ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్:
పోలీస్ యంత్రాంగం వరుస ఎన్నికల కోసం సన్నద్ధమవుతోంది. ఈ నెల 30న మున్సిపాలిటీ ఎన్నికలు, ఏప్రిల్ 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మే నెల 7న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎస్పీ పి.ప్రమోద్‌కుమార్ నేతృత్వంలో సిబ్బందిని సన్నాహం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం నిఘా వర్గాలను కూడా అప్రమత్తం చేసింది. స్పెషల్ బ్రాంచి, ఇంటెలిజెన్స్ విభాగాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన నిఘా విభాగాలు కూడా రంగంలోకి దిగాయి. ఎన్నికల ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే 37 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. జిల్లాలోని అన్ని రహదారులను తమ కనుసన్నల్లోకి తెచ్చుకుంటున్నారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు రౌడీషీటర్లు, కేడీలతో పాటు గ్రామాల్లో అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్న వారిని గుర్తించి బైండోవర్ కేసులు పెట్టారు. మొత్తం 58 కేసులు పెట్టి 782 మందిని ఇప్పటికే బైండోవర్ చేసుకున్నారు. చెక్‌పోస్టుల ద్వారా 73 అక్రమ మద్యం కేసులు నమోదు చేశారు.
736 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో పట్టణాల్లో సమస్యాత్మకమైన వాటిపై పోలీసులు నిఘా పెంచి ఘర్షణలకు పాల్పడే వారిని గుర్తించారు. జిల్లాలో పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో పని చేసే డీఎస్పీ, ఏఆర్ డీఎస్పీతో పాటు మొత్తం ఏడుగురు డీఎస్పీలు జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఎన్నికల కోసం పోలీస్ యంత్రాంగం సన్నద్ధం
Published Tue, Mar 11 2014 5:05 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement
Advertisement