సస్పెన్షన్ తొలగింపునకు ఫ్లెక్సీలతో కాకా
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా మీ అభిమాని పేరుతో వెలసిన ఫ్లెక్సీల మిస్టరీ వీడింది. అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్‌కు గురైన జిల్లా మాజీ విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం వీటిని ఏర్పాటుచేసినట్లు సమాచారం. సస్పెన్షన్ వేటును తొలగించుకుని మళ్లీ పోస్టింగ్ పొందే క్రమంలో ఆయన మంత్రికి అజ్ఞాత అభిమానిగా మారినట్లు తెలుస్తోంది. విక్రమ సింహపురి యూనివర్సిటీ భవనాల భూమి పూజకు ఈనెల 2వ తేదీన గంటా శ్రీనివాసరావు నెల్లూరు వచ్చారు. ఆయనకు స్వాగతం పలుకుతూ రెండు రోజుల ముందుగానే అయ్యప్పగుడి నుంచి ట్రంకురోడ్డు మీదుగా గాంధీబొమ్మ, నర్తకీసెంటర్ వరకు ‘మీ అభిమాని’ పేరుతో భారీ ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి.
రకరకాల ఫోజుల్లో ఉన్న గంటా ఫొటోలను సినీహీరోలను తలపించేలా ఆ ఫ్లెక్సీల్లో ముద్రించడం అప్పట్లో నెల్లూరులో చర్చనీయాంశంగా మారింది. ఈ ‘మీ అభిమాని’ ఎవరో తెలియక అందరూ ఆలోచనలో పడ్డారు. ఆ వ్యక్తి ఎవరై ఉంటారనే అంశంపై రకరకాల చర్చలు సాగాయి. మంత్రి స్వస్థలమైన విశాఖపట్టణానికి చెందిన వ్యక్తులే నెల్లూరులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని భావించారు. అయితే అభిమాని రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదని మాజీ డీఈఓ మువ్వా రామలింగం అని తెలుసుకున్న పలువురు ఔరా! అనుకుంటున్నారు.
నారాయణ సహకారంతో !
విద్యాశాఖలో అత్యంత వివాదాస్పదుడిగా పేరుపొందిన మువ్వా రామలింగం సస్పెన్షన్ వేటును తొలగించుకునేందుకు మంత్రి గంటాను కాకాపట్టినట్లు తెలిసింది. మొదట ఆయనను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేరదీసినట్లు సమాచారం. సస్పెన్షన్ తొలగించి, పోస్టింగ్ ఇవ్వాలని మంత్రి గంటాకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి గంటాను ప్రసన్నం చేసుకొనేందుకు ఈ మాజీ డీఈఓ ‘మీ అభిమాని’ అవతారం ఎత్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రకాశం డీఈఓగా త్వరలో పోస్టింగ్
ఇద్దరు మంత్రుల అండతో మువ్వా తన ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నట్లు వినికిడి. సస్పెన్షన్ తొలగింపు, పోస్టింగ్‌కు సంబంధించిన ఫైలు నారాయణ ద్వారా మంత్రి గంటాకు చేరిందని విద్యాశాఖలో ప్రచారం జరుగుతోంది. మంత్రి గంటా నెల్లూరు డీఈవోగా మళ్లీ మువ్వాను నియమించేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ఈ క్రమంలో నెల్లూరుకు బదులుగా ప్రకాశం జిల్లాలో డీఈవోగా నియమించేందుకు ఆసక్తి చూపారని, ఇందుకు సంబంధించి ఫైలు కూడా సిద్ధైమైందని తెలుస్తోంది. మరో వారం పదిరోజుల్లో ఈ విషయం తేలిపోనుందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి.
మీ అభిమాని ‘మువ్వా‘?
Published Mon, Aug 18 2014 4:00 AM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM
Advertisement
Advertisement