | Sakshi
Sakshi News home page

ఎంతకైనా అమ్ముకోండి...మాది మాకిచ్చేయండి

Published Wed, Jul 30 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

Don't sale give it back

సాక్షి ప్రతినిధి, కడప: మీరేమీ నష్టపోనక్కర్లేదు.. ఎమ్మార్పీ రేట్లతో సంబంధం లేకుండా మద్యాన్ని అధిక ధరలకు విక్రయించుకోండి... మేమేమీ పట్టించుకోం.. మా మామూళ్లు క్రమం తప్పకుండా ఇవ్వండి .. బెల్ట్ షాపులు లేవంటే కుదరదు.. మద్యం నాణ్యత, అమ్మకాలపై చూసీ చూడనట్లు వెళతాం.. మద్యం వ్యాపారులతో ఎక్సైజ్ సిబ్బంది చేసుకుంటున్న మాటల ఒప్పందం ఇది. దీంతో మద్యం వ్యాపారులు యథేచ్ఛగా ఎమ్మార్పీ రేట్లను ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.
 
 జిల్లాలో 269 మద్యం షాపులున్నాయి. వాటి పరిధిలో సుమారు 2వేలకు పైగా బెల్ట్‌షాపులుండేవి. దీంతో క్రమం తప్పకుండా ఎక్సైజ్ యంత్రాంగానికి నెలవారీ మామూళ్లు లభించేవి. ఈమారు బెల్ట్‌షాపులు నిర్వహించరాదనే నిబంధనలు గట్టిగా ఉన్నాయి. దీంతో నెలవారీ మామూళ్ల ఒప్పందానికి కొందరు వ్యాపారులు అడ్డం తిరిగినట్లు సమాచారం. బెల్ట్‌షాపులు లేకుండా ఎలా ఆదాయం గడించాలి.. మీకెందుకు మామూళ్లు ఇవ్వాలని నిలదీసినట్లు తెలుస్తోంది. దీంతో ఎక్సైజ్ యంత్రాంగమే తరుణోపాయాన్ని సూచించినట్లు సమాచారం. మీకు ఆదాయం వస్తేనే మాకు మామూళ్లు ఇవ్వండంటూ ఉపదేశించారు. దీంతో మద్యం వ్యాపారులు అక్రమ ఆదాయానికి గేట్లు ఎత్తేశారు. అధిక రేట్లకు మద్యాన్ని విక్రయించడం మొదలు పెట్టారు.
 
 ఎమ్మార్పీ రేట్ల ఉల్లంఘన....
 జిల్లాలోని 269 మద్యం షాపులకు ఇటీవల టెండర్లు పిలిచారు. 61 షాపులకు మద్యం వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రీటెండర్లను ఆహ్వానించారు. లెసైన్సు మంజూరుకు షాపును బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ ఎక్సైజ్ యంత్రాంగం నిర్ణయించింది. జూలై 1 నుంచి నూతన మద్యం షాపులు  తెరచుకున్నాయి. దీంతో నెలమామూళ్లకు ఎక్సైజ్ యంత్రాంగం శ్రీకారం చుట్టారు. బెల్ట్‌షాపులు లేకపోవడంతో మామూళ్లు ఇవ్వడానికి కొందరు వ్యాపారులు అడ్డం తిరిగినట్లు సమాచారం.
 
 లెసైన్సు ఫీజు చెల్లించి మీరే విక్రయాలు చేసుకోండని కొందరు నిర్మోహమాటంగా అన్నట్లు తెలుస్తోంది. దీంతో అధిక రేట్లకు మద్యాన్ని విక్రయించుకోండి.. ఆదాయాన్ని గడించండి.. మా మామూళ్లు మాకివ్వండి అంటూ ఎక్సైజ్ సిబ్బంది హితబోధ చేసినట్లు సమాచారం. ఒక్కొక్క షాపులో ప్రతిరోజు 1000 నుంచి 1500 మద్యం బాటిళ్ల విక్రయాలుంటాయి. బాటిల్ మీద ఎమ్మార్పీ కంటే రూ.5 అధికంగా విక్రయించుకుంటే ప్రతినెలా సుమారు రూ.3లక్షల వరకూ ఆదాయం వస్తుందని.. అందులో రూ.50వేలు మాత్రమే మాకివ్వండని జిల్లా స్థాయి అధికారి ఒకరు కోరినట్లు సమాచారం. ఈ మేరకు అంగీకరించిన మద్యం వ్యాపారులు రూ. 5కు బదులు రూ. 10వరకు అధికంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
 
 ఎక్సైజ్ డీసీ విజయకుమారి ఏమంటున్నారంటే..
 జిల్లాలో అధిక రేట్లకు మద్యం విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని  కట్టడి చేయాలని ఆదేశించాను. అధిక రేట్లకు మద్యాన్ని విక్రయించుకోవాలని సూచిస్తున్న సిబ్బందిని గుర్తించి మెమోలు ఇచ్చి కఠిన చర్యలు తీసుకుంటాం.
 
 మందుబాబుల  జేబులకు చిల్లులు...
 జిల్లాలో సరాసరిన  నెలకు లక్షా 50వేల కేసుల మద్యం, 75వేల కేసుల బీర్లు విక్రయాలున్నాయి.  ప్రస్తుతం ఎమ్మార్పీ రేట్లను ఉల్లంఘించిన నేపధ్యంలో  క్వార్టర్ బాటిల్‌పై రూ. 10, బీరు బాటిల్‌పై రూ.15తో అధికంగా విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ప్రతి నెలా రూ.8.55కోట్ల మేరకు ప్రతి నెలా మందుబాబుల జేబులకు చిల్లులు పడే పరిస్థితి నెలకొంది. ఇందులో రూ. కోటి వరకు ఎక్పైజ్ యంత్రాంగానికి మామూళ్ల రూపంలో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు అందుతున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement