నెల్లూరు(క్రైమ్): నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో మద్యం షాపుల నిర్వహణ ఉంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 24గంటలు మద్యం విక్రయాలు సాగుతున్నాయి. చాలామంది మద్యం దుకాణాల నిర్వాహకులు మరో అడుగు ముందుకేసి షాపుల బయటే మద్యపానసేవనం చేయిస్తున్నారు. నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే రద్దీ కూడళల్లో మద్యం షాపుల ముందే రోడ్డుమీద మందుబాబులు మద్యంసేవిస్తూ మత్తులో అటువైపుగా వచ్చిపోయే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంతో సహా అత్యధిక శాతం మద్యం దుకాణాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాల పరిధిలో 349 మద్యం దుకాణాలున్నాయి. వీటిలో సగానికిపైగా దుకాణాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణం ఉదయం 10 నుంచి రాత్రి 10గంటలలోపే మద్యం విక్రయాలు సాగించాలి. అందుకు భిన్నంగా అనేక మద్యం దుకాణాల్లో 24గంటలు మద్యం విక్రయాలు సాగిస్తున్నాయి.
మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి సీసాను స్కానింగ్‌చేసి కంప్యూటర్ బిల్లు ఇవ్వాలనే నిబంధన దాదాపు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. లైసెన్సు దుకాణానికి అనుబంధంగా బెల్టుదుకాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వీటి నిర్వహణ కోసం మద్యం వ్యాపారులు ముందుగానే ఎక్సైజ్ పోలీసులతో ఒప్పందాలు చేసుకొని అడ్డగోలుగా అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బెల్టుషాపులపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేసిన సమయంలో మాత్రమే కిందిస్థాయి సిబ్బంది దాడులు చేస్తున్నారని ఆపై పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. జిల్లా పరిధిలోని తీరప్రాంత గ్రామాలైన అల్లూరు, విడవలూరు, ముత్తుకూరు, గూడరు డివిజన్‌లోని కోట, వాకాడు, తడ మండలాలతో పాటు కోవూరు, ఉదయగిరి, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలో కొందరు ఎక్సైజ్ అధికారులు, అధికారపార్టీ కనుసన్నల్లోనే బెల్టుషాపులు నడుస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్‌లు బార్లను తలపిస్తున్నాయి. వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు.
బహిరంగ సేవనం
మద్యం దుకాణాల బయట మద్యం తాగరాదన్న నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. మందుబాబులు దుకాణం బయటే బహిరంగసేవనం చేస్తూ అటుగా వచ్చే ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అధికశాతం మద్యం దుకాణాలు ప్రధాన కూడళ్లల్లో ఉండటంతో ప్రజలు, ప్రయాణికులు మందుబాబులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పద్మావతిసెంటర్, వనంతోపు, ములుముడి బస్టాండు, ఆత్మకూరు బస్టాండు, శెట్టిగుంటరోడ్డు, వెంకటేశ్వరపురం, హరనాధపురం, ఆర్టీసీ బస్టాండు, కనకమహాల్ సెంటర్, ఏసీ కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాల వద్ద ప్రజలు రాకపోకలు సాగించాలంటే భయపడుతున్నారు. వూటుగా మద్యం సేవించిన మందుబాబుల ఆగడాలు శృతిమించుతున్నాయి. మహిళలు ఇబ్బందులకు గురతున్నారు. బహిరంగ మద్యసేవనం విషయమై జిల్లా పోలీసుబాస్‌కు పలు ఫిర్యాదులు అందాయి. తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దృష్టి సారించిన ఎస్పీ
బహిరంగ మద్యసేవనం, నిబంధనల ఉల్లంఘనపై ఎస్పీ దృష్టి సారించారు. అందులో భాగంగా ఇటీవల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, మద్యం వ్యాపారులతో సమావేశమయ్యారు. నిబంధనలు పక్కాగా పాటించాలనీ, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన మద్యం వ్యాపారులకు స్పష్టంచేసినట్లు సమాచారం. బహిరంగ మద్య సేవనం చేయించినా, నిర్ణీత వేళలు పాటించకపోయినా, లూజు విక్రయాలు సాగించినా కేసులు నమోదు చేస్తామని హె చ్చరించారు. వ్యాపారులందరూ విధిగా నిబంధనలు పాటించేలా చూడాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. నిబంధనలు పాటించని మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో వ్యాపారుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వ్యాపారులతో కుదుర్చుకొన్న ముందస్తు లోపాయికారి ఒప్పందమో, మామూళ్లో తెలియదుకానీ నిన్నమొన్నటి వరకు మొక్కుబడి చర్యలకు పరిమితమైన ఎక్సైజ్‌శాఖ పోలీసు బాస్ ఆగ్రహంతో వ్యాపారులు నిబంధనలు పక్కాగా పాటించేలా చర్యలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment