ఒంగోలు, న్యూస్‌లైన్: కాంగ్రెస్ మౌనం అందరికీ కష్టకాలంగా మారింది. ఒకవైపు పరీక్షల జాతరతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తంటాలు పడుతున్నారు. మరోవైపు రాజకీయ నేతలