ఈ ఏడాది రాజకీయాల్లోకి వస్తా: నటుడు
ఒంగోలు: ఈ ఏడాది ఆఖరుకు తాను రాజకీయరంగ ప్రవేశం చేయనున్నట్లు సినీ నటుడు సుమన్ ప్రకటించారు. తనకు కొన్ని ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నాయని.. తన ఆశయాలకు తగ్గ పార్టీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. శనివారం ఒంగోలులో పాఠశాల భవన ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
అభివృద్ధి, రైతుల సంక్షేమం, పోలీసులు, సైనిక కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసే ఆర్థిక సాయం పెంపు, విద్యకు అవసరమైన ప్రోత్సాహం కల్పించడం వంటి అంశాలకు ఏ పార్టీ విలువిస్తుందో ఆ పార్టీవైపు తాను దృష్టి సారిస్తానని చెప్పారు. రిజర్వేషన్ల కారణంగా మేధాశక్తికి ఆటంకం కలగరాదని, విద్యార్థులు ఉన్నతంగా చదువుకునేందుకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలన్నారు. రిజర్వేషన్లకు ఆటంకం కలగని రీతిలో మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో మేధావులు దేశానికి ఉపయోగపడేలా అవకాశాలు ఉండాలన్నారు.
సినీ పరిశ్రమ గురించి సుమన్ మాట్లాడుతూ చిన్న నిర్మాతలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా మినీ థియేటర్లను నిర్మిస్తోందని, ఏపీ ప్రభుత్వమూ అదేవిధంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. వీడియో పైరసీపై ఉక్కుపాదం మోపి, బ్లాక్ టికెటింగ్‌పై ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరారు.