లక్కీ మద్యం షాపు లాటరీ షురూ | Alcohol shop, how lucky lottery | Sakshi

లక్కీ మద్యం షాపు లాటరీ షురూ

Jun 29 2014 1:27 AM | Updated on Aug 17 2018 7:48 PM

లక్కీ మద్యం షాపు లాటరీ షురూ - Sakshi

లక్కీ మద్యం షాపు లాటరీ షురూ

జిల్లాలో లాటరీ పద్ధతిన మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ శనివారం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఈ కార్యక్రమం చేపట్టారు.

  • విజయవాడ ఈఎస్ పరిధిలోని 142 షాపుల కేటాయింపు
  •  మచిలీపట్నం పరిధిలోని షాపులకు కేటాయింపు నిలిపివేత
  • మచిలీపట్నం : జిల్లాలో లాటరీ పద్ధతిన మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ శనివారం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ల కార్యాలయ పరిధిలో 335 షాపులకు ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించారు. వీటిలో 51 షాపులకు ఒక్క దరఖాస్తూ రాలేదు.

    మిగిలిన 284 మద్యం షాపులను లాటరీ పద్ధతిన కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మచిలీపట్నం ఈఎస్ పరిధిలోని మద్యం షాపుల కేటాయింపును నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయటంతో వాటి కేటాయింపు నిలిపివేశారు. ఈ షాపుల కేటాయింపు తేదీని త్వరలో ప్రకటిస్తామని జాయింట్ కలెక్టర్ జె.మురళీ చెప్పారు.
     
    142 షాపుల కేటాయింపు...

    విజయవాడ ఈఎస్ పరిధిలో 162 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటిలో 20 దుకాణాలకు ఒక్క దరఖాస్తూ రాలేదు. మరో 15 మద్యం షాపులకు ఒక్కొక్కటి చొప్పున మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ముందుగా ఒకే దరఖాస్తు వచ్చిన మద్యం షాపులను కేటాయించారు. విజయవాడ ఈఎస్ పరిధిలో 174వ నంబరు నుంచి మద్యం షాపులు ప్రారంభమవుతాయి.

    174వ షాపునకు ఏకైక దరఖాస్తు రావడంతో అర్జీదారు దేవినేని నాగుకు ఆ షాపును కేటాయించారు. 182, 183, 189, 200, 212, 221, 231, 249, 255, 258, 297, 322వ నంబరు షాపులకు ఒక్కొక్కటి చొప్పున మాత్రమే దరఖాస్తులు రావటంతో వాటిని సంబంధిత వ్యక్తులకు కేటాయిస్తూ సంబంధి పత్రాలు అందజేశారు. 300, 316 నంబర్ల షాపులకు ఒక్కొక్క దరఖాస్తే వచ్చినా వారు గైర్హాజరు కావటంతో వాటి కేటాయింపు నిలిపివేశారు.
     
    లాటరీ పద్ధతిలో...

    రెండు.. అంతకుమించి దరఖాస్తులు వచ్చిన షాపులను అధికారులు లాటరీ పద్ధతిలో కేటాయించారు. ఇందులో భాగంగా ఒక్కొక్క షాపునకు సంబంధించి దరఖాస్తుదారులను పిలిచి వారికి ఇచ్చిన గేట్‌పాస్‌లను పరిశీలించి, వారి నంబర్లు ఉన్న టోకెన్లతో లాటరీ పద్ధతిన షాపుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభించారు. 175వ షాపునకు 27 దరఖాస్తులు రాగా.. లాటరీలో 14వ నంబరు పేరుతో ఉన్న కేఏ సుధీర్‌బాబుకు షాపు దక్కింది. 176వ షాపునకు 20 దరఖాస్తులు రాగా రెండో నంబరు టోకెన్ ఉన్న జమ్ముల అప్పారావు, 177వ షాపునకు ఆరు దరఖాస్తులు రాగా నాలుగో నంబరు టోకెన్ ఉన్న కె.కోటేశ్వరరావు, 178వ షాపునకు 27 దరఖాస్తులు రాగా 26వ నంబరు ఉన్న వై.శ్రీనివాసరావుకు లాటరీ పద్ధతిలో షాపులు దక్కాయి. ఇలా వరుస క్రమంలో లాటరీ ప్రక్రియలో షాపుల కేటాయింపు నిర్వహించారు.
     
    పకడ్బందీ ఏర్పాట్లు...
     
    లాటరీ పద్ధతిన షాపుల కేటాయింపు ప్రక్రియను అధికారులు పకడ్బందీగా చేపట్టారు. విజయవాడ నుంచి తీసుకువచ్చిన దరఖాస్తు బాక్సులకు మీడియా, దరఖాస్తుదారుల సమక్షంలో సీలు తీశారు. ఒక్కొక్క షాపునకు వచ్చిన దరఖాస్తులను బయటకు తీసి అర్జీదారులకు లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మద్యం వ్యాపారులు, వారి అనుచరులు, పలువురు దరఖాస్తుదారులు హాజరవడంతో ప్రాంగణం కిటకిటలాడింది. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

    కలెక్టరేట్‌కు ఉన్న మూడు ప్రధాన గేట్ల వద్ద గేట్ పాస్‌లను పరిశీలించిన అనంతరమే దరఖాస్తులను లోపలకు పంపారు. ప్రతి సర్కిల్ పరిధిలో స్టేషన్ల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి లాటరీలో మద్యం దుకాణాన్ని దక్కించుకున్న వారి నుంచి డిపాజిట్లు, సంబంధిత పత్రాలను స్వీకరించారు. మధ్యాహ్నం రెండు గంటలకే షాపుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించినా లాటరీ పద్ధతిలో తొలి షాపును 3.40 గంటలకు కేటాయించారు.
     
    అనంతరం ఆయా సర్కిళ్ల వారీగా మద్యం షాపులను కేటాయించి సంబంధిత పత్రాలు అందజేశారు. మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియలో ఏజేసీ బి.చెన్నకేశవరావు, ట్రైనీ కలెక్టర్ జి.సృజన, విజయవాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ జి.జోసఫ్, విజయవాడ ఈఎస్ ఎన్‌వీ రమణ, మచిలీపట్నం ఈఎస్ మురళీధర్, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీరావు, బందరు ఆర్డీవో సాయిబాబు, విజయవాడ, మచిలీపట్నం ఎక్సైజ్ సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement