నిరుద్యోగుల ఆశలపై నీళ్లు | Unemployed teachers are in concern | Sakshi
Sakshi News home page

నిరుద్యోగుల ఆశలపై నీళ్లు

Published Wed, Oct 8 2014 2:22 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM

Unemployed teachers are in concern

పంచపాండవులు ఎంతమందంటే...

పంచపాండవులు ఎంతమంది అంటే ఓస్ నాకెందుకు తెలియదు ... మంచం కోళ్లలా ముగ్గురుంటారని చెప్పి నాలుగేళ్లు చూపించాడట వెనుకటికో వ్యక్తి. అలా ఉంది రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట తీరు. సెప్టెంబరు 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. అక్కడితో పరిమితం కాకుండా ఏకంగా 20 వేల టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. నిరుద్యోగ టీచర్లు ఇక మాకు ఉద్యోగాలు వచ్చేస్తాయోచ్ అంటూ ఎగిరి గంతేశారు. తరువాత ఆ సంఖ్యను 15 వేలకు కుదించారు ... తాజాగా 10,500 కు చేరింది. ఇక్కడితో ఆగుతుందో ఇంకెంత దిగజారుతుందోనని భయపడుతున్నారు ఆశతో ఎదురు చూస్తున్న
 నిరుద్యోగులు.

 
ఒంగోలు వన్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి డీఎస్సీ 2014 ప్రకటిస్తామంటూ ఊదరగొడుతున్న ప్రభుత్వం నిరుద్యోగుల టీచర్ల ఆశలపై నీళ్లు చల్లింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఉపాధ్యాయుల నియామకానికి డీఎస్సీ-2014ను ప్రకటిస్తున్నామంటూ గొప్పలు చెబుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు గత రెండు నెలలుగా రోజూ ప్రకటన చేస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 5 వెళ్లి నెలరోజులు కావస్తున్నా ఇప్పటివరకు డీఎస్సీ ప్రకటన విషయంలో అతీగతీ లేదు.

డీఎస్సీ-2014కు ప్రకటించే పోస్టుల విషయంలో కూడా స్పష్టత లేదు. మొదట 20 వేల టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. తరువాత ఆ సంఖ్యను 15 వేలకు కుదించారు. ఆ తరువాత అది 10,500కు చేరింది. డీఎస్సీని నిర్వహించే విషయంలో అసలు ప్రభుత్వానికి ఒక స్పష్టత లేకుండా పోయింది. దీంతో నిరుద్యోగ టీచర్లందరూ అయోమయానికి గురవుతున్నారు. గత ప్రభుత్వం డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) పాసై ఉండాలని నిబంధన పెట్టారు. ప్రస్తుతం డీఎస్సీ ఉపాధ్యాయ అర్హతా పరీక్ష రెండూ కలిపే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. దీంతో గతంలో ఉపాధ్యాయ అర్హతా పరీక్ష పాసైన వారి పరిస్థితి ఏమిటని నిరుద్యోగ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హతా పరీక్ష, డీఎస్సీ రాత పరీక్ష రెండింటినీ ఏ సిలబస్ ప్రకారం నిర్వహిస్తారు, ఈ రెండింటిలో దేనికెంత ప్రాధాన్యం ఇస్తారు అనే విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు.

30 వేల మంది నిరీక్షణ
జిల్లాలో సుమారు 30 వేల మంది నిరుద్యోగ టీచర్లు డీఎస్సీ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.   అయితే ప్రభుత్వం పొంతనలేని ప్రకటనలతో వీరిని అయోమయానికి గురిచేస్తోంది. ప్రకటనపై ఆశతో వేలకు వేలు ఖర్చు పెట్టి  శిక్షణా కేంద్రాల్లో చేరి శిక్షణ కూడా పొందారు. కొందరైతే దూర ప్రాంతాలైన అవనిగడ్డ, నంద్యాలకు వెళ్లి శిక్షణ పొందారు.

డీఎస్సీకి బీఈడీ మెలిక
ప్రభుత్వం డీఎస్సీ ప్రకటనకు బీఈడీ మెలిక పెట్టింది. సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు కేవలం డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ (డిఈడి) పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని గతంలో సుప్రీంకోర్డు తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం గత రెండు డీఎస్సీలలో డి.ఈ.డ.ి అభ్యర్థులను మాత్రమే అర్హులుగా ప్రకటించారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం బీఈడీ అభ్యర్థులకు కూడా సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హత కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసింది. ఎస్.జి.టి. పోస్టులకు బి.ఈ.డి వారిని కూడా అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆ లేఖకు కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఆ లేఖ సాకు చూపుతూ డీఎస్సీ ప్రకటనను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది.  

జిల్లాలో 839 ఖాళీలు
జిల్లాలో ప్రస్తుతం వెయ్యికి పైగా ఉపాధాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 839 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. సెకండ్‌గ్రేడ్ (తెలుగు) 715, సెకండ్‌గ్రేడ్ (ఉర్ధు) 8, స్కూలు అసిస్టెంట్లు గణితం 14, బయోలాజికల్ సైన్స్ 14, సోషల్ స్టడీస్ 43, తెలుగు 1, హిందీ 6, ఉర్ధు 1, బాషా పండితులు ఉర్ధు 1, సంస్కృతం 2, హిందీ 13, వ్యాయామోపాధ్యాయులు 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ పాఠశాలల్లో 8, జిల్లా పరిషత్, మండల పరిషత్ యాజమాన్యాలలోని పాఠశాలల్లో 831 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement