నెల్లూరు (టౌన్): సారా వ్యతిరేక ఉద్యమ పురిటిగడ్డ అయిన సింహపురిలో మద్యం మహమ్మారిపై మరో పోరు పురుడు పోసుకుంది. జిల్లాలో విచ్చలవిడి అమ్మకాలపై మహిళాలోకం దండెత్తింది. అన్నారెడ్డిపాలెం, నరుకూరు ప్రాంతాల్లో ప్రారంభమైన ఈపోరు జిల్లా అంతటా విస్తరించి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.
మద్యం వ్యాపారంతో అందిన కాడికి కాసులు దండుకుందామని లాటరీలో షాపులు దక్కించుకున్న తెలుగు తమ్ముళ్లు, వ్యాపారులు తాజా పరిణామాలతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనని ఎక్సైజ్ అధికారులు కలవరపడుతున్నారు. బుధవారం నుంచి మద్యానికి సంబంధించి కొత్త పాలసీ అమలులోకి తీసుకువచ్చారు. మద్యం షాపులకు రాత్రి 11 గంటల వరకు అనుమతులు జారీ చేశారు. దుకాణాలకు సమీపంలో దేవాలయాలు, పాఠశాలలు, హైవేకి 150 మీటర్ల దూరంలో ఉండకూడదన్న నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు.
చాలా ప్రాంతాల్లో అధికారులు కన్నుసన్నుల్లోనే నిబంధనలుకు విరుద్ధంగా మద్యం షాపులు ఏర్పాటు చేశార న్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం బాటిళ్లను ఎంఆర్‌పీ ధరకే విక్రయించాలన్న నిబంధనను వ్యాపారులు పక్కనబెట్టారు. వ్యాపారులను నియంత్రించాల్సిన అధికారు లు తమ్ముళ్లు, వ్యాపారుల మత్తులో తూలుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రామస్తుల పోరుబాటు: మద్యం దుకాణాల ఏర్పాటుపై పోరు ప్రారంభమైంది. సంగం మండలం అన్నారెడ్డిపాలెంలో మద్యం దుకాణం వద్దంటూ రోడ్డెక్కారు. దీంతో మద్యం వ్యాపారి తొలిరోజు మిన్నకుండిపోయారు. అదేవిధంగా నరుకూరు సెంటరులో నిత్యం విద్యార్థులు, మహిళలు, స్థానికులు అధికంగా ఉంటారని, ఈ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చేస్తే ఊరుకోబోమని గ్రామస్తులు గళమెత్తారు. దీంతో వ్యాపారుల్లో గుబులు పట్టుకుంది. షాపు నిర్వహణకు లక్షలు వెచ్చించి లాటరీలో దక్కించుకుంటే మద్యం అమ్మకంపై జనం ఉద్యమించడమేమిటని లోలోన మదనపడుతున్నారు. ఈరెండు గ్రామాలతో పాటు మరిన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటుపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వమే దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం అమ్మడంపై కూడా మహిళాలోకం మండిపడుతోంది. మద్యంతో ఇప్పటికే పేద, మధ్యతరగతి కుటుంబాలు రోడ్డునపడి అల్లాడుతుంటే, కొత్తగా ఈ విధానాన్ని తీసుకురావడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు మద్యం అమ్మకాలపై రాత్రి సమయంలో 11 గంటల దాక అనుమతి ఇవ్వడంపైనా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి రాత్రులు నిద్రలేకుండా ఇబ్బందులు పడుతుంటే రాత్రి 11దాకా అనుమతిస్తే ఇళ్లు వదిలిపెట్టి పోవాల్సిందేనని పలువురు మండిపడుతున్నారు.
మద్యంపై పోరుబాట
Published Thu, Jul 2 2015 1:47 AM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM
Advertisement
Advertisement