
తీరంలో కిక్..
► ఆలయాలకు దగ్గరలోనే మద్యం దుకాణాలు
► భక్తులు, పర్యాటకుల ఇబ్బందులు చోద్యం చూస్తున్న అధికారులు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సాగరతీరం.. విశాఖకు మణిహారం. సాయంత్రమైతే కుటుంబ సమేతంగా నగర వాసులు కాసేపు గడపడానికి ఎంచుకునే రమణీయ స్థలం. నగర వాసులే కాకుండా దూర ప్రాంతా లకు చెందిన సందర్శకులు ఇక్కడి వస్తుంటారు. అయితే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు బీచ్ ఖ్యాతికి మాయని మచ్చలా మారుతున్నాయి.
పైగా బీచ్‌లో ఉన్న ప్రసిద్ధ ఆలయాల చెంతనే ఉన్న ఈ మద్యం షాపులు భక్తులకు చింతను కలిగిస్తున్నాయి. బీచ్‌రోడ్డులో ఉన్న ఆలయాలను సందర్శించడానికి నిరంతరం వేల సంఖ్యలో భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. అలాంటి చోట మద్యం షాపులను ఏర్పాటు చేయడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఆలయాలు, పాఠశాలలకు 200 అడుగుల దూరం లోపు మద్యం షాపులు ఏర్పాటు చేయకూడదనే నిబంధన ఉంది. అధికారులు, అధికార పార్టీ నాయకుల అండతో నిబంధనలు విరుద్ధంగా ఇక్కడ మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నారు. దీనిపై భక్తులు, స్థానికులు తీవ్ర అభ్యంతరం చెబుతున్నా.. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
ఇక్కడ మద్యం సేవించిన వారు సముద్రంలో ఈతకు దిగి ప్రమాదాలకు గురైన సందర్భాలెన్నో. కొంత మంది మందుబాబులు తాగిన మత్తులో సందర్శకులను వేధించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ తాగి గొడవలు చేసే వారితో ప్రశాంతత కరువవుతోందని స్థానికులు అంటున్నారు. ఈ విషయమై నెల రోజుల కిందట నగరానికి వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశామని, సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని స్థానికులు తెలిపారు. ఈ షాపుల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడం కొసమెరుపు.
బీచ్‌లో కాళీమాత ఆలయానికి చాలా ప్రాధాన్యం ఉంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అలాంటి ఈ ఆలయానికి కూతవేటు దూరంలో సాగర వైన్స్ పేరిట మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. అలాగే జూమ్ బార్ పేరుతో నిర్వహిస్తున్న మరో మద్యం షాపు రెండు ఆలయాలకు 50 అడుగుల దూరంలోనే ఉంది. రోజూ వేల సంఖ్యలో పర్యాటకులు తమ పిల్లలతో సేద తీరేందుకు సాగర తీరానికి వస్తుంటారు. వారికి కొట్టొచ్చినట్టు కనిపించేలా మద్యం షాపులు నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద బోర్డులు పెట్టి మరీ మందుబాబులను ఆకర్షించేలా దుకాణాలు నడపడం గమనార్హం.