నేటి నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు | Alchol shops will be opened to day | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలు

Published Fri, Jul 3 2015 2:31 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Alchol shops will be opened to day

నెల్లూరు(క్రైమ్): తొలిసారిగా జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాలు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఇన్‌చార్జి డీసీ శ్రీమన్నారాయణరావు నెల్లూరు, గూడూరు ఈఎస్‌లు డాక్టర్ శ్రీనివాస్, సుబ్బారావుతో గురువారం సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుపై చర్చించారు. అనంతరం వారు తమ సిబ్బందితో కలిసి దేవరపాళెంలోని ఐఎంఎల్ డిపోకు వెళ్లారు. ప్రభుత్వ మద్యం దుకాణాలకు మద్యం తరలింపుపై డిపో మేనేజర్‌తో చర్చించారు. నెల్లూరు జిల్లాలో 348 మద్యం దుకాణాలకు గానూ 35 దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించనుంది.
 
 మిగిలిన దుకాణాలకు ఇటీవల డ్రాను నిర్వహించారు. తాత్కాలిక లెసైన్స్‌లు జారీ అయి నూతన మద్యం దుకాణాలు జిల్లాలో ఏర్పాటయ్యాయి. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు.  ఇప్పటికే ఏయే ప్రాంతాల్లో దుకాణాలను ఏర్పాటు చేయాలని గుర్తించిన అధికారులు తాజాగా అందుకు తగిన భవనాలు, వసతుల కల్పనపై దృష్టి సారించారు. అధికార పార్టీ నేతలు తాము చెప్పిన చోట్లే దుకాణాలను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తెస్తుండటం తలనొప్పిగా పరిణమించింది.
 సీఐల పర్యవేక్షణలోనే..
 ప్రభుత్వ మద్యం దుకాణాలను శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకురావాలని ఇప్పటికే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారుల నుంచి జిల్లాస్థాయి అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. వీటి నిర్వహణ బాధ్యతలను ఆయా ప్రాంత సీఐలకు అప్పగించారు. వారి పర్యవేక్షణలో రెండేళ్ల పాటు ఇవి సాగనున్నాయి. దుకాణాల్లో పనిచేసేందుకు సిబ్బందిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం కానున్న దృష్ట్యా ఎక్సైజ్ శాఖలోని సిబ్బంది ద్వారానే విక్రయాలు సాగించాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు దుకాణాల్లో మద్యం విక్రయాలు సాగుతాయి. ఎమ్మార్పీకే మద్యం అందుబాటులో ఉంటుంది. లూజు విక్రయాలు, తాగేందుకు ఈ దుకాణాల్లో అనుమతి ఉండదు.
 
 ప్రభుత్వ మద్యం దుకాణాలివే..
 నెల్లూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలోని సుబేదార్‌పేట, ములుమూడి బస్టాండ్, బుజబుజనెల్లూరు, ముత్తుకూరు, కావలి, బోగోలు, జలదంకి, కలిగిరి, కోవూరు, ఆల్లూరు, నార్తురాజుపాళెం, వవ్వేరు, సంగం, కొండాయపాళెం, మర్రిపాడు, వింజమూరు, దుత్తలూరు, ఇందుకూరుపేట, అనుమసముద్రంపేటల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. గూడూరు ఎక్సైజ్ జిల్లా పరిధిలోని గూడూరు పట్టణం, మనుబోలు, చింతవరం, గోవిందపల్లి, దుగ్గరాజపట్నం, సూళ్లూరుపేట, తాళ్వాయిపాడు, తిరువెంకటనగర్, దొరవారిసత్రం, నాయుడుపేట బస్టాండ్, వెంకటగిరి, సైదాపురం, డక్కిలి, రాపూరు, పొదలకూరుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement