శిథిలమైన తెలుగుగంగ క్వార్టర్స్‌ను పరిశీలిస్తున్న సీఐ, ఎస్సైలు
నెల్లూరు, పొదలకూరు: మండలంలోని పులికల్లు గ్రామంలో సుమారు 20 మంది ఆగంతకులు శనివారం అర్ధరాత్రి మద్యం తాగి స్వైర విహారం చేశారు. బైక్‌ల్లో గ్రామంలో చక్కర్లు కొడుతూ కేకలు వేస్తూ, సవాళ్లు విసురుతూవీరంగం సృష్టించడంతో గ్రామస్తులు భీతిల్లారు. పోలీసులు, గ్రామస్తుల సమాచారం మేరకు.. పులికల్లు గ్రామానికి సమీపంలో పాడుపడిన తెలుగుగంగ క్వార్టర్స్‌లో శనివారం రాత్రి 20 మంది యువకులు బైక్‌లపై వచ్చి అక్కడే మాంసం వండుకుని, ఫూటుగా మద్యం తాగారు. తర్వాత బైక్‌లపై గ్రామంలోకి ప్రవేశించి వైఎస్సార్‌సీపీ గ్రామ నాయకుల ఇళ్ల వద్ద ఆగి కేకలు వేయడంతో పాటు, సవాళ్లు విసిరారు. ఆగంతకుల కేకలకు గ్రామస్తులు భీతిల్లిపోయి అర్ధరాత్రి ఒకరికొకరు ఫోన్లు చేసుకుని గుమికూడి పట్టుకునేందుకు ప్రయత్నించడంతో కొందరు బైక్‌లను గ్రామంలో వదిలి పారిపోయారు. వెంటనే గ్రామస్తులు కండలేరు డ్యామ్ ఎస్సై లేఖాప్రియాంకకు సమాచారం అందించారు.
గ్రామస్తులు ఆ బైక్‌లను స్టేషన్‌కు తరలించి పోలీసులకు స్వాధీనం చేశారు. వచ్చిన ఆగంతకుల్లో గ్రామస్తులు నలుగురు యువకులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. వారిలో ఇద్దరు పులికల్లు గ్రామానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు అదే పంచాయతీ పర్వతాపురం గ్రామానికి చెందిన వారని తెలిసింది. ఇదే విషయాన్ని ఎస్సై కూడా ధ్రువీకరించారు. అనుమానితులు నలుగురు యువకులపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుని మిగిలిన ఆగంతకులను వివరాలు సేకిరించే పనిలో ఉన్నారు. పొదలకూరు సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సైతో కలిసి ఆగంతకులు మద్యం సేవించిన శిథిల క్వార్టర్స్‌ను ఆదివారం పరిశీలించారు. ఆగంతకులు మద్యం సేవించిన ప్రాంతంలో టీడీపీ జెండాలు ఉన్నట్టు గుర్తించారు. వీరంతా టీడీపీకి చెందిన రౌడీమూకలుగా గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో వివాదాలు చోటు చేసుకున్నాయని, పాత కక్షలను మనస్సులో పెట్టుకుని టీడీపీకి చెందిన వారే వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు తెగబడేందుకు బయట వ్యక్తులను పంపినట్టుగా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment