
ప్రతీకాత్మక చిత్రం
ఎచ్చెర్ల క్యాంపస్: మద్యానికి బానిసై, మానసిక వైకల్యంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి తన భార్య, అక్కను నరికి చంపాడు. అనంతరం తానూ మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ ముద్దాడపేటకు చెందిన రీసు అప్పన్న కల్లుగీత కార్మికుడిగా పనిచేయడంతో పాటు గొర్రెలు, మేకల మాంసం అమ్ముతుండేవాడు. మద్యానికి బానిసవ్వడంతో తరచూ ఇంటిలో గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పూటుగా మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. శనివారం వేకువజామున 4 గంటల సమయంలో తన భార్య అప్పమ్మ(35)ను వేటకత్తితో నరికి చంపేశాడు. ఈ శబ్దానికి లేచి తమ్ముడిని అడ్డుకునే క్రమంలో అక్క చెల్లుబోయిన రాజులు (40)ను సైతం నరకడంతో ఆమె కూడా అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి అసిరోడు, అక్క కుమార్తె(మేనకోడలు) పద్మలు అడ్డుకునే ప్రయత్నం చేయగా వీరిపైనా దాడికి ప్రయత్నించడంతో గాయపడి భయంతో పరుగులు తీశారు. స్థానికులు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు.
ఇంతలో అప్పన్న కత్తితో మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న అప్పన్నను శ్రీకాకుళం రిమ్స్ అస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. స్వల్పంగా గాయపడ్డ నిందితుడి తండ్రి, మేనకోడలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment