కేశవరంలో మద్యం మత్తులో వ్యక్తి దురాగతం
Published Wed, Aug 14 2013 4:26 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
కేశవరం (మండపేట రూరల్), న్యూస్‌లైన్ : ప్రేమించి పెళ్లాడిన భర్తే ప్రాణాలు బలిగొన్నాడు. గర్భిణి అని కూడా చూడకుండా భార్యను అతి దారుణంగా కడతేర్చాడు. ఆమె తల్లిదండ్రుల పాలిట కాలయముడయ్యాడు. ఆదమరిచి నిద్రపోతున్న వారిపైనా దాడిచేసి హతమార్చాడు. మద్యం మత్తులో అతడు సాగించిన దారుణకాండలో అత్తమామలతోపాటు అతని భార్య హతులయ్యారు. చుట్టపుచూపుగా వచ్చిన మరో మహిళపైనా దాడిచేసి నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మండపేట మండలం కేశవరంలో తీవ్ర సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, మృతుల బంధువులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పెదపూడి మండలం చింతపల్లిలాకులకు చెందిన బద్ద అబ్బాయి (60), కమల (45) దంపతులకు ఒక కుమారుడు రమణ, కుమార్తె ప్రేమావతి (25)లు ఉన్నారు. సుమారు మూడు సంవత్సరాల క్రితం అబ్బాయి, తన భార్య, కుమార్తెతో కలిసి కేశవరంలోని పొలాల్లో మకాం కాపలాదారునిగా పనికి కుదిరి కేశవరం మకాం వచ్చేశారు. కేశవరం ఎస్సీ కాలనీకి చెందిన అంబటి కృష్ణంరాజు అబ్బాయి కాపలా ఉంటున్న సమీపంలోని పొలంలోకి పనికి వెళ్లే క్రమంలో ప్రేమావతితో పరిచయం ఏర్పడింది. ఇరువురు ప్రేమించుకుని రెండు సంవత్సరాలు క్రితం పెళ్లి చేసుకున్నారు. స్థానికంగా ఇటుకల బట్టీలో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి ఏడాది వయస్సు కలిగిన కుమారుడు ఉండగా, ప్రస్తుతం ప్రేమావతి ఐదు నెలల గర్భిణి. మద్యానికి పూర్తిగా బానిసైన కృష్ణంరాజు తరచూ తాగివచ్చి ప్రేమావతిని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేసేవాడు.
కొద్దినెలలుగా అబ్బాయి స్థానికంగా ఉన్న రైస్‌మిల్లులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. తన భార్యతో కలిసి మిల్లు ఆవరణలోని షెడ్డులో మకాం ఉంటున్నాడు. రోజూ భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక నెల రోజుల క్రితం ప్రేమావతి తన కుమారుడిని తీసుకుని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. గ్రామంలోని పెద్దమనుషుల సమక్షంలో ఇటీవల తగవు పెట్టగా కాపురానికి వెళ్లేందుకు ఆమె ఇష్టపడలేదు. దీంతో రోజూ తాగివచ్చి భార్య, అత్తమామలతో గొడవ పడుతుండేవాడు. ఇదిలాఉండగా కరప మండలం కొరుపల్లి గ్రామానికి చెందిన ప్రేమావతి అన్న భార్య పందిరి నూకరత్నం కొద్దిరోజుల క్రితం చుట్టపు చూపుగా వచ్చింది. సోమవారం రాత్రి ప్రేమావతి, ఆమె కుమారుడు, నూకరత్నంలు షెడ్‌లో పడుకోగా, అబ్బాయి, అతని భార్య కమల మిల్లు వరండాలో పడుకున్నారు.
తన భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో సోమవారం అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వచ్చిన కృష్ణంరాజు తొలుత మంచంపై నిద్రిస్తున్న అత్త, మామలపై ఇనుపరాడ్‌తో దాడిచేశాడు. తలకు తీవ్రగాయాలవడంతో ఇరువురూ అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం షెడ్‌లో నిద్రిస్తున్న భార్య, ఆమె వదినపైనా దాడిచేశాడు. తలకు తీవ్రగాయమై భార్య ప్రేమావతి అక్కడిక్కడే మృతిచెందింది. అందరూ చనిపోయారని భావించి కుమారుడిని తీసుకుని తన ఇంటి వద్ద మంచంపై వదిలిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. గాయాలపాలైన నూకరత్నం బయటకు వచ్చి సమీపంలోని వారికి విషయం చెప్పింది. స్థానికులు గ్రామంలోని పీఎంపీ వైద్యుడిని సంఘటన స్థలానికి తీసుకురాగా అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. పోలీసులకు సమాచారమందించి నూకరత్నంను 108లో రాజమండ్రి తరలించగా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అర్ధరాత్రి పూట చిన్నపిల్లవాడి ఏడుపు విన్న కృష్ణంరాజు కుటుంబ సభ్యులు లేచి, రైస్‌మిల్లు వద్దకు చేరుకొనే సరికి వీరి మూడు మృతదేహాలు కనిపించాయి.
సంఘటన ఎలా జరిగిందో తనకు తెలియదని క్షతగాత్రురాలు నూకరత్నం చెబుతోంది. కళ్లు తిరిగి పడిపోయిన తనకు ఏమైందో తెలియలేదని ఆస్పత్రిలో పోలీసులకు నూకరత్నం చెప్పినట్టు తెలిసింది. వీఆర్‌ఓ గంటి శ్రీనివాస్, నూకరత్నం భర్త రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రామచంద్రపురం డీఎస్పీ రవీంద్రనాధ్, మండపేట సీఐ పీవీ రమణ, రూరల్ ఎస్సై ఎన్‌లక్ష్మణస్వామి సంఘటన స్థలిని పరిశీలించి. స్థానికులు, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న నిందితుని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు.
గర్భిణి అని కూడా చూడలేదు
గర్భిణి అని కూడా చూడకుండా ఇంత దారుణానికి ఒడిగట్టాడని మృతురాలి కుటుంబీకులు భోరున విలపిస్తున్నారు. తరచూ మద్యం సేవించి వచ్చి కొడుతుండడంతో కడుపులోని బిడ్డకు ఏమైనా అవుతుందన్న భయంతోనే ప్రేమావతి కాపురానికి వెళ్లేందుకు భయపడేది. కడుపులోని బిడ్డతో సహా హతమవడం వారిని తీవ్రంగా కలిచివేసింది.
Advertisement
Advertisement