తొలిరోజు సింగిల్ నామినేషన్ దాఖలు
గిద్దలూరులో 20వ వార్డుకు ఒకే మహిళ దరఖాస్తు
అభ్యర్థుల ఎంపికపై కొలిక్కిరాని నేతల కసరత్తు
కాంగ్రెస్, టీడీపీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి..
సాక్షి, ఒంగోలు
మున్సిపల్ ఎన్నికల తొలిఅంకం ఆరంభమైంది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో సోమవారం ఉదయం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. అయితే, సాయంత్రం 3 గంటల వరకు జిల్లాలో ఏకైక నామినేషన్ దాఖలవడం గమనార్హం. గిద్దలూరు మున్సిపాలిటీలోని 20వ వార్డుకు ఒకేఒక్క మహిళ నామినేషన్ దాఖలు చేశారు. తొలిరోజు నుంచే రాజకీయ పార్టీల అభ్యర్థులతో సందడిగా ఉంటుందని భావించిన ప్రభుత్వ అధికారులకు విభిన్న వాతావరణం కనిపించింది. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున పోటీచేసే అభ్యర్థుల ఎంపిక పై ఇంకా కసరత్తు పూర్తికానందున.. నామినేషన్ లకూ ఎవరూ ముందుకు రాలేదు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలు రానున్న సార్వత్రిక సంగ్రామంపై ప్రభావం చూపనున్న నేపథ్యంలో .. ఈఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున నిలబడేందుకు పట్టణాల్లో చాలామంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రణాళికపై ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు స్పష్టమైన వైఖరిని అనుసరిస్తున్నారు. జిల్లాపార్టీ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ మున్సిపల్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలకు మాత్రం పలుచోట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాముగా మారింది. టీడీపీ నేతలు కొంత వరకు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేస్తున్నా... కాంగ్రెస్‌ది మాత్రం భిన్నంగా ఉంది. కనీసం, పట్టణాల్లో పార్టీజెండా పట్టుకునేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి కనిపిస్తోంది.
ముహూర్త బలంపై అభ్యర్థుల చర్చ:
జిల్లాలో ఒంగోలు నగర పాలకసంస్థతో పాటు మరో ఏడు మున్సిపాలిటీలున్నాయి. వీటిల్లో ఒంగోలు, కందుకూరు ఎన్నికలు కోర్టు వివాదాలతో నిలిచిపోయాయి. మిగిలిన చీరాల, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, అద్దంకి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 145 వార్డుల్లో కలిపి 2,12,179 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల పరిధిలో 204 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి.
నాలుగైదు వార్డులకు ఒక ఎన్నికల అధికారి పర్యవేక్షణలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు పనిచేస్తుండగా, మొదటి మూడు రోజులు నామినేషన్లు పెద్దగా దాఖలు కావని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులు ఇప్పటికే తమ వ్యక్తిగత పత్రాలను సిద్ధం చేసుకుంటూ.. నామినేషన్ దాఖలుకు సరైన ముహూర్తం చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈనెల 14వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండడంతో ఈనెల 12 నుంచి నామినేషన్లు ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. పనిలోపనిగా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఒక్కో వార్డు కౌన్సిలర్ పోటీకి ముగ్గురు అభ్యర్థుల పేర్లను పరిశీలనలోకి తీసుకుంటున్నారు. మహిళా రిజర్వేషన్ అభ్యర్థులకు సంబంధించి ప్రధాన పార్టీలు ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై ఒకటికి పలుమార్లు చర్చిస్తున్నారు.
‘మున్సిపల్’ ఘట్టం ఆరంభం
Published Tue, Mar 11 2014 5:01 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement