పెట్రోలు తడిచిన దుస్తులతో బోను మధు, డీటీని నిలదీస్తున్న బాధితులు
ఒకపక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమది రైతు ప్రభుత్వమంటూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంటే.. ఆ స్ఫూర్తిని పొందలేని కొందరు సిబ్బంది గ్రామీణులను చిన్నచూపు చూస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలీని ఓ చదువులేని రైతు చెప్పులరిగేలా తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన బాధితుడు ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
సాక్షి, వంగర (శ్రీకాకుళం): సాగులో ఉన్న భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.. తొందరగా పని పూర్తి చేసి ఆదుకోవాలి.. ఇదీ ఆ రైతు విన్నపం. కానీ 40 రోజులుగా తిరుగుతున్నా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోలేదు. ఇది అతనిని ఎంతో ఆవేదనకు గురి చేసింది. చివరి ప్రయత్నంగా అధికారి ముందు బైఠాయించినా ఫలితం లేకపోవడంతో మరణమే శరణమనుకున్నాడు. వంగర మండలం వెలుగు కార్యాలయంలో శనివారం ఈ దురదృష్టకర ఘటన జరిగింది. సంగాం గ్రామానికి చెందిన మహిళా రైతు బోను లక్ష్మీనారాయణమ్మ పేరుతో ఉన్న సాగుభూమిని ఆన్‌లైన్‌లో నమో దు చేయాలని ఆమె కుమారుడు బోను మధు 40 రో జులుగా వీఆర్వో రాంబాబు చుట్టూ తిరుగుతున్నాడు.
సర్వే నెంబర్ 88లో తమకున్న 75 సెంట్ల భూమి లెక్కలు ఆన్‌లైన్‌లో తప్పుగా ఉన్నాయని, సర్వే నెంబర్ 151లో తమకున్న 31 సెంట్ల భూమి ఆన్‌లైన్ నమోదు కాలేదని వేడుకున్నాడు. అయినా ఫలితం లేదు. తమకు అవగాహన లేక ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయలేకపోయామని, వీఆర్‌ఓ తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని మధు వాపోయాడు. ఫలితం లేకపోవడంతో వెలుగు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డీటీ గోవిందరావు వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులందరూ బైఠాయించారు. తమ సమస్య పట్టించుకోలేదంటూ అసహనానికి గురైన మధు ఓ టిన్నులో తెచ్చిన పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతనిని వారించిన డీటీ బి.గోవిందరావు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ బండారు రామారావు కలుగజేసుకొని సర్వేయర్ ఎ.కృష్ణతోపాటు సంగాం గ్రామం వెళ్లి భూములు పరిశీలించి సర్వే చేశారు. ఆన్‌లైన్‌లో నమోదుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment