అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : ‘అనంత’లో విచ్చలవిడి మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. కర్ణాటక నుంచి తక్కువ ధరకు దొరికే మద్యం తెప్పించి అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు మద్యం కల్తీ చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. లెసైన్‌స దుకాణాల సంఖ్య వందల్లో ఉంటే బెల్టుషాపులు వేలల్లో ఉన్నాయి.
పేద, మధ్యతరగతి వర్గాల వారు మద్యం మత్తులో పడి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. యువత సైతం పెడదోవపడుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు.
జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 234 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికి తోడుగా 6300 బెల్ట్‌షాపులు ఉన్నట్లు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాలు గుర్తించాయి.
పతి పల్లెకూ నాలుగు బెల్ట్‌షాపులున్నట్లు తెలుస్తోంది. మేజర్ పంచాయతీ పరిధిలోని ఒక్కో బెల్ట్‌షాపులో రోజుకు రూ.70 వేల నుంచి రూ.80 వేల మద్యం వ్యాపారం జరుగుతోంది. నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం లెసైన్‌స దుకాణానికి అనుబంధంగా రూ.2 లక్షలు ఎక్సైజ్ శాఖకు చెల్లించి షెడ్ ఏర్పాటు చేసుకుని.. అక్కడ నిల్చొని మద్యం తాగి వెళ్లేందుకు అవకాశం కల్పించారు. అయితే సదరు దుకాణాదారులు నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్ ఏర్పాట్లు చేసి.. మంచింగ్‌కు సంబంధించిన తినుబండారాలు, శీతల పానీయాలను అందుబాటులో ఉంచి.. బార్లను మరిపిస్తున్నారు. అనంతపురంలో అయితే కొంతమంది వ్యాపారులు మద్యం దుకాణాలకు అనుబంధంగా ఏకంగా హోటళ్లనే నడుపుతున్నారు.
అయినా ఎక్సైజ్ అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. నగర శివారులోని కొన్ని దాబాలపైనే వరుస దాడులు చేస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. మద్యం అమ్మకాలు ఎంత జరిగితే అంత ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, నిర్దేశిత లక్ష్యం పూర్తవుతుందని ఎక్సైజ్ అధికారులు చెప్పుకొస్తున్నారు.
భారీగా కర్ణాటక మద్యం దిగుమతి
కర్ణాటక మద్యం జిల్లాకు భారీగా దిగుమతి అవుతోంది. నెలలో రెండు మూడు సార్లు తెప్పిస్తున్నట్లు తెలిసింది. సగటున నెలకు రూ.30 కోట్ల మేర కర్ణాటక మద్యం దిగుమతి అవుతోంది. సర్కారీ మద్యం రోజుకు రూ.2 కోట్ల అమ్మకాలు జరుగుతుండగా.. కర్ణాటక మద్యం రూ.కోటి వరకు విక్రయిస్తున్నారు. గార్లదిన్నెలో ఇద్దరు లెసైన్సీదారులే తమ దుకాణాల్లో కర్ణాటక మద్యం అమ్ముతూ పట్టుబడ్డారు. ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారుల అండదండలతోనే కర్ణాటక మద్యాన్ని యథేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిసింది.
కల్తీ మద్యం తయారీ
జిల్లాలో అక్కడక్కడా కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. స్పిరిట్‌లోకి కొన్ని కెమికల్స్ వేసి వాటిని బాటిళ్లలో ప్యాకింగ్ చేసి.. వాటికి బ్రాండెడ్ లేబుల్స్ అతికిస్తున్నారు. ఇటువంటి మద్యంను తాగిన వారు అరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. తయారీదారులు.. అమ్మకందారులు మాత్రం జేబులు నింపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. బత్తలపల్లిలో వ్యాపారి కల్తీ మద్యం అమ్ముతూ పట్టుబడిన విషయం పాఠకులకు విదితమే.
ప్రజా, మహిళా సంఘాల గోడు వినేదెవరు..?
నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయని, వాటిని అరికట్టాలని ప్రజా, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నా వారి గోడును ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మద్యం వ్యాపారాల్లో రాజకీయ పార్టీల నేతలు ఉండటంతోనే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. విచ్చలవిడి మద్యం అమ్మకాలు నియంత్రించాలని కోరుతున్నాయి.
మత్తులో చిత్తు
Published Mon, Jan 13 2014 3:16 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement