తీర గస్తీకి తీవ్ర సుస్తీ!
కొన్ని రోజుల క్రితం విశాఖ సమీపంలో సముద్ర మార్గంలో వస్తున్న ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న అతడికి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. దీనిపై మెరైన్ పోలీసులు గోప్యత పాటిస్తున్నప్పటికీ ఇది అత్యంత తీవ్రమైనదన్నది మాత్రం కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో జిల్లాలో తీరప్రాంత భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో కూడిన తీరప్రాంత భద్రతపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కళింగపట్నం కేంద్రంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల తీరప్రాంత భద్రతను మెరైన్ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కానీ ఈ రెండు జిల్లాలకు కేంద్ర స్థానంగా ఉన్న కళింగపట్నం మెరైన్ పోలీస్‌స్టేషన్‌నే ఇంతవరకు పూర్తిస్థాయిలో తీర్చిదిద్దలేకపోయారు. ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేసి రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకు మౌలిక వసతులు కల్పించ లేదు. ఆరు నెలల క్రితం మెరైన్ పోలీస్ అదనపు డీఐజీ కళింగపట్నంలో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా చేసిన ప్రకటన కూడా ఆచరణకు నోచుకోలేదు. కళింగపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా తీరప్రాంత గస్తీకి 12 టన్నులు, 5 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు బోట్లు సమకూరుస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికీ అవి లేదు. దాంతో తీరప్రాంత గస్తీ నామమాత్ర ప్రక్రియగా మిగిలిపోతోంది.
రూ.15 కోట్ల నిధుల విడుదలపై అశ్రద్ధ
ఇక కళింగపట్నం కేంద్రం పరిధిలో కొత్తగా మూడు మెరైన్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ అసంపూర్తిగా మిగిలిపోయింది. శ్రీకాకుళం జిల్లాలోని బారువ, భావనపాడు, విజయనగరం జిల్లాలోని చింతపల్లి వద్ద ఈ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మేరకు తాత్కాలిక ప్రాతిపదికన అందుబాటులో ఉన్న చిన్న భవనాల్లో ఏర్పాటు చేశారు. భావనపాడులో ఓ ప్రభుత్వ హాస్టల్‌లో, బారువలో తుఫాన్ రక్షిత భవనంలో స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఏడాదిలోపు వాటిని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం స్థల సేకరణ జరిపి ఒక్కో భవనాన్ని రూ.5 కోట్లతో నిర్మిస్తామన్నారు. స్థలాలను గుర్తించారు కానీ ఇంతవరకు సేకరణ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇక స్టేషన్ల నిర్మాణ ప్రతిపాదనను దాదాపుగా పక్కన పెట్టేశారనే చెప్పాలి. నిధులు విడుదల కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. నిధుల మంజూరు గురించి పట్టించుకునే నాథుడేలేకుండాపోయారని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
మత్స్యకారుల భాగస్వామ్యమేదీ?
మత్స్యకారులకు భాగస్వామ్యం కల్పిస్తూ తీరప్రాంత భద్రతను పటిష్ట పరుస్తామని ప్రభుత్వం చెప్పింది. అందుకోసం మత్స్యకార గ్రామాల్లోని యువతను గుర్తించి శిక్షణ ఇస్తామని పేర్కొంది. వారు తీరంలో చేపల వేట కొనసాగిస్తూనే మెరైన్ పోలీసులకు సహకరించేలా మౌలిక వసతులు కల్పిస్తామని, ప్రత్యేక భృతి కూడా ఇస్తామని వెల్లడించింది. కానీ ఇవేవీ ఈ రెండేళ్లలో కార్యరూపం దాల్చలేదు. అసలు తీరప్రాంత గస్తీలో మత్స్యకారులను భాగస్వాములను చేసే ప్రక్రియనే ప్రభుత్వం పక్కనపడేసింది.
విశాఖ కేంద్రమైతేనే...!
రాష్ట్ర విభజన నేపథ్యంలో మెరైన్ పోలీసింగ్‌పై ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ఇంతవరకు వెల్లడించలేదు. విశాఖపట్నం లో ఉన్న మెరైన్ పోలీస్ ప్రధాన కేంద్రాన్ని ఏడాది క్రితం హైదరాబాద్‌కు తరలించారు. తీరమే లేని హైదరాబాద్‌లో మెరైన్ పోలీస్ ప్రధాన కేంద్రం ఏర్పాటు చేయడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కనీసం రాష్ట్ర విభజన నేపథ్యంలోనైనా దాన్ని తిరిగి విశాఖపట్నానికి మార్చాలని ప్రభుత్వం యోచించకపోవడం విస్మయం కలిగిస్తోంది. విశాఖలో ప్రధాన కేంద్రం ఏర్పాటు చేస్తేనే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని తీరప్రాంత భద్రతపై ఉన్నతస్థాయిలో కార్యాచరణ మొదలవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. అంతవరకు తీరప్రాంత భదత్ర దైవాధీనమే.