సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు రూ.21,764.34 కోట్లు రాష్ట్ర ఖజానాకు సమకూరింది. ఇది గతేడాది ఇదే సమయంలో నమోదైన ఆదాయం కంటే రూ.27,70.07 కోట్లు అధికం. ఇందులో వాణిజ్యపన్నుల తర్వాత అధికంగా మద్యం విక్రయాల ద్వారానే ఆదాయం నమోదయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు మద్యం ఆదాయం రూ. 1,956.52 కోట్లు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి రూ. 2,927.59 కోట్లు సమకూరింది. అంటే గత ఆర్థిక సంవత్సర కన్నా అదనంగా రూ.971.07 కోట్ల ఆదాయం వచ్చినట్లు స్పష్టమైంది. ఇది కేవలం మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం మాత్రమే. దీనికి అదనంగా మద్యంపై వ్యాట్ రూపంలో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ. 3,579 కోట్ల ఆదాయం లభించింది. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు శూన్యంగా ఉన్నప్పటికీ మద్యం ఆదాయం వృద్ధిలో మాత్రం రాష్ట్రం దూసుకుపోతోంది. ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్‌షాపులను తొలగిస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో పాటు బెల్ట్‌షాపులు మరిన్ని పెరగడం, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడబడితే అక్కడ మద్యం టెట్రాప్యాకెట్లలో విక్రయించడం మొదలైంది. తాజాగా మద్యాన్ని డోర్ డెలివరీ కూడా చేస్తూ ‘ఇంటింటికీ మద్యం’ సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మినహా మిగతా అన్ని చోట్లా మద్యం ఆదాయంలో వృద్ధి 40 శాతం పైగానే నమోదైంది. సీఎం చంద్రబాబు మాటలు వేరు, చేతలు వేరని ఈ అంకెలే స్పష్టం చేస్తున్నాయని మద్యపాన వ్యతిరేక ఉద్యమకారులు పేర్కొంటున్నారు.
విశాఖలో అత్యధిక ఆదాయం
విశాఖపట్టణం జిల్లాలో అత్యధికంగా మద్యం ద్వారా రూ. 318.34 కోట్ల ఆదాయం వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో మద్యం ద్వారా తక్కువగా రూ. 141.96 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది వృద్ధి రేటు 60.12 శాతంగా నమోదైంది. మద్యం వినియోగాన్ని నియంత్రించడం కన్నా వీలైనంత మేర వినియోగం పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందనడానికి మద్యం ఆదాయం పెరుగుదలే నిదర్శనమని ఎక్సైజ్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. పేరుకు మాత్రమే బెల్ట్ షాపుల నియంత్రణ అంటూ ప్రచారం సాగుతోంది తప్ప ఎక్కడా అలాంటి చర్యలు కనిపించడం లేదని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. పరిష్కార వేదిక పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలోనే మద్యం విక్రయాలను నియంత్రించాల్సిందిగా 92 శాతం మంది కోరటం గమనార్హం. బెల్ట్ షాపుల నియంత్రణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని... మెడికల్ షాపులు, లాడ్జీలు, కిరాణా షాపులు, కిల్లీ షాపుల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని పరిష్కార వేదికకు ఫిర్యాదులు కోకొల్లలు వస్తున్నాయి.
మందులో ముందుకు!
Published Fri, Sep 29 2017 2:09 AM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM
Advertisement
Advertisement