
శ్రీకాకుళం: మెరైన్ పోలీసులు చూపిన చొరవ ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. ఇంటిలో మనస్పర్థల కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు ఆపి కౌన్సెలింగ్ చేశారు. తన భర్త ప్రాణాలు నిలబెట్టినందుకు ఆ మహిళ పోలీసులకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కంచిలి మండలం ఎక్కల గ్రామానికి చెందిన జి.జోగారావు సోమవారం బారువ తీరంలో పురుగు మందు సీసా పట్టుకుని అనుమానాస్పదంగా తిరగడం పోలీసుల కంటపడింది.
దీంతో బారువ మెరైన్ పోలీసులు హెచ్‌సీ జె.శంకరరావు, పీసీ దాలినాయుడు అతని వద్దకు పరుగెత్తుకు వెళ్లి సీసా లాక్కుని విచారించారు. కుటుంబంలో గొడవ జరగడంతో ఆత్మహత్య చేసుకుందామని ఇక్కడకు వచ్చానని జోగారావు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అతని ఫోన్ నంబర్, ఆధార్ కార్డు నంబర్ తీసుకుని భార్య కిరమణి, గ్రామ పెద్దలను పిలిపించారు.
వారి సమక్షంలోనే జోగారావుకు కౌన్సెలింగ్ చేశారు. పోలీసులు చూపిన చొరవకు జోగారావు భార్య కిరమణి ఉద్వేగంతో కృతజ్ఞతలు చెప్పారు. తన మాంగల్యాన్ని, కుటుంబాన్ని కాపాడారంటూ కన్నీరు పెట్టుకున్నారు. కౌన్సెలింగ్ అనంతరం వారిని పోలీసులు పంపించేశారు. బారువ మెరైన్ పోలీసుల స్పందనకు ఎక్కల సర్పంచ్ శ్రీనివాసరావు, గ్రామపెద్దలు కృతజ్ఞతలు తెలిపారు.