State Education Minister
-
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
పంచపాండవులు ఎంతమందంటే... పంచపాండవులు ఎంతమంది అంటే ఓస్ నాకెందుకు తెలియదు ... మంచం కోళ్లలా ముగ్గురుంటారని చెప్పి నాలుగేళ్లు చూపించాడట వెనుకటికో వ్యక్తి. అలా ఉంది రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట తీరు. సెప్టెంబరు 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. అక్కడితో పరిమితం కాకుండా ఏకంగా 20 వేల టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నిరుద్యోగ టీచర్లు ఇక మాకు ఉద్యోగాలు వచ్చేస్తాయోచ్ అంటూ ఎగిరి గంతేశారు. తరువాత ఆ సంఖ్యను 15 వేలకు కుదించారు ... తాజాగా 10,500 కు చేరింది. ఇక్కడితో ఆగుతుందో ఇంకెంత దిగజారుతుందోనని భయపడుతున్నారు ఆశతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులు. ఒంగోలు వన్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి డీఎస్సీ 2014 ప్రకటిస్తామంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం నిరుద్యోగుల టీచర్ల ఆశలపై నీళ్లు చల్లింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఉపాధ్యాయుల నియామకానికి డీఎస్సీ-2014ను ప్రకటిస్తున్నామంటూ గొప్పలు చెబుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు గత రెండు నెలలుగా రోజూ ప్రకటన చేస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 5 వెళ్లి నెలరోజులు కావస్తున్నా ఇప్పటివరకు డీఎస్సీ ప్రకటన విషయంలో అతీగతీ లేదు. డీఎస్సీ-2014కు ప్రకటించే పోస్టుల విషయంలో కూడా స్పష్టత లేదు. మొదట 20 వేల టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. తరువాత ఆ సంఖ్యను 15 వేలకు కుదించారు. ఆ తరువాత అది 10,500కు చేరింది. డీఎస్సీని నిర్వహించే విషయంలో అసలు ప్రభుత్వానికి ఒక స్పష్టత లేకుండా పోయింది. దీంతో నిరుద్యోగ టీచర్లందరూ అయోమయానికి గురవుతున్నారు. గత ప్రభుత్వం డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) పాసై ఉండాలని నిబంధన పెట్టారు. ప్రస్తుతం డీఎస్సీ ఉపాధ్యాయ అర్హతా పరీక్ష రెండూ కలిపే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. దీంతో గతంలో ఉపాధ్యాయ అర్హతా పరీక్ష పాసైన వారి పరిస్థితి ఏమిటని నిరుద్యోగ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హతా పరీక్ష, డీఎస్సీ రాత పరీక్ష రెండింటినీ ఏ సిలబస్ ప్రకారం నిర్వహిస్తారు, ఈ రెండింటిలో దేనికెంత ప్రాధాన్యం ఇస్తారు అనే విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. 30 వేల మంది నిరీక్షణ జిల్లాలో సుమారు 30 వేల మంది నిరుద్యోగ టీచర్లు డీఎస్సీ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం పొంతనలేని ప్రకటనలతో వీరిని అయోమయానికి గురిచేస్తోంది. ప్రకటనపై ఆశతో వేలకు వేలు ఖర్చు పెట్టి శిక్షణా కేంద్రాల్లో చేరి శిక్షణ కూడా పొందారు. కొందరైతే దూర ప్రాంతాలైన అవనిగడ్డ, నంద్యాలకు వెళ్లి శిక్షణ పొందారు. డీఎస్సీకి బీఈడీ మెలిక ప్రభుత్వం డీఎస్సీ ప్రకటనకు బీఈడీ మెలిక పెట్టింది. సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు కేవలం డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ (డిఈడి) పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని గతంలో సుప్రీంకోర్డు తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం గత రెండు డీఎస్సీలలో డి.ఈ.డ.ి అభ్యర్థులను మాత్రమే అర్హులుగా ప్రకటించారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం బీఈడీ అభ్యర్థులకు కూడా సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హత కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసింది. ఎస్.జి.టి. పోస్టులకు బి.ఈ.డి వారిని కూడా అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆ లేఖకు కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఆ లేఖ సాకు చూపుతూ డీఎస్సీ ప్రకటనను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. జిల్లాలో 839 ఖాళీలు జిల్లాలో ప్రస్తుతం వెయ్యికి పైగా ఉపాధాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 839 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. సెకండ్‌గ్రేడ్ (తెలుగు) 715, సెకండ్‌గ్రేడ్ (ఉర్ధు) 8, స్కూలు అసిస్టెంట్లు గణితం 14, బయోలాజికల్ సైన్స్ 14, సోషల్ స్టడీస్ 43, తెలుగు 1, హిందీ 6, ఉర్ధు 1, బాషా పండితులు ఉర్ధు 1, సంస్కృతం 2, హిందీ 13, వ్యాయామోపాధ్యాయులు 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ పాఠశాలల్లో 8, జిల్లా పరిషత్, మండల పరిషత్ యాజమాన్యాలలోని పాఠశాలల్లో 831 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. -
ఉద్యమ ద్రోహమే కాంగ్రెస్‌కు శాపం
హుజూర్నగర్ : తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే ఆ పార్టీని శాపంగా వెంటాడుతోందని రాష్ట్ర విద్యాశాఖ మం త్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని టౌన్హాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా టీఆర్ఎస్లో చేరా రు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వా రికి మెడలో గులాబీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ప్రజలు ఉద్యమం చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిందన్నారు. అందుకే గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పారన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ చేస్తున్న కృషికి అండగా ఉండేందుకు వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. వంద రోజుల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఏమీ జరగలేదని కొందరు నాయకులు అర్థంపర్థంలేని మాటలుమాట్లాడుతున్నారని విమర్శించారు. ఎడమకాల్వకు సాగునీరు విడుదల చేయకుండా చేతగాని దద్దమ్మల్లా కూర్చొని నోరు మెదపకుండా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. ఆంధ్రోళ్లకు నీళ్లమ్ముకున్న టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మ య్య.. రైతుల ఆత్మహత్యల గురించి మా ట్లాడటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి ము ఖ్యమంత్రి కేసీఆర్ జెట్ వేగంతో తీసుకువెళ్తున్నారన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో 1000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం జరిగితే,ఇందులో 10 వేల ఇళ్ల బిల్లులు కాజేశారన్నారు. త్వరలోనే అక్రమాలు వెలుగులోకి రానున్నాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సాముల శివారెడ్డి, కాసోజు శంకరమ్మ, చిలకరాజు నర్సయ్య, శ్రీనివాసరెడ్డి,ప్రవీణారెడ్డి, దొ డ్డా నర్సింహారావు, చిలకరాజు అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
మీ అభిమాని ‘మువ్వా‘?
సస్పెన్షన్ తొలగింపునకు ఫ్లెక్సీలతో కాకా సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా మీ అభిమాని పేరుతో వెలసిన ఫ్లెక్సీల మిస్టరీ వీడింది. అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని సస్పెన్షన్‌కు గురైన జిల్లా మాజీ విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం వీటిని ఏర్పాటుచేసినట్లు సమాచారం. సస్పెన్షన్ వేటును తొలగించుకుని మళ్లీ పోస్టింగ్ పొందే క్రమంలో ఆయన మంత్రికి అజ్ఞాత అభిమానిగా మారినట్లు తెలుస్తోంది. విక్రమ సింహపురి యూనివర్సిటీ భవనాల భూమి పూజకు ఈనెల 2వ తేదీన గంటా శ్రీనివాసరావు నెల్లూరు వచ్చారు. ఆయనకు స్వాగతం పలుకుతూ రెండు రోజుల ముందుగానే అయ్యప్పగుడి నుంచి ట్రంకురోడ్డు మీదుగా గాంధీబొమ్మ, నర్తకీసెంటర్ వరకు ‘మీ అభిమాని’ పేరుతో భారీ ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి. రకరకాల ఫోజుల్లో ఉన్న గంటా ఫొటోలను సినీహీరోలను తలపించేలా ఆ ఫ్లెక్సీల్లో ముద్రించడం అప్పట్లో నెల్లూరులో చర్చనీయాంశంగా మారింది. ఈ ‘మీ అభిమాని’ ఎవరో తెలియక అందరూ ఆలోచనలో పడ్డారు. ఆ వ్యక్తి ఎవరై ఉంటారనే అంశంపై రకరకాల చర్చలు సాగాయి. మంత్రి స్వస్థలమైన విశాఖపట్టణానికి చెందిన వ్యక్తులే నెల్లూరులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని భావించారు. అయితే అభిమాని రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదని మాజీ డీఈఓ మువ్వా రామలింగం అని తెలుసుకున్న పలువురు ఔరా! అనుకుంటున్నారు. నారాయణ సహకారంతో ! విద్యాశాఖలో అత్యంత వివాదాస్పదుడిగా పేరుపొందిన మువ్వా రామలింగం సస్పెన్షన్ వేటును తొలగించుకునేందుకు మంత్రి గంటాను కాకాపట్టినట్లు తెలిసింది. మొదట ఆయనను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేరదీసినట్లు సమాచారం. సస్పెన్షన్ తొలగించి, పోస్టింగ్ ఇవ్వాలని మంత్రి గంటాకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి గంటాను ప్రసన్నం చేసుకొనేందుకు ఈ మాజీ డీఈఓ ‘మీ అభిమాని’ అవతారం ఎత్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రకాశం డీఈఓగా త్వరలో పోస్టింగ్ ఇద్దరు మంత్రుల అండతో మువ్వా తన ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నట్లు వినికిడి. సస్పెన్షన్ తొలగింపు, పోస్టింగ్‌కు సంబంధించిన ఫైలు నారాయణ ద్వారా మంత్రి గంటాకు చేరిందని విద్యాశాఖలో ప్రచారం జరుగుతోంది. మంత్రి గంటా నెల్లూరు డీఈవోగా మళ్లీ మువ్వాను నియమించేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ఈ క్రమంలో నెల్లూరుకు బదులుగా ప్రకాశం జిల్లాలో డీఈవోగా నియమించేందుకు ఆసక్తి చూపారని, ఇందుకు సంబంధించి ఫైలు కూడా సిద్ధైమైందని తెలుస్తోంది. మరో వారం పదిరోజుల్లో ఈ విషయం తేలిపోనుందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. -
అద్భుత తెలంగాణకు రూపకల్పన
రాంనగర్ :స్పష్టమైన విజన్‌తో అద్భుత తెలంగాణ కు రూపకల్పన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అధికారులను కోరారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రణాళికల రూపకల్పనపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసి జిల్లా స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. పదేళ్లకు ఉపయోగ పడేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్న కలలు నిజం చేయడానికి మన ఊరు - మన ప్రణాళికలు రూపొందించి గ్రామాలను, పట్టణాలను అన్ని హంగులతో అభివృద్ధి పరచాలన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగానే ముఖ్యమంత్రి మన ఊరు - మన ప్రణాళికకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.ప్రణాళికల రూపకల్పనలో గ్రామీణ, పట్టణ అవసరాలను గుర్తించి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించారు. ప్రజల అవసరాలు తీర్చడమే నిజమైన అభివృద్ధి అని, పార్టీలకు అతీతంగా ప్రజలను, ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రణాళికలు రూపొందించాలని కోరారు. ప్రణాళికల రూపకల్పనలో సర్పంచ్‌లు, జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, కౌన్సిలర్లదే బాధ్యత ఎక్కువ ఉన్నదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి గ్రామ ప్రణాళికలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు మధ్య సమన్వయం ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గ్రామ, మండల, జిల్లాస్థాయి ప్రణాళికలకు రూపకల్పన జరగాలన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఉపాధి-జీవనోపాధి, పారిశుద్ధ్యంపై ప్రణాళికలు కట్టుదిట్టంగా రూపొందించాలని కోరారు. నియోజకవర్గానికి 40 లక్ష చొప్పున మొక్కలు పెంచాలని, ఇందు కోసం వందలాది నర్సరీలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రణాళికల ద్వారా అధికారులు ప్రజలకు మెరుగైన పాలన అందించాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి కనీసం గ్రామ జనాభాలో 10 శాతం మంది ప్రజలు, మహిళల భాగస్వామ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాలలో డప్పు చాటింపు వేయడంతో పాటు అన్ని పార్టీల వారికి సమాచారం అందించాలని కోరారు. ఇప్పటికే అన్ని గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రణాళికల రూపకల్పనలో ప్రజలకు అవగాహన కల్పించాలనిఅప్పుడు సమస్యలు వెలుగులోకి వస్తాయన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాల ఏర్పాటు పట్ల గ్రామ పంచాయతీలు ప్రత్యేక శ్రద్ధ చూపితే గ్రామ సమస్యలు 60 శాతం మేర అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని తెలిపారు. ప్రణాళికల రూపకల్పనకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అభినందనలు తెలిపారు. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలకు ప్రహరీల నిర్మాణం చేపట్టాలని, ప్రతి పాఠశాలలో క్రీడలను పెంపొందించేందుకు పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని, విద్యా ప్రణాళికల రూపకల్పనలో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలని మంత్రికి సూచించారు. అక్షరజ్ఞానంలో జిల్లా వెనుకబడి ఉన్నందున స్పెషల్ డ్రైవ్ చేపట్టి అగ్రగామిగా నిలపాలని కోరారు. జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లో తలసరి ఆదాయంలో జిల్లా నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ విద్యాపరంగా వెనుకబడి ఉందన్నారు. జిల్లాలోని 30 మండలాల్లో అక్షరాస్యత 50 శాతం కంటే తక్కువగా ఉందన్నారు. జిల్లాలో ప్రధానమైన ఫ్లోరైడ్ సమస్య, అక్షరాస్యత కార్యక్రమాలు, మధ్యా హ్న భోజన పథకానికి వంట గదుల నిర్మాణం తదితర అంశాలకు ప్రాధాన్యమిచ్చి ప్రణాళికల్లో చేర్చాలన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూరాజకీయాలకతీతంగా జిల్లా అభివృద్ధికి సహకరిస్తానన్నారు. బాధ్యతలు స్వీరించిన జెడ్పీ చైర్మన్ బాలునాయక్‌కు మంత్రి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎన్.పద్మావతి, వేముల వీరేశం, ఎన్.భాస్కర్‌రావు, పైళ్ల శేఖర్‌రెడ్డి,ఎమ్మెల్సీ రవీందర్, జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్, జేడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, సీపీఓ నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్లు బొడ్డుపల్లి లక్ష్మి, ప్రవళిక, వి.అనిత, తిరునగరు నాగలక్ష్మి పాల్గొన్నారు.