నిర్మాణంలో శివాలయం ,చేతిగాయం చూపిస్తున్న సంధ్య
ఎచ్చెర్ల క్యాంపస్: ఎస్‌ఎంపురం గ్రామంలో శివాలయ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. అసంపూర్తిగా నిలిచిపోయిన ఈ నిర్మాణ పనుల్లో రాజకీయ జోక్యం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఇందులో జోక్యం చేసుకోవద్దని పోలీసులను బెదిరిస్తూ.. ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ భవనం మీద నుంచి దూకి జెడ్పీ మాజీ అధ్యక్షురాలు చౌదిరి ధనలక్ష్మి తనయుడు, మాజీ సర్పంచ్ అవినాష్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం గాయాలతో శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాలు సేకరిస్తున్న పోలీసులు
గ్రామంలో శివాలయ నిర్మాణం చివరి దశలో ఉంది. కొంతకాలంగా ఈ పనులు నిలిచిపోవటంతో స్థానిక వివాహిత చౌదిరి సంధ్య ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మాణంతోపాటు, ప్రతిష్ట కోసం విగ్రహాలను కొనుగోలుకు మహాబలిపురం విగ్రహ నిర్మాణ శిల్ప సంస్థకు బయానా చెల్లించింది. ఇదేక్రమంలో ఆ నిర్మాణం తామే పూర్తి చేస్తామని టీడీపీ వర్గానికి చెందిన కొంతమంది పట్టుబట్టారు. ఈ విషయమై ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. ఈమెకు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు బాసటగా నలిచారు. దీంతో పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలకు ఆలయ కమిటీ ఏర్పాటు చేసి నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలో శివాలయ నిర్మాణ పనులు సంధ్య పర్యవేక్షణలో శుక్రవారం చేపట్టారు. దీన్ని టీడీపీ నాయకుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ముందస్తు సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఘర్షణ వాతావరణæం చక్కబెట్టారు. టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎచ్చెర్ల ఎస్సై రాజేష్, సీఐ మల్లేశ్వరావు వేధిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీస్‌లను బెదిరిస్తూ స్టేషన్ టెర్రాస్ పైకి అవినాష్ చేరుకున్నాడు. శ్లాబ్ పట్టుకుని జారే క్రమంలో ఆవరణలో ఉన్న కారుపై పడ్డాడు. దీంతో 108 వాహనంలో శ్రీకాకుళం కిమ్స్‌లో చేర్పించారు. గాయపడ్డ అవినాష్, కుటుంబ సభ్యుల నుంచి ఎచ్చెర్ల ఏఎస్సై కృష్ణ వివరాలు తీసుకున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. జిల్లా అదపపు ఎస్పీ సోమశేఖర్, డీఎస్పీ మూర్తి గ్రామం సందర్శించారు.
పోలీసులు రక్షణగా నిలిచారు....
పోలీసులు నాకు రక్షణగా నిలిచారు. టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదిరి నారాయణమూర్తి (బాబ్జి), అతడి కుమారుడు మాజీ సర్పంచ్ అవినాష్, మాజీ ఎంపీటీసీ గొండు నర్సింగరావు దాడికి ప్రయత్నించారు. పోలీసులు రక్షణగా నిలిచారు. ఈ దాడిలో నా చేతికి గాయమైంది. దీనిపై ఫిర్యాదు చేశాను. గతంలో ఆలయ నిర్మాణ కమిటీ లేకుండానే పనులు చేశారు. రాజకీయాలతో నాకు సంబంధం లేదు. టీడీపీ నాయకులు నన్ను డబ్బులు అడిగారు. అవి దుర్వినియోగం అవుతాయన్న ఉద్దేశంతో నేను ముందుకు వచ్చి నిర్మాణం ప్రారంభించాను. రూ. 25 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. దైవభక్తి, ప్రజాప్రయోజన పనులను రాజకీయం చేయటం తగదు. ఆలయ నిర్మాణంలో శాంతియుతంగా వ్యవహరించిన పోలీసులకు బెదిరింపులు చేయడం సరికాదు. సహకరించాల్సిన మాజీ సర్పంచ్ అవినాష్ ఆత్మహత్యకు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. – సంధ్య, ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చిన దాత
Comments
Please login to add a commentAdd a comment