
అందరూ అంటారు నేనొక విజనరీ అని...
హైదరాబాద్ : సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని ముందుకు వెళితే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని నిర్మాణం ఒక అవకాశం అని...వాస్తవంగా చెప్పాలంటే ఒక సంక్షోభం అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి చంద్రబాబు దంపతులు శనివారం భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 'రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని మొదటి నుంచి చెబుతున్నా.
రాజకీయ ప్రయోజనాల కోసమే విభజన చేశారు. ఆస్తులు, అప్పుల పంపకంలో హేతుబద్ధత లేదు. రాజధానికి భూములిచ్చిన వారికి కృతజ్ఞతలు. భూసేకరణను ఆమోదించటం నా జీవితంలో మరిచిపోలేని రోజు. హైదరాబాద్ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దా. ఒకప్పుడు నేనే కష్టపడి హైదరాబాద్ను అభివృద్ధి చేశా. ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, సైబరాబాద్ నగరం నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డు ...ఇవన్ని చూస్తుంటే తృప్తి... వాటన్నింటినీ నేనే కట్టాను. దానికి కారకుడిని నేనే అని అనుకున్నప్పుడు చాలా తృప్తిగా ఉంది.
అందరూ అంటారు నేనొక విజనరీ అని...రాజధానిని నిర్మించే అవకాశం అందరికీ రాదు. ఆ అవకాశం మనకు వచ్చింది. అది అదృష్టంగా భావిస్తున్నా. ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిగా నిర్మించే బాధ్యత మా ప్రభుత్వానిది. 21వ శతాబ్దపు రాజధానిగా తీర్చిదిద్దుతాం. అవసరం అయితే ప్రపంచం అంతా తిరిగి అధ్యయనం చేయమని ప్రధాని మోదీ చెప్పారు. మంచి రాజధాని నిర్మాణానికి వారు హామీ ఇచ్చారు. 20 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతంలో మంచి రాజధాని చూస్తారు.
తెలుగు జాతి ఉనికికే కాంగ్రెస్ ప్రమాదం తెచ్చింది. రాష్ట్రాన్ని విడగొట్టి కనీసం రాజధాని ఎక్కడో కూడా చెప్పలేదు. స్వలాభం కోసం కాంగ్రెస్ ఎన్నో తప్పులు చేసింది. ఎవరు అడ్డంకులు పెట్టినా రాజధాని నిర్మాణం ఆగదు. భూమిపూజ చేసిన రోజు వర్షం పడటం శుభసూచకం. అయితే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. రాజధాని కట్టాలంటే అప్పు అయినా తేవాలి. కేంద్రం అయినా ఇవ్వాలి' అన్నారు.