Marine police
-
శ్రీకాకుళం: సముద్ర తీరంలో విదేశీ డ్రోన్ జెట్ కలకలం
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని భావనపాడు సముద్ర తీరంలో విదేశీ డ్రోన్‌జెట్ ఒకటి కలకలం సృష్టించింది. కాగా, చేపలవేటకు వెళ్లిన మత్య్సకారులకు నీటిపై తేలియాడుతూ డ్రోన్ జెట్ కనిపించింది. దీంతో, వారు వెంటనే మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మెరైన్ పోలీసులు దీన్ని ఎవరు ప్రయోగించారు?, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కాగా, దానిపై ఉన్న అక్షరాలను బట్టి పోలీసులు కోడ్ చేస్తున్నారు. అయితే, ఇది విదేశాలకు చెందినదా?.. లేక స్వదేశంలో తయారైందా? అనే కోణంలో కూడా ఢిల్లీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మరోవైపు, వాతావరణ శాఖకు చెందిన, అంతరిక్ష పరిశోధనాల్లో ఇలాంటి డ్రోన్ జెట్లను శాస్త్రవేత్తలు వాడుతుంటారని సమాచారం. ఇక, దీన్ని ఎవరి ప్రయోగించారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. డ్రోన్‌పై ఈస్ట్ కోస్ట్ నావల్ అధికారులు కూడా దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే, దీన్ని ఎలాంటి కెమెరాలు లేవు. కానీ.. రేడియో సిగ్నల్స్‌ను పంపే కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రం ఉన్నట్టు సమాచారం. -
‘పోలీసన్నా మీ రుణం తీర్చుకోలేనిది’
శ్రీకాకుళం: మెరైన్ పోలీసులు చూపిన చొరవ ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. ఇంటిలో మనస్పర్థల కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు ఆపి కౌన్సెలింగ్ చేశారు. తన భర్త ప్రాణాలు నిలబెట్టినందుకు ఆ మహిళ పోలీసులకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కంచిలి మండలం ఎక్కల గ్రామానికి చెందిన జి.జోగారావు సోమవారం బారువ తీరంలో పురుగు మందు సీసా పట్టుకుని అనుమానాస్పదంగా తిరగడం పోలీసుల కంటపడింది. దీంతో బారువ మెరైన్ పోలీసులు హెచ్‌సీ జె.శంకరరావు, పీసీ దాలినాయుడు అతని వద్దకు పరుగెత్తుకు వెళ్లి సీసా లాక్కుని విచారించారు. కుటుంబంలో గొడవ జరగడంతో ఆత్మహత్య చేసుకుందామని ఇక్కడకు వచ్చానని జోగారావు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అతని ఫోన్ నంబర్, ఆధార్ కార్డు నంబర్ తీసుకుని భార్య కిరమణి, గ్రామ పెద్దలను పిలిపించారు. వారి సమక్షంలోనే జోగారావుకు కౌన్సెలింగ్ చేశారు. పోలీసులు చూపిన చొరవకు జోగారావు భార్య కిరమణి ఉద్వేగంతో కృతజ్ఞతలు చెప్పారు. తన మాంగల్యాన్ని, కుటుంబాన్ని కాపాడారంటూ కన్నీరు పెట్టుకున్నారు. కౌన్సెలింగ్ అనంతరం వారిని పోలీసులు పంపించేశారు. బారువ మెరైన్ పోలీసుల స్పందనకు ఎక్కల సర్పంచ్ శ్రీనివాసరావు, గ్రామపెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. -
తీరంలో రెడ్ అలర్ట్
ఒంగోలు: తీరంలో పోలీసుశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు కోస్టల్, సివిల్, మెరైన పోలీసులు అంతా సముద్రంపై నిఘా పెట్టారు. ఒక వైపు ఉగ్రవాదులు రావొచ్చనే భావన , మరో వైపు ఫణి తుఫాను వెరసి సముద్రం వద్ద పోలీసులు ఎలాంటి చర్యనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు దృష్టిసారించారు. ఈ క్రమంలో భాగంగా ఒక వైపు సముద్రతీర ప్రాంతంలో పోలీసులు తగు చర్యలు చేపడుతుంటే జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మెరైన్ పోలీసు అధికారులతోను, తీరప్రాంతం ఉన్న మూడు సబ్డివిజన్ల పోలీసు అధికారులతోను తన ఛాంబరులో ఆదివారం సమీక్షించారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలు శ్రీలంకలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు దాదాపు 300 మంది వరకు ఉండొచ్చని అంచనా. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని నిర్లక్ష్యం చేసినందుకు శ్రీలంక భారీ మూల్యం చెల్లించుకున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులపై శ్రీలంక పోలీసులు కఠిన చర్యలు చేపడుతుండడంతో ఉగ్రవాదులు పారిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా వారు బంగాళాఖాతంలో గుండా ఏడు రాష్ట్రాలలోకి చొరబడవచ్చని కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. ప్రధానంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గోవా, మహారాష్ట్రలలోకి ఐసిస్, వారి అనుబంధ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు చొరబడవచ్చని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. ప్రకాశం జిల్లాకు సంబంధించి కొత్తపట్నం, రామాయపట్నంలలో రెండు మెరైన్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. అధికారులు కొత్త వ్యక్తులు ఎవరైనా తీరప్రాంతంలోకి వస్తున్నారేమో అనే ఉద్దేశంతో బైనాక్యులర్స్ సాయంతో ప్రత్యేకంగా టవర్‌పై నుంచి మరీ గాలిస్తున్నారు. ఇక కొంతదూరం పడవులలో కూడా వెళ్తూ తీర ప్రాంత ప్రజలను ఈ అంశంపై అప్రమత్తం చేస్తున్నారు. ఎవరైనా కొత్తవ్యక్తులు తారసపడితే తమకు సమాచారం అందించాలంటూ పలు నంబర్లను వారికి అందజేస్తున్నారు. అంతే కాకుండా తీరప్రాంతంలోని పలు ప్రాంతాలలో గస్తీ కూడా ముమ్మరం చేశారు.మరో వైపు ముఖ్యపట్టణాలు, ప్రార్థనామందిరాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో కూడా బాంబు డిటెక్షన్ స్క్వాడ్, పోలీసు జాగిలాలు బాంబులు ఏవైనా ఉంటే గుర్తించే చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఫణితో మరింత అప్రమత్తం ఈనెల 28వ తేదీ నుంచి ఫణి తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేస్తున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. తుఫాను ప్రభావం వల్ల ఎవరైనా సముద్ర తీర ప్రాంతంలోకి వచ్చి ఉంటే వారు సురక్షితంగా ఉండేందుకు ఉగ్రవాదులు ఒడ్డుకు చేరుకునేందుకు యత్నిస్తారని ఈ క్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు భావిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తన చాంబర్లో తీర ప్రాంతం కలిగి ఉన్న డీఎస్పీలు ఉప్పుటూరి నాగరాజు, రాథేష్ మురళి, కండే శ్రీనివాసులతోపాటు కొత్తపట్నం మెరైన్ సీఐ బి.శ్రీనివాసరావు, రామాయపట్నం మెరైన్ సీఐ చెంచురామారావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ కె.వెంకటేశ్వరరావుతో సమీక్షించారు. 114 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఎటువైపు నుంచి కూడా ఉగ్రమూక రావడానికి వీల్లేదని అందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. ఎప్పటికప్పుడు నిఘా వర్గాలనుంచి వస్తున్న హెచ్చరికలను మీకు తెలియజేస్తూ ఉంటామని కనుక అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
తీరం..నిర్లక్ష్యం
మెరైన్ పోలీస్ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత తీరప్రాంత భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వానికి చెవికెక్కినట్టులేదు. చొరబాట్లకు అవకాశం ఉన్న చోట్ల నిఘా పెట్టాలని సూచించినా స్పందన శూన్యంగానే ఉంది. తీర భద్రతపై ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం కనబరుస్తుందనే విమర్శలొస్తున్నాయి. కొన్ని మెరైన్ పోలీస్స్టేషన్లు ఏర్పాటుచేసినా ప్రయోజనం లేకుండా పోయింది. నిపుణులైన సిబ్బంది, స్పీడ్బోట్లు తదితర వసతులు కల్పించకపోవడంతో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సాక్షి, అమరావతిబ్యూరో : నిత్యం ‘పారా షుషార్’గా ఉండాల్సిన తీరప్రాంత భద్రతా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. కొత్త మెరైన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు లేదు... కొత్త బోట్లు రావు... ఉన్న బోట్లకు డీజిల్‌కు బడ్జెట్ ఇవ్వరూ...సిబ్బంది నియామకాలు లేవు...చొరబాట్లకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో నిఘా లేదు. జాతీయ మెరైన్ పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయకపోయినా స్పందన శూన్యం......ఇదీ రాజధాని జిల్లాల్లో మెరైన్ పోలీసు వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం. ప్రకటనలకే పరిమితమైన మెరైన్ స్టేషన్ల పెంపు..తూర్పుతీరంలో కీలకంగా ఉండే కృష్ణా, గుంటూరు జిల్లాల తీరప్రాంతం కేంద్రీకృతమై ఉంది. దాదాపు 170కి.మీ. పొడవైన తీరప్రాంతం ఈ జిల్లాల సొంతం. రాజధాని అమరావతికి అనుసంధానంగా ఉంది. ఇంతటి కీలకమైనప్పటికీ అమరావతి పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మెరైన్ పోలీస్ వ్యవస్థపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. అమరావతి పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రస్తుతం 5 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో గిలకలదిండి, వరాలగుండి, పాలకాలయతిప్ప, గుంటూరు జిల్లాలో సూర్యలంక, నిజాంపట్నంలలో ఏర్పాటు చేశారు. కీలకమైన రాజధాని ప్రాంతానికి అవి ఏమాత్రం సరిపోవని 2015లోనే గుర్తించారు. రెండు జిల్లాల్లో మరో నాలుగు మెరైన్ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది. ఇంతవరకు కొత్తగా ఒక్క మెరైన్ పోలీస్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనే లేదు. కనీస వసతుల కరువు..కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న మెరైన్ పోలీస్ స్టేషన్లు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గిలకలదిండి, సూర్యలంక మెరైన్ పోలీస్స్టేషన్లకు మూడేసి చొప్పున గస్తీ బోట్లు సమకూర్చారు. అన్ని పోలీస్స్టేషన్లకు కొత్తగా మూడేసి బోట్లు సమకూర్చాలన్న ప్రతిపాదనను పట్టించుకోనేలేదు. ఉన్న బోట్లు కూడా కొన్ని నెలలుగా తీరంలోనే లంగరు వేసే ఉన్నాయి. డీజిల్ వ్యయానికి ప్రభుత్వం ఇంతవరకు బడ్జెట్ కేటాయించకపోవడమే కారణం. బోట్ల నిర్వహణకు తగినంతమంది నిపుణులైన సిబ్బంది (బోట్ క్రూ) లేరు. ఒక్కో పోలీస్ స్టేషన్‌కు 10 మంది చొప్పున 50 మందిని నియమించాల్సి ఉంది. కానీ రెండేళ్లుగా నియమించనే లేదు. రెండు జిల్లాల్లోని తీరప్రాంతంలో గస్తీ నిర్వహణకు మెరైన్ పోలీస్ విభాగానికి 2 ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ బోట్లు మాత్రమే ఉన్నాయి. కనీసం మరో 8 బోట్లు అవసరమని గుర్తించారు. రూ.16 కోట్లతో 2016 చివరికి వాటిని సమకూర్చాలని ప్రతిపాదించారు. కానీ ఒక్క స్పీడ్బోటునూ సమకూర్చుకోలేదు. అమరావతి పరిధిలో ఒక మెరైన్ పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం అమలుకూ నోచుకోలేదు. నిఘా సంస్థల హెచ్చరించినా మొద్దు నిద్..రేకేంద్ర నిఘా సంస్థల నివేదిక ప్రకారం కృష్ణా, గుంటూరు జిల్లాల తీరప్రాంతంలో 25 వరకు చొరబాటు ప్రాంతాలున్నాయి. వాటిలో రెండు వ్యూహాత్మక ప్రాంతాలు అత్యంత సున్నితమైనవిగా గుర్తించాయి. వాటన్నింటి వద్దా ఔట్ పోస్టులు ఏర్పాటు చేయాలన్న సూచనను రాష్ట్రం పట్టించుకోనేలేదు. మెరైన్ అకాడమీపై కేంద్రం వెనకడుగు..మచిలీపట్నంలో జాతీయ మెరైన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం మాటతప్పింది. గుజరాత్‌లోని ద్వారకాలో మాత్రమే అకాడమీ ఏర్పాటు చేస్తామని చెప్పింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీసస్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేయలేదు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా పారా హుషార్ అంటుందా... ఏమో చూడాల్సిందే. -
నిమజ్జనంలో అపశ్రుతి..ఒకరు మృత్యువాత
వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు ఒకరు చనిపోయారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్రతీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పొన్నలూరు మండల కేంద్రానికి చెందిన కొందరు బుధవారం మధ్యాహ్నం తమ గ్రామంలో నెలకొల్పిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు సముద్రతీరానికి చేరుకున్నారు. ఆరుగురు వ్యక్తులు విగ్రహాన్ని సముద్రంలో వదిలేసేందుకు లోపలికి వెళ్లారు. అయితే, అలల తాకిడికి వారంతా నీటి ఉధృతిలో చిక్కుకున్నారు. ఒడ్డున ఉన్న వారు మెరైన్ పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే అక్కడికి చేరుకుని ఐదుగురిని ఒడ్డుకు తీసుకురాగలిగారు. లింగంగుంట రమేష్ అనే యువకుడు మాత్రమే అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
మన తీరం భద్రమేనా..
- తూర్పు తీరంలో కీలకంగా మారిన విశాఖ - నిరంతర నిఘాతో కోస్టు గార్డు అప్రమత్తం - భరోసా ఇస్తున్న నౌకాదళం - మెరైన్ పోలీస్‌ను వెంటాడుతున్న సిబ్బంది కరువ సాక్షి, విశాఖపట్నం : గుజరాత్ తీరంలో శుక్రవారం జరిగిన సంఘటన ప్రజానీకాన్ని కలవరపర్చింది. ఆయుధాలతో పాక్ పడవొకటి తీరంలోకి చొరబడేందుకు చేసిన యత్నం గగుర్బాటు కలగించింది. తీరంతో అల్లుకున్న విశాఖ భద్రతపై ఒక్కసారిగా ఇక్కడి ప్రజానీకం ఉలికిపడింది. ఇదే సందర్భంలో విశాల తీరమున్న విశాఖలో భద్రత ఎలా ఉందనే ప్రశ్న అందరిలో మెదిలింది. నిరంతరం కంటికి రెప్పలా తీరాన్ని పరిరక్షిస్తున్న కోస్టుగార్డు..మెరైన్ పోలీసు బలగాలు మాత్రం అప్రమత్తమై ఎలాంటి ఢోకా లేదంటూ భరోసానిస్తున్నాయి. జిల్లాలో 170 కిలోమీటర్లు మేర తీర ప్రాంతం ఉంది. నగర కమిషనరేట్ సరిధిలో 45 కిలో మీటర్ల తీరముంది. దీని రక్షణకు నగరంలో కోస్ట్‌గార్ట్ స్టేషన్‌ను 1987లో రిషికొండ వద్ద నెలకొల్పారు. కోస్ట్ గార్ట్కు 200 మీటర్ల పొడవున్న సొంత జెట్టీ కూడా ఉంది. తీరరక్షణ దళం 24గంటలూ తీరంపై డేగకన్ను వేస్తుంది. కొంత కాలంగా మెరైన్ పోలీస్ వ్యవస్థను కూడా పటిష్టపరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటోంది. అయితే ఈ వ్యవస్థను ఇంకా బలోపేతం చేయాల్సి ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆదిలో చేసిన హడావిడి ఇప్పుడు కనిపించడం లేదు. ఈ విభాగం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. తీర రక్షణకు మెరైన్ పోలీస్ స్టేషన్‌ను రుషికొండ, ఒన్‌టౌన్‌లోని విశాఖ టెర్మినల్ వద్ద, పూడిమడక ప్రాంతంలో ఏర్పాటు చేశారు. విశాఖ మెరైన్ పోలీస్ స్టేషన్లకు ఓ ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీ, 42 మంది కానిస్టేబుళ్లను మంజూరు చేస్తే ప్రస్తుతం ఏఎస్పీతో పాటు 25 మంది కంటే తక్కువగా కానిస్టేబుళ్లు ఉన్నారు. అన్నిటినీ మించి మెరైన్ పోలీస్ వింగ్ ప్రధానాధికారి ఇప్పటికీ హైదరాబాద్‌లోనే ఉన్నారు. తీరమే లేని రాజధాని నుంచి దీని ఆపరేషనుకు చర్యలేమిటనే విమర్శ వినిపిస్తోంది. రాష్ట్ర మెరైన్ పోలీస్ వింగ్ ప్రధాన కేంద్రానికి 2012 నవంబర్ నుంచి హరీష్‌కుమార్ గుప్తా టాప్ బాస్‌గా ఉన్నారు. విశాఖలో ఐజి శ్రీనివాసరెడ్డి ఉండేవారు. కానీ దినేష్‌రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు ఆయన కూడా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. రాష్ట్ర విభజన జరిగినా మన రాష్ట్రానికి ప్రధానాధికారిని ప్రత్యేకంగా కేటాయంచలేదు. మెరైన్ పోలీస్‌కు కేటాయించిన జెట్టీని నిలిపేందుకు కూడా పోర్టులో అనుకూల స్థలం లేదు. సంఘటన జరగకమునుపే ఇలాంటి వ్యవహారాలపై స్పందించాల్సిన అవసరముంది. తూర్పు నౌకాదళం కేంద్రం తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రం నగరంలోనే ఉండటం తీరరక్షణకు సానుకూలాంశం. భారీ బలగమున్న ఈ నౌకాదళం ఇప్పటికే ఎన్నో విజయాలను నమోదు చేసుకుంది. నాలుగు దశాబ్దాల కిందటే పాకిస్తానుకు తన సత్తాను చూపించిందీ శౌర్యదళం. ప్రాధాన్యత దృష్ట్యా టార్గెట్ తూర్పు తీరంలో విశేష ప్రాధాన్యమున్న ప్రాంతం విశాఖపట్నం. అందువల్లే నాలుగు దశాబ్దాల కిందటే ఈ నగరాన్ని శత్రుదేశం తన టార్గెట్టుగా ఎంచుకుంది. అప్పటికి నగరంలో పెద్దగా పరిశ్రమలు లేవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలోని కొన్ని ప్రాముఖ్య నగరాల్లో విశాఖకూడా ఒకటి. కీలకమైన పరిశ్రమలు ఇక్కడ కేంద్రీకృతమయి ఉన్నాయి. కేంద్ర సంస్థలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నవిశాఖ తీర రక్షణలో మరింత అప్రమత్తం కావల్సిన అవసరముందని ఇక్కడ ప్రజలంటున్నారు. 1971లో విశాఖలో చొరబడటానికి పాకిస్థాన్ తీవ్రవాదులు ప్రయత్నించారు. అయితే మన నౌకాదళం మన రక్షక దళం ప్రాణాలొడ్డి పోరాడి విజయం సాధించింది. దానికి గుర్తుగా ప్రతి ఏటా డిసెంబర్ 5న నేవీ డే నిర్వహిస్తున్నారు. ముష్కరులు దాడి చేస్తే ఏ విధంగా ఎదుర్కోడానికి మన దగ్గర ఉన్న సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ఆనాటి యుద్ధానికి చిహ్నంగా బీచ్ రోడ్డులో ‘విక్టరీ ఎట్ సీ’ పార్కును 1996లో నిర్మించారు. ఆనాటి నుంచీ విశాఖ తీరం శత్రు దుర్భేధ్యంగానే ఉంది. ఎలాంటి చొరబాట్లకు అవకాశం లేకుండా సముద్రంలో కోస్ట్ గార్డ్, ఉపరితలంపై పోలీస్ విభాగాలు నిరంతరం పహారా కాస్తున్నాయి. -
నిఘాలో నిర్లక్ష్యం
ఒంగోలు క్రైం : సముద్రమార్గాల ద్వారా దేశంలోకి అక్రమంగా ప్రవేశించే విదేశీయులను అడ్డుకునేందుకు తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మెరైన్ పోలీస్స్టేషన్ల పనితీరు జిల్లాలో అధ్వానంగా మారింది. తీరంవెంట నిరంతరం నిఘా ఉంచి విదేశీ విద్రోహ శక్తులతో పాటు సముద్ర జలాల ద్వారా అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిని అడ్డుకోవాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. కానీ, పోలీస్ అధికారులతో పాటు ఆయా మెరైన్ పోలీస్స్టేషన్ల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నీరుగారిపోతోంది. ఫలితంగానే శ్రీలంక దేశస్తులు జిల్లాలోకి ప్రవేశించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 102 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరప్రాంతం ఉంది. గుంటూరు జిల్లా అడవీధిపాలెం, కృపానగర్ నుంచి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా చెన్నాయపాలెం వరకు విస్తరించి ఉంది. ఈ తీర ప్రాంతం పరిధిలో నిఘా కోసం జిల్లాలో రెండు మెరైన్ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపట్నం మండల కేంద్రంలోని తీరప్రాంతంలో ఒకటి, గుడ్లూరు మండలం రామాయపట్నం తీరప్రాంతంలో మరొకటి ఏర్పాటు చేశారు. రెండు మెరైన్ పోలీస్స్టేషన్లకు మొత్తం 105 మంది సిబ్బందిని నియమించారు. వారిని 8 బీట్ సెక్షన్లుగా విభజించి జిల్లా పరిధిలోని 102 కిలోమీటర్ల తీరప్రాంతంలో రేయింబవళ్లు గస్తీ నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఒక్కో స్టేషన్‌కు సీఐ స్థాయి పోలీస్ అధికారిని ఇన్చార్జిగా నియమించారు. కొత్తపట్నం మెరైన్ పోలీస్‌స్టేషన్‌లో ఒక సీఐ, ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 32 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హోంగార్డులు కలిపి మొత్తం 52 మంది పనిచేస్తున్నారు. రామాయపట్నం మెరైన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సీఐతో పాటు ఎస్సై, ఏఎస్సై పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. వీరుకాకుండా ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 35 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. పర్యవేక్షించని ఉన్నతాధికారులు... మెరైన్ పోలీస్స్టేషన్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన పోలీస్‌శాఖ జిల్లా ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడంలేదు. జిల్లాలో