
కాంగ్రెస్ హయాంలో ధరలన్నీ ఆకాశంలోనే: షర్మిల
వైఎస్ పాలనలో ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచలేదని, అదే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్నింటి ధరలు పెరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా డోన్లో సమైక్య శంఖారావం సభలో ఆమె మాట్లాడారు. ఉదయం షర్మిల డోన్కు చేరుకోడానికి ముందునుంచే అశేష సంఖ్యలో ప్రజలు, అభిమానులు ఆమె రాక కోసం వేచి చూశారు. రాగానే ఆమెను అభివాదాలతో ముంచెత్తారు. జైజగన్, జై సమైక్యాంధ్ర నినాదాలు ఆ ప్రాంతమంతా మిన్నంటాయి. అనంతరం డోన్లో జరిగిన సభలో షర్మిల ప్రసంగించారు.
వైఎస్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, కేవలం కేంద్రంలో రాహుల్‌ను ప్రధానమంత్రిగా చేయాలన్న ఏకైక కారణంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చేస్తోందని ఆమె విమర్శించారు. ఓట్లు -సీట్లు కోసమే రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజిస్తోందని ఆమె అన్నారు. అసలు రాష్ట్ర విభజనకు కారణం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబేనని షర్మిల మండిపడ్డారు. సమైక్యాంధ్రలో ఉద్యమం జరుగుతున్ననా చంద్రబాబులో చలనం లేదని, ఆయన విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వకుంటే విభజనకు కాంగ్రెస్ సాహసం చేసేది కాదని చెప్పారు. చంద్రబాబుకు ఏ మాత్రం నిజాయతీ ఉన్నా.. తన ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజీ నామా చేయించాలని డిమాండ్ చేశారు. ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో వైఎస్ఆర్‌సీపీ కుమ్మక్కయ్యి ఉంటే జగనన్న జైలులో ఉండేవారా అని ఆమె ప్రజలను అడిగారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయ్యారో.. వైఎస్‌ఆర్ సీపీ కుమ్మక్కయిందో మీరే తేల్చాలని ప్రజలకు తెలిపారు.