'నా భర్త నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించండి'
హైదరాబాద్: ఎస్‌ఐగా పనిచేస్తున్న తన భర్త నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉన్నట్లు బుధవారం ఓ వివాహిత మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్‌సీ)ని ఆశ్రయించింది.
చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన సవితాబాయ్ అలిపిరి స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న గణేష్ భార్య. వీరు గతంలో శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నారు. ఇరువురికీ రెండో పెళ్లి.
గణేష్ గత కొంతకాలంగా విడాకులు కావాలంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. తనకు, తన ఇద్దరు పిల్లలకు రక్షణ కల్పించాలని కోరడంతో ఫిర్యాదు స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ ఈనెల 29 లోపు విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తిరుపతి అర్బన్ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.