మెరైన్ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేసి సుమారు రెండేళ్లవుతుంది. ఈ రెండేళ్లలో రెండు మెరైన్ పోలీస్స్టేషన్లకు ఇద్దరేసి చొప్పున సీఐలు మారారు. రామాయపట్నం స్టేషన్లో సీఐతో పాటు ఎస్సై, ఏఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమర్థులైన అధికారులతో ఆయా పోస్టులను భర్తీచేసి అధికారులతో పాటు సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తీరప్రాంతంలో నిఘా పెంచడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారు. శ్రీలంక దేశస్తులు తీరం ద్వారా జిల్లాలోకి అక్రమంగా ప్రవేశించడమే అందుకు నిదర్శనంగా ఉంది. దీంతో పోలీస్ ఉన్నతాధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
తీర గస్తీకి తీవ్ర సుస్తీ!
కొన్ని రోజుల క్రితం విశాఖ సమీపంలో సముద్ర మార్గంలో వస్తున్న ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న అతడికి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. దీనిపై మెరైన్ పోలీసులు గోప్యత పాటిస్తున్నప్పటికీ ఇది అత్యంత తీవ్రమైనదన్నది మాత్రం కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో జిల్లాలో తీరప్రాంత భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో కూడిన తీరప్రాంత భద్రతపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కళింగపట్నం కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల తీరప్రాంత భద్రతను మెరైన్ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కానీ ఈ రెండు జిల్లాలకు కేంద్ర స్థానంగా ఉన్న కళింగపట్నం మెరైన్ పోలీస్‌స్టేషన్‌నే ఇంతవరకు పూర్తిస్థాయిలో తీర్చిదిద్దలేకపోయారు. ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేసి రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకు మౌలిక వసతులు కల్పించ లేదు. ఆరు నెలల క్రితం మెరైన్ పోలీస్ అదనపు డీఐజీ కళింగపట్నంలో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా చేసిన ప్రకటన కూడా ఆచరణకు నోచుకోలేదు. కళింగపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా తీరప్రాంత గస్తీకి 12 టన్నులు, 5 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు బోట్లు సమకూరుస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికీ అవి లేదు. దాంతో తీరప్రాంత గస్తీ నామమాత్ర ప్రక్రియగా మిగిలిపోతోంది. రూ.15 కోట్ల నిధుల విడుదలపై అశ్రద్ధ ఇక కళింగపట్నం కేంద్రం పరిధిలో కొత్తగా మూడు మెరైన్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ అసంపూర్తిగా మిగిలిపోయింది. శ్రీకాకుళం జిల్లాలోని బారువ, భావనపాడు, విజయనగరం జిల్లాలోని చింతపల్లి వద్ద ఈ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేరకు తాత్కాలిక ప్రాతిపదికన అందుబాటులో ఉన్న చిన్న భవనాల్లో ఏర్పాటు చేశారు. భావనపాడులో ఓ ప్రభుత్వ హాస్టల్లో, బారువలో తుఫాన్ రక్షిత భవనంలో స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఏడాదిలోపు వాటిని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం స్థల సేకరణ జరిపి ఒక్కో భవనాన్ని రూ.5 కోట్లతో నిర్మిస్తామన్నారు. స్థలాలను గుర్తించారు కానీ ఇంతవరకు సేకరణ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇక స్టేషన్ల నిర్మాణ ప్రతిపాదనను దాదాపుగా పక్కన పెట్టేశారనే చెప్పాలి. నిధులు విడుదల కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిధుల మంజూరు గురించి పట్టించుకునే నాథుడేలేకుండాపోయారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మత్స్యకారుల భాగస్వామ్యమేదీ? మత్స్యకారులకు భాగస్వామ్యం కల్పిస్తూ తీరప్రాంత భద్రతను పటిష్ట పరుస్తామని ప్రభుత్వం చెప్పింది. అందుకోసం మత్స్యకార గ్రామాల్లోని యువతను గుర్తించి శిక్షణ ఇస్తామని పేర్కొంది. వారు తీరంలో చేపల వేట కొనసాగిస్తూనే మెరైన్ పోలీసులకు సహకరించేలా మౌలిక వసతులు కల్పిస్తామని, ప్రత్యేక భృతి కూడా ఇస్తామని వెల్లడించింది. కానీ ఇవేవీ ఈ రెండేళ్లలో కార్యరూపం దాల్చలేదు. అసలు తీరప్రాంత గస్తీలో మత్స్యకారులను భాగస్వాములను చేసే ప్రక్రియనే ప్రభుత్వం పక్కనపడేసింది. విశాఖ కేంద్రమైతేనే...! రాష్ట్ర విభజన నేపథ్యంలో మెరైన్ పోలీసింగ్‌పై ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ఇంతవరకు వెల్లడించలేదు. విశాఖపట్నం లో ఉన్న మెరైన్ పోలీస్ ప్రధాన కేంద్రాన్ని ఏడాది క్రితం హైదరాబాద్‌కు తరలించారు. తీరమే లేని హైదరాబాద్‌లో మెరైన్ పోలీస్ ప్రధాన కేంద్రం ఏర్పాటు చేయడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కనీసం రాష్ట్ర విభజన నేపథ్యంలోనైనా దాన్ని తిరిగి విశాఖపట్నానికి మార్చాలని ప్రభుత్వం యోచించకపోవడం విస్మయం కలిగిస్తోంది. విశాఖలో ప్రధాన కేంద్రం ఏర్పాటు చేస్తేనే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని తీరప్రాంత భద్రతపై ఉన్నతస్థాయిలో కార్యాచరణ మొదలవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. అంతవరకు తీరప్రాంత భదత్ర దైవాధీనమే. -
సముద్ర తీరప్రాంతంలో చొరబాటుదారులపై నిఘా పెరిగింది
సాక్షి, గుంటూరు: సముద్ర తీరప్రాంతంలో చొరబాటుదారులపై నిఘా పెరిగింది. సముద్ర మార్గం గుండా దేశంలో చొరబడే అరాచక శక్తుల్ని పట్టుకొనేందుకు మెరైన్ పోలీసు అధికారులు ప్రత్యేక ప్రణాళిక అమలు చే స్తున్నారు. ఇటీవల శ్రీలంక నుంచి వచ్చి చేపల వేట చేస్తున్న బోటును నెల్లూరు వద్ద మెరైన్ సిబ్బంది పట్టుకున్నారు. అప్పటి నుంచి తీరప్రాంతంలో నిఘా మరింత పెంచారు. జిల్లాలో సుమారు 73 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉండగా, బాపట్ల, నిజాంపట్నంలలో మెరైన్ పోలీస్స్టేషన్లు ఉన్నాయి. వీటిల్లో 70 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రధానంగా ఓడరేవులు, బీచ్ ఏరియాల్లో తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. తీరప్రాంతంలోని కర్లపాలెం, పిట్టలవానిపాలెం, నిజాంపట్నం, బాపట్ల, రేపల్లె, సూర్యలంక తదితర ప్రాంతాల్లోని 38 గ్రామాల్లో ప్రస్తుతం చొరబాటుదారుల నియంత్రణ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల్లో స్థానిక మత్స్యకారులతో కమిటీలు ఏర్పాటు చేసి దొంగదారుల్లో దేశంలోకి ప్రవేశించేవారిని అడ్డుకోనున్నారు. 12 చెక్ పోస్టుల ఏర్పాటుతో.. తీరప్రాంతంలో రెండు మెరైన్ పోలీస్స్టేషన్లతో పాటు ప్రాంతాల వారీగా మొత్తం 12 చోట్ల తీరంలో నిఘా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గుర్తించిన గ్రామాల్లో కొత్త వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు మెరైన్ సిబ్బంది తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మెరైన్ పోలీసులు సముద్రంలోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా మూడు బోట్లు ఉండగా, వాటిల్లో సిబ్బంది వెళ్లి