ఒంగోలు క్రైం : సముద్రమార్గాల ద్వారా దేశంలోకి అక్రమంగా ప్రవేశించే విదేశీయులను అడ్డుకునేందుకు తీరప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మెరైన్ పోలీస్‌స్టేషన్ల పనితీరు జిల్లాలో అధ్వానంగా మారింది. తీరంవెంట నిరంతరం నిఘా ఉంచి విదేశీ విద్రోహ శక్తులతో పాటు సముద్ర జలాల ద్వారా అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిని అడ్డుకోవాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. కానీ, పోలీస్ అధికారులతో పాటు ఆయా మెరైన్ పోలీస్‌స్టేషన్ల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నీరుగారిపోతోంది. ఫలితంగానే శ్రీలంక దేశస్తులు జిల్లాలోకి ప్రవేశించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 102 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరప్రాంతం ఉంది. గుంటూరు జిల్లా అడవీధిపాలెం, కృపానగర్ నుంచి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా చెన్నాయపాలెం వరకు విస్తరించి ఉంది. ఈ తీర ప్రాంతం పరిధిలో నిఘా కోసం జిల్లాలో రెండు మెరైన్ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తపట్నం మండల కేంద్రంలోని తీరప్రాంతంలో ఒకటి, గుడ్లూరు మండలం రామాయపట్నం తీరప్రాంతంలో మరొకటి ఏర్పాటు చేశారు.
రెండు మెరైన్ పోలీస్‌స్టేషన్లకు మొత్తం 105 మంది సిబ్బందిని నియమించారు. వారిని 8 బీట్ సెక్షన్లుగా విభజించి జిల్లా పరిధిలోని 102 కిలోమీటర్ల తీరప్రాంతంలో రేయింబవళ్లు గస్తీ నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఒక్కో స్టేషన్‌కు సీఐ స్థాయి పోలీస్ అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. కొత్తపట్నం మెరైన్ పోలీస్‌స్టేషన్‌లో ఒక సీఐ, ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 32 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హోంగార్డులు కలిపి మొత్తం 52 మంది పనిచేస్తున్నారు. రామాయపట్నం మెరైన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సీఐతో పాటు ఎస్సై, ఏఎస్సై పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. వీరుకాకుండా ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 35 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు.
పర్యవేక్షించని ఉన్నతాధికారులు...
మెరైన్ పోలీస్‌స్టేషన్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన పోలీస్‌శాఖ జిల్లా ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించడంలేదు. జిల్లాలో మెరైన్ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి సుమారు రెండేళ్లవుతుంది. ఈ రెండేళ్లలో రెండు మెరైన్ పోలీస్‌స్టేషన్లకు ఇద్దరేసి చొప్పున సీఐలు మారారు. రామాయపట్నం స్టేషన్‌లో సీఐతో పాటు ఎస్సై, ఏఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సమర్థులైన అధికారులతో ఆయా పోస్టులను భర్తీచేసి అధికారులతో పాటు సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తీరప్రాంతంలో నిఘా పెంచడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారు. శ్రీలంక దేశస్తులు తీరం ద్వారా జిల్లాలోకి అక్రమంగా ప్రవేశించడమే అందుకు నిదర్శనంగా ఉంది. దీంతో పోలీస్ ఉన్నతాధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
నిఘాలో నిర్లక్ష్యం
Published Wed, Aug 27 2014 3:39 AM | Last Updated on Fri, Nov 9 2018 6:35 PM
Advertisement