ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. ఈనెల 7వ తేదీ జరగనున్న ఎన్నికల నిర్వహణపై తీసుకుంటున్న చర్యలను సోమవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు 2881 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమస్యాత్మక, తీవ్ర సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.
మహిళా ఓటింగ్ శాతం పెరగాలి
జిల్లాలో మహిళా ఓటింగ్ శాతం పెరగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లాలో 24 లక్షల 84 వేల 109 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 12 లక్షల 34 వేల 648 మంది పురుషులుండగా, 12 లక్షల 49 వేల 285 మంది మహిళా ఓటర్లు, 176 మంది ఇతరులు ఉన్నట్లు వివరించారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నందున
పోలింగ్ కేంద్రాల వద్ద వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు బారులు తీరి ఉంటే ఎక్కువ సమయం నిలబడకుండా ఉండేందుకు పక్కనే ఉన్న గదుల్లో కుర్చీలు ఏర్పాటు చేస్తామన్నారు. క్యూ నిర్వహణ చూసేందుకు 3 వేల మంది సిబ్బందిని నియమించామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించామని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ఓటు వేయకుండా ఎవరైనా అడ్డుకుంటే అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
ఓటు వేయనీయకుండా ఎక్కడైనా అడ్డుకుంటే కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజయకుమార్ కోరారు.
ఎవరైనా ఓటుకు నగదు వంటివి ఇస్తే ఇచ్చిన వారిపై, తీసుకున్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలోని మద్యం దుకాణాలన్నింటినీ ఈనెల 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూతవేయాలన్నారు.
అభ్యర్థులకు కేటాయించిన వాహనాలు వారు కాకుండా ఇతర పార్టీలు వాడుకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ప్రతి సెక్ట్రోరల్ వద్ద 4 ఈవీఎంలు రిజర్వ్..
ప్రతి సెక్ట్రోరల్ అధికారి వద్ద 4 ఈవీఎంలను రిజర్వ్‌లో ఉంచినట్లు విజయకుమార్ వెల్లడించారు. - ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను వెంటనే అక్కడకు తరలించి పోలింగ్ సజావుగా జరిగేలా చూస్తామన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈనెల 7వ తేదీ ఉదయం 7గంటల్లోపు మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు.
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నియోజకవర్గ పరిధిలో ఏ ప్రాంతానికి చెందిన వారినైనా ఏజెంట్లుగా నియమించుకునే వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పించిందని చెప్పారు.
ఉదయం 6 గంటలకల్లా పోలింగ్ కేంద్రానికి తమ ఏజెంట్లను పంపాలన్నారు. 6.15 గంటల వరకు ఏజెంట్ల కోసం సిబ్బంది ఎదురు చూస్తారని, అప్పటికీ రాకుంటే సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహిస్తారన్నారు.
అంతకంటే ముందుగా 6వ తేదీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలు తరలించే సమయంలో ఒకసారి మాక్ పోలింగ్ నిర్వహిస్తే అవి సరిగా పనిచేస్తుందో లేదో అక్కడే తేలిపోతుందన్నారు.
మాక్ పోలింగ్ అనంతరం అందులోని డేటాను వెంటనే తీసివేయాలని చెప్పారు.
పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు గొడవపడినా..తగాదాలకు కారకులైనా బయటకు పంపేస్తామని హెచ్చరించారు.
అధిక సిబ్బంది..
ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికంగా సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్ వివరించారు.
3,460 మంది ప్రిసైడింగ్ అధికారులు, 3,521 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 13,060 మంది ఇతర పోలింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
వీరితోపాటు 720 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు.
1022 సమస్యాత్మక, 559 తీవ్ర సమస్యాత్మక, 38 మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు.
తీవ్ర సమస్యాత్మక కేంద్రాల వద్ద సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్స్, సమస్యాత్మక కేంద్రాల వద్ద ఆర్మ్‌డ్ పోలీసులను నియమించామన్నారు.
659 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తుండగా, 38 పోలింగ్ కేంద్రాల్లో వీడియో కెమెరాలు అమర్చినట్లు వివరించారు.
పోలింగ్ శాతాన్ని తెలుసుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ కేంద్రంలో బీఎల్‌ఓను నియమించినట్లు తెలిపారు.
ప్రతి మండలంలో ఏఎస్‌ఓ వాటిని సేకరించి నియోజకవర్గానికి, జిల్లా కేంద్రానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పోలింగ్ శాతాన్ని పంపిస్తారన్నారు.
ఓటరు స్లిప్పులు ఉంటే ఎలాంటి ఆధారాలు అవసరం లేదని, జాబితాలో పేర్లు ఉండి స్లిప్పులు లేకుంటే 11 రకాల ఆధారాల్లో ఏదో ఒకదానిని తీసుకువచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు.
విలేకరుల సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.