అనుమానాస్పదంగా ఉన్న బోట్లను తనిఖీ చేస్తున్నారు. చేపల వేటకెళ్లిన మత్స్యకారుల నుంచి మెరైన్ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. ఈక్రమంలోనే నెల్లూరు వద్ద శ్రీలంక బోటును పట్టుకుని, అందులో ఉన్నవారిని రిమాండ్‌కు పంపారు. అప్పటి నుంచి అప్రమత్తమైన మెరైన్ పోలీసు అధికారులు సముద్ర తీరప్రాంతంలో నిఘా పెంచారు. ఆయా గ్రామాల్లో 1093 టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి సమాచారాన్ని రాబడుతున్నారు. -
ఆయుధాలతో పట్టుబడిన చైనా నౌక: దర్యాప్తు ముమ్మరం
-
ఆయుధాలతో పట్టుబడిన చైనా నౌక: దర్యాప్తు ముమ్మరం
చెన్నై: అక్రమంగా భారీ ఆయుధాలతో తరలి వస్తున్న చైనా నౌకను తమిళనాడు మెరైన్ పోలీసులు పట్టుకున్నారు. తుత్తుకుడి పోర్టుకు 3 కిలో మీటర్ల దూరంలో అధికారులు దీనిని నిలిపివేసి తనిఖీ చేశారు. ఈ నౌకలో పది మంది సిబ్బందితోపాటు 25 మంది సాయుధులు ఉన్నారు. ఈ నౌకలో భారీగా ఆయుధాలు, బాంబులు కూడా ఉన్నాయి. ఈ నౌకను సోమాలియా బంధిపోట్లు ఉపయోగించినట్లుగా అనుమానిస్తున్నారు. గతంలొ ముంబయిలో దాడులకు పాల్పడేందుకు కసబ్ తదితర ఉగ్రవాదులు సీమెన్‌గార్డు అనే చైనా నౌక ద్వారా నగరంలోకి ప్రవేశించినట్లు అప్పట్లో విచారణలో తేలింది. దీంతో చైనా నౌకల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత్‌లోని హార్బర్లకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సీమెన్‌గార్డు చైనా నౌక మూడు నెలల క్రితం భారత్ చేరుకుంది. దీనిని దేశ సరిహద్దుల్లోనే అధికారులు తనిఖీ చేయగా అప్పట్లో అనుమానాస్పద వస్తువులు ఏమీ లభించలేదు. అయినా చైనా నౌకలను హార్బర్ అధికారులు అనుమానిస్తూనే ఉన్నారు. మూడు నెలల క్రితం మన అధికారులు తనిఖీ చేసిన ఇదే చైనా నౌక శుక్రవారం అర్ధరాత్రి సమయంలో తూత్తుకూడి హార్బర్‌ను సమీపించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో నౌకను తూత్తుకూడి అధికారులు సముద్రంలోనే నిలిపివేశారు. అప్రమత్తమైన అధికారులు ‘నాయకిదేవీ’ అనే యుద్ధనౌకలో వేగంగా ఎదురెళ్లి సీమెన్‌గార్డు నౌకలో తనిఖీలు చేశారు. నౌకలో అనేక ఆయుధాలు దాచి ఉంచడాన్ని అధికారులు గుర్తించారు. కేంద్రం ఆదేశాల మేరకు తూత్తుకూడి హార్బర్‌కు 10 మైళ్ల దూరంలో నౌకను నిలిపేశారు. నౌక చుట్టూ గస్తీ నౌకలు, మరబోట్లు ఉంచారు. అమెరికా నుంచి రాక! చైనాలో రిజిస్టరైన ఈ నౌక ప్రస్తుతం అమెరికా నుంచి తూత్తుకూడి చేరుకున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. సముద్రపు దొంగల బారి నుంచి కాపాడుకునేందుకే ఆయుధాలు సమకూర్చుకున్నట్లు చైనా నౌకలోని సిబ్బంది సమర్థించుకున్నారు. ప్రపంచంలోని అన్ని హార్బర్లకూ తిరిగే విధంగా అనుమతి పొందామని వివరించారు. అయితే చైనా నౌక వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపింది. చెన్నై తదితర జిల్లాలలో విధ్వంసాలకు పాల్పడేందుకు చైనా నుంచి ఉగ్రవాదులు మరోసారి ప్రవేశించే ప్రయత్నం చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంబయి దాడుల నేపథ్యంలో ఏ అంశాన్నీ సులభంగా తీసుకోరాదని భావి స్తున్నారు. క్షుణ్ణంగా విచారణ జరిపి ఒక నిర్ధారణకు రానిదే సీమెన్‌గార్డు నౌకను విడిచిపెట్టరాదని కేంద్రహోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కేం ద్రం ఆదేశించే వరకు సీమెన్‌గార్డు చుట్టూ బందోబస్తు కొనసాగిస్తామని తూత్తుకూడి హార్బర్ అధికారులు స్పష్టం చేశారు. దర్యాప్తును ముమ్మరం చేశారు.