వైవీయూ, న్యూస్‌లైన్ : జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టడంతో ఇప్పటికే పాలన పడకేసింది. దీనికి తోడు శనివారం నుంచి జిల్లా అధికారులు సైతం సమ్మెబాట పట్టనుండటంతో జిల్లాలో పాలన పూర్తిగా స్తంభించనుంది. కలెక్టర్, జేసీ, పోలీసులు మినహా అటెండర్ నుంచి అధికారి వరకు, దఫేదార్ నుంచి ఏజేసీ వరకు అందరూ సమ్మెబాట పట్టనున్నారు.
శుక్రవారం రాష్ట్ర అతిథిగృహంలో జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు ఏజేసీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంతో పాటు అన్ని జేఏసీలతో నాన్‌పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఇప్పటి వరకు విధుల్లో ఉండటంతో పూర్తిస్థాయిలో ఉద్యమంలోకి రాలేకపోతున్నామని, నేటి నుంచి విధులు లేవని, ఇక ఉద్యమమేనంటూ నినదించాడు.
జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు, డీఆర్‌ఓ ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్రప్రభుత్వానికి తెలిసేలా ఒక పెద్ద కార్యక్రమాన్ని రెండు లక్షల మందితో నిర్వహించడానికి ప్రయత్నం చేస్తామన్నారు. అనంతరం ఉద్యమానికి అధికారులు పలు సూచనలు చేశారు. ఉద్యమానికి అవసరమయ్యే నిధుల కోసం ప్రతి అధికారి రెండు రోజుల వేతనాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి సమ్మెనోటీసును అందజేశారు. ఆర్డీఓ రఘునాథరెడ్డి, జీఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, జిల్లా అధికారులు లీలావతి, ప్రతిభాభారతి, మమత, భాస్కర్‌రెడ్డి, వెంకట్రావు, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
పాలన స్తంభన
Published Sat, Aug 24 2013 4:38 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement