డాక్టర్ వి.రాధయ్య, డీసీ
నెల్లూరు(క్రైమ్): ‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దశలవారీ మద్య నిషేధం నిర్ణయం కారణంగా జిల్లాలో మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఎక్సైజ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాం. మొత్తం 1,039 కేసులు నమోదు చేశాం.’ అని నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వి.రాధయ్య తెలిపారు. శుక్రవారం ఆయన నెల్లూరులో సాక్షితో మాట్లాడారు.∙గతేడాది జనవరి నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు జిల్లావ్యాప్తంగా 824 బెల్టుషాపులపై కేసులు నమోదుచేసి 831 మందిని అరెస్ట్ చేశాం. వారి నుంచి 3,400 లీటర్ల మద్యం, 530 లీటర్ల బీరు, 73 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం.
♦ ఎక్సైజ్ నేరాలకు పాల్పడుతున్న 657 మందిని 109, 110 సీఆర్పీసీల కింద బైండోవర్ చేశాం.
♦ నిబంధనలు ఉల్లంఘించిన మద్యం దుకాణాలు, బార్లపై 141 కేసులు నమోదుచేసి రూ.7.05 లక్షల జరిమానా విధించాం. తొమ్మిది ఎమ్మార్పీ ఉల్లంఘన కేసులు నమోదు చేశాం.
♦ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2018తో పోల్చి చూస్తే 2019లో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. 2018 డిసెంబర్‌లో నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాల పరిధిలో 2,29,288 మద్యం కేసులు, బీరు కేసులు 1,17,443 అమ్ముడుపోగా 2019 డిసెంబర్‌లో 1,18,865 మద్యం, 46,743 బీరు కేసులు విక్రయించారు. మొత్తంగా మద్యంలో – 17.63 శాతం, బీర్లలో – 60.20 శాతం అమ్మకాలు పడిపోయాయి. రాబోయే రోజుల్లో విక్రయాలు మరింత తగ్గుతాయి.
బాగా తగ్గింది
ప్రభుత్వ రిటైల్ మద్యం దుకాణాల్లో విక్రయవేళల కుదింపు, బార్లలో భారీగా ధరల పెంపుతో నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట పడిందని డీసీ వెల్లడించారు. 2018 డిసెంబర్ 31వ తేదీన 14,476 కేసుల మద్యం, 9,942 కేసుల బీరు విక్రయాలు జరగ్గా 2019 డిసెంబర్ 31న 5,967 కేసుల మద్యం, 1,602 కేసుల బీరు అమ్మారు. 2019 జనవరి 1న 8,624 కేసుల మద్యం, 4,102 కేసుల బీర్లు విక్రయించారు. ఈ ఏడాది ఒకటో తేదీన 1,141 కేసుల మద్యం, 501 కేసుల మద్యం విక్రయాలు జరిగాయి.
కేసుల నమోదు
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్ సూపర్‌వైజర్లు, సేల్స్‌మన్లలో కొందరు అనధికార మద్యం విక్రయాలు సాగిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని డీసీ రాధయ్య చెప్పారు. పక్కా సమాచారంతో రెండు దుకాణాలపై దాడులు చేసి 166 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని సేల్స్ సూపర్‌వైజర్లు ఇద్దరు, సేల్స్‌మన్లు ఇద్దరిని విధుల నుంచి తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. గూడూరు, కావలి, సూళ్లూరుపేటల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment