మెరైన్ పోలీస్ వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత తీరప్రాంత భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వానికి చెవికెక్కినట్టులేదు. చొరబాట్లకు అవకాశం ఉన్న చోట్ల నిఘా పెట్టాలని సూచించినా స్పందన శూన్యంగానే ఉంది. తీర భద్రతపై ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం కనబరుస్తుందనే విమర్శలొస్తున్నాయి. కొన్ని మెరైన్ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటుచేసినా ప్రయోజనం లేకుండా పోయింది. నిపుణులైన సిబ్బంది, స్పీడ్‌బోట్లు తదితర వసతులు కల్పించకపోవడంతో భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
సాక్షి, అమరావతిబ్యూరో : నిత్యం ‘పారా షుషార్’గా ఉండాల్సిన తీరప్రాంత భద్రతా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. కొత్త మెరైన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు లేదు... కొత్త బోట్లు రావు... ఉన్న బోట్లకు డీజిల్‌కు బడ్జెట్ ఇవ్వరూ...సిబ్బంది నియామకాలు లేవు...చొరబాట్లకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో నిఘా లేదు. జాతీయ మెరైన్ పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయకపోయినా స్పందన శూన్యం......ఇదీ రాజధాని జిల్లాల్లో మెరైన్ పోలీసు వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం.
ప్రకటనలకే పరిమితమైన మెరైన్ స్టేషన్ల పెంపు..తూర్పుతీరంలో కీలకంగా ఉండే కృష్ణా, గుంటూరు జిల్లాల తీరప్రాంతం కేంద్రీకృతమై ఉంది. దాదాపు 170కి.మీ. పొడవైన తీరప్రాంతం ఈ జిల్లాల సొంతం. రాజధాని అమరావతికి అనుసంధానంగా ఉంది. ఇంతటి కీలకమైనప్పటికీ అమరావతి పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మెరైన్ పోలీస్ వ్యవస్థపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. అమరావతి పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రస్తుతం 5 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో గిలకలదిండి, వరాలగుండి, పాలకాలయతిప్ప, గుంటూరు జిల్లాలో సూర్యలంక, నిజాంపట్నంలలో ఏర్పాటు చేశారు. కీలకమైన రాజధాని ప్రాంతానికి అవి ఏమాత్రం సరిపోవని 2015లోనే గుర్తించారు. రెండు జిల్లాల్లో మరో నాలుగు మెరైన్ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అప్పట్లోనే ప్రకటించింది. ఇంతవరకు కొత్తగా ఒక్క మెరైన్ పోలీస్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనే లేదు.
కనీస వసతుల కరువు..కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న మెరైన్ పోలీస్ స్టేషన్లు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గిలకలదిండి, సూర్యలంక మెరైన్ పోలీస్‌స్టేషన్లకు మూడేసి చొప్పున గస్తీ బోట్లు సమకూర్చారు. అన్ని పోలీస్‌స్టేషన్లకు కొత్తగా మూడేసి బోట్లు సమకూర్చాలన్న ప్రతిపాదనను పట్టించుకోనేలేదు. ఉన్న బోట్లు కూడా కొన్ని నెలలుగా తీరంలోనే లంగరు వేసే ఉన్నాయి. డీజిల్ వ్యయానికి ప్రభుత్వం ఇంతవరకు బడ్జెట్ కేటాయించకపోవడమే కారణం. బోట్ల నిర్వహణకు తగినంతమంది నిపుణులైన సిబ్బంది (బోట్ క్రూ) లేరు. ఒక్కో పోలీస్ స్టేషన్‌కు 10 మంది చొప్పున 50 మందిని నియమించాల్సి ఉంది. కానీ రెండేళ్లుగా నియమించనే లేదు. రెండు జిల్లాల్లోని తీరప్రాంతంలో గస్తీ నిర్వహణకు మెరైన్ పోలీస్ విభాగానికి 2 ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ బోట్లు మాత్రమే ఉన్నాయి. కనీసం మరో 8 బోట్లు అవసరమని గుర్తించారు. రూ.16 కోట్లతో 2016 చివరికి వాటిని సమకూర్చాలని ప్రతిపాదించారు. కానీ ఒక్క స్పీడ్‌బోటునూ సమకూర్చుకోలేదు. అమరావతి పరిధిలో ఒక మెరైన్ పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం అమలుకూ నోచుకోలేదు.
నిఘా సంస్థల హెచ్చరించినా మొద్దు నిద్..రేకేంద్ర నిఘా సంస్థల నివేదిక ప్రకారం కృష్ణా, గుంటూరు జిల్లాల తీరప్రాంతంలో 25 వరకు చొరబాటు ప్రాంతాలున్నాయి. వాటిలో రెండు వ్యూహాత్మక ప్రాంతాలు అత్యంత సున్నితమైనవిగా గుర్తించాయి. వాటన్నింటి వద్దా ఔట్ పోస్టులు ఏర్పాటు చేయాలన్న సూచనను రాష్ట్రం పట్టించుకోనేలేదు.
మెరైన్ అకాడమీపై కేంద్రం వెనకడుగు..మచిలీపట్నంలో జాతీయ మెరైన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం మాటతప్పింది. గుజరాత్‌లోని ద్వారకాలో మాత్రమే అకాడమీ ఏర్పాటు చేస్తామని చెప్పింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీసస్థాయిలో కూడా నిరసన వ్యక్తం చేయలేదు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా పారా హుషార్ అంటుందా... ఏమో చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment