
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారతదేశంపై ప్రపంచ దేశాలకు నమ్మకం పెరిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ఉత్సాహం చూపుతున్నాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. చెన్నైలో మంగళవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ 90వ వార్షికోత్సవంలో వెంకయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రపంచ బ్యాంకు సైతం ‘ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్’ అని కితాబిచ్చిందన్నారు. దేశ పురోభివృద్ధికి అవసరమైన సంస్కరణలను కేంద్రం అమలు చేస్తోందని, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు అందులో భాగమేనన్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌కు ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును వెంకయ్య ప్రదానం చేశారు. పారిశ్రామికవేత్త వనితా దాట్లను సన్మానించారు. సంగీత ప్రపంచానికి ఎంఎస్ సుబ్బులక్ష్మి సేవలు అజరామరంగా నిలిచిపోయాని వెంకయ్య కీర్తించారు. చెన్నైలో మంగళవారం జరిగిన ఎంఎస్ సుబ్బులక్ష్మి శతజయంతి వేడుకల్లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.