కొత్తపట్నంలో తీరప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
ఒంగోలు: తీరంలో పోలీసుశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు కోస్టల్, సివిల్, మెరైన పోలీసులు అంతా సముద్రంపై నిఘా పెట్టారు. ఒక వైపు ఉగ్రవాదులు రావొచ్చనే భావన , మరో వైపు ఫణి తుఫాను వెరసి సముద్రం వద్ద పోలీసులు ఎలాంటి చర్యనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు దృష్టిసారించారు. ఈ క్రమంలో భాగంగా ఒక వైపు సముద్రతీర ప్రాంతంలో పోలీసులు తగు చర్యలు చేపడుతుంటే జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మెరైన్ పోలీసు అధికారులతోను, తీరప్రాంతం ఉన్న మూడు సబ్‌డివిజన్ల పోలీసు అధికారులతోను తన ఛాంబరులో ఆదివారం సమీక్షించారు.
ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
శ్రీలంకలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు దాదాపు 300 మంది వరకు ఉండొచ్చని అంచనా. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని నిర్లక్ష్యం చేసినందుకు శ్రీలంక భారీ మూల్యం చెల్లించుకున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులపై శ్రీలంక పోలీసులు కఠిన చర్యలు చేపడుతుండడంతో ఉగ్రవాదులు పారిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా వారు బంగాళాఖాతంలో గుండా ఏడు రాష్ట్రాలలోకి చొరబడవచ్చని కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. ప్రధానంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గోవా, మహారాష్ట్రలలోకి ఐసిస్, వారి అనుబంధ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు చొరబడవచ్చని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. ప్రకాశం జిల్లాకు సంబంధించి కొత్తపట్నం, రామాయపట్నంలలో రెండు మెరైన్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. అధికారులు కొత్త వ్యక్తులు ఎవరైనా తీరప్రాంతంలోకి వస్తున్నారేమో అనే ఉద్దేశంతో బైనాక్యులర్స్ సాయంతో ప్రత్యేకంగా టవర్‌పై నుంచి మరీ గాలిస్తున్నారు. ఇక కొంతదూరం పడవులలో కూడా వెళ్తూ తీర ప్రాంత ప్రజలను ఈ అంశంపై అప్రమత్తం చేస్తున్నారు. ఎవరైనా కొత్తవ్యక్తులు తారసపడితే తమకు సమాచారం అందించాలంటూ పలు నంబర్లను వారికి అందజేస్తున్నారు. అంతే కాకుండా తీరప్రాంతంలోని పలు ప్రాంతాలలో గస్తీ కూడా ముమ్మరం చేశారు.మరో వైపు ముఖ్యపట్టణాలు, ప్రార్థనామందిరాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో కూడా బాంబు డిటెక్షన్ స్క్వాడ్, పోలీసు జాగిలాలు బాంబులు ఏవైనా ఉంటే గుర్తించే చర్యల్లో నిమగ్నమయ్యాయి.
ఫణితో మరింత అప్రమత్తం
ఈనెల 28వ తేదీ నుంచి ఫణి తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేస్తున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. తుఫాను ప్రభావం వల్ల ఎవరైనా సముద్ర తీర ప్రాంతంలోకి వచ్చి ఉంటే వారు సురక్షితంగా ఉండేందుకు ఉగ్రవాదులు ఒడ్డుకు చేరుకునేందుకు యత్నిస్తారని ఈ క్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తన చాంబర్‌లో తీర ప్రాంతం కలిగి ఉన్న డీఎస్పీలు ఉప్పుటూరి నాగరాజు, రాథేష్ మురళి, కండే శ్రీనివాసులతోపాటు కొత్తపట్నం మెరైన్ సీఐ బి.శ్రీనివాసరావు, రామాయపట్నం మెరైన్ సీఐ చెంచురామారావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ కె.వెంకటేశ్వరరావుతో సమీక్షించారు. 114 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఎటువైపు నుంచి కూడా ఉగ్రమూక రావడానికి వీల్లేదని అందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. ఎప్పటికప్పుడు నిఘా వర్గాలనుంచి వస్తున్న హెచ్చరికలను మీకు తెలియజేస్తూ ఉంటామని కనుక అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment