
ఏపీకి మద్యం ఆదాయమే దిక్కు: యనమల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యం ఆదాయమే ప్రధానమని, మద్యం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. మద్యం ఆదాయం ఆగస్టులో వచ్చిన ఆదాయం కన్నా సెప్టెంబర్‌లో తగ్గుదల కనిపించడంపట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాన ఆదాయ వనరు మద్యమేనని ఆయన చెప్పారు.
మద్యం ఆదాయం తగ్గడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆదాయ వనరుల సమీకరణ శాఖల అధికారులతో మంత్రి సోమవారం సచివాలయంలో సమీక్షించారు. ఎక్కడెక్కడ ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉందో నివేదిక రూపంలో ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచే ఆలోచనలో ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లో కూడా మద్యం ధరలను పెంచాలని నిర్ణయించారు.