పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి: మైసూరారెడ్డి | All parties should stand in single decision, says Mysura Reddy | Sakshi
Sakshi News home page

పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి: మైసూరారెడ్డి

Published Mon, Sep 30 2013 1:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి: మైసూరారెడ్డి - Sakshi

పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి: మైసూరారెడ్డి

 సాక్షి, కడప:  ‘సమైక్యాంధ్ర ఆవశ్యకతపై సీఎం బాగానే మాట్లాడాడు. సంతోషమే! అయితే మాటలు చేతల్లో చూపాలి. అధిష్టానాన్ని ధిక్కరించేలా మాట్లాడినందుకు కాంగ్రెస్ ఏ క్షణమైనా సీఎంని తొలగించవచ్చు. ఆలోపు ఆయన అసెంబ్లీని సమావేశపరచాలి. సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలి. దానికి మేము మద్దతిస్తాం. అప్పుడు అన్నిపార్టీల రంగు బయటపడుతుంది. అన్నీ ఏకతాటిపైకి వచ్చి ‘సమైక్య తీర్మానం’ చేస్తే ఆ నోట్‌ను సోనియాగాంధీకి పంపిద్దాం. అప్పుడు విభజన నిర్ణయం మారుతుంది. సమైక్యాశయం నెరవేరుతుంది.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య వేదిక’ పేరుతో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ అన్ని జిల్లాల జేఏసీల నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్యోగులుగా తాము కొన్ని పరిమితులకు లోబడి, జీతాలు లేకున్నా 2నెలలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని ఏపీఎన్జీవో, ఆర్టీసీ, విద్యుత్, న్యాయవాదులు, ఉపాధ్యాయులు వివరించారు. అయితే తాము ఎన్ని నిరసనలు చేసినా కేంద్రం చులకనగా చూస్తోందని, ఓ రాజకీయపార్టీ అండగా ఉంటే ఉద్యమానికి ఫలితం ఉంటుందని చెప్పారు.
 
 ఉద్యమానికి జగన్ నాయకత్వం వహించాలి: జేఏసీలు
 తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ నాయకత్వం వహించారని, సీమాంధ్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యం వహించి ఉద్యమాన్ని నడపాలని జేఏసీల నేతలు విన్నవించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచిన శక్తి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని, ఆ తర్వాత అలాంటి వ్యక్తి జగన్ మాత్రమే అని వారు స్పష్టం చేశారు. దీనిపై మైసూరా స్పందించారు. ‘‘తెలంగాణ ఉద్యమం రాజకీయ అండతో సాగింది. కానీ ఇక్కడ ఏ రాజకీయపార్టీ అండ లేకుండా గొప్ప ఉద్యమం నడుస్తోంది. జీతాలను పణంగా పెట్టి ఉద్యమించిన ప్రతి ఒక్కరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు. సమైక్య ప్రకటన వెలువడక ముందే మాపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేశారు. అయితే కొందరు నేతలు.. ముందుగా రాజీనామాలు చేశారు. విభజన నిర్ణయం మీకు ముందే తెలుసు అంటూ అవివేకంగా మాట్లాడారు. విభజన నిర్ణయం వస్తోందని ప్రజలందరికీ తెలుసు. ఆ మాత్రం తెలీనివారు రాజకీయనేతలు ఎలా అయ్యారు? ప్రజల భవిష్యత్తుకు వీరేమి భరోసా ఇస్తారు? సమైక్యానికి అండగా విజయమ్మ దీక్ష చేశారు. జగన్ జైల్లోనే ఆమరణ దీక్ష చేశారు. దీనికి చాలా ఇబ్బందులు ఉంటాయి. గాంధీజీ తర్వాత జైల్లో దీక్ష చేసిన వ్యక్తి జగన్ మాత్రమే..’’ అని చెప్పారు.
 
 సమైక్యవాదాన్ని ముందుకు తీసుకెళతాం
 సమైక్య ఉద్యమానికి వైసీపీ అండగా ఉండి ముందుకు నడిపించాలని అందరూ కోరుతున్నారని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సమైక్యవాదాన్ని భుజాన వేసుకుని ముందుకు తీసుకెళ్లే బాధ్యత వైఎస్సార్‌సీపీదేనని మైసూరా హామీ ఇచ్చారు. తమతో పాటు సీపీఎం, ఎంఐఎం కూడా సమైక్యానికి అండగా ఉన్నాయని తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్‌లు కూడా తమ వైఖరి స్పష్టం చేయాలన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ నేతలు ఓ లేఖరాస్తే దానిపై మొదటి సంతకం జగన్‌తో పెట్టిస్తామని, అలాగే సీపీఎం, ఎంఐఎంతో పాటు చ ంద్రబాబు, బొత్స కూడా సంతకం చేసేలా జేఏసీ నేతలు ప్రయత్నించాలని సూచించారు.
 
  తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమయ్యేలోపే ఈ ప్రక్రియ పూర్తికావాలన్నారు. అప్పుడు ప్రజాభిప్రాయం మేరకు, ప్రజాప్రతినిధుల నిర్ణయం మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తుతుంది, 60 రోజుల ఉద్యమ ఫలితం 6 గంటల్లోనే తేలిపోతుందని మైసూరా వివరించారు. ఉద్యమం బలోపేతానికి రైల్‌రోకోలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత, సకలజనుల సమ్మె చేయాలని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. భవిష్యత్ కార్యాచ రణను ఎలా రూపొందిస్తే అలా నడుచుకోవడానికి వైఎస్సార్‌సీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని మైసూరా తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాధ్‌రెడ్డి, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అలీ, ఏపీఎన్జీవోల సంఘం జిల్లా నేత గోపాల్‌రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం నాయకుడు రాంమూర్తినాయుడు, ఇతర జేఏసీల నేతలు పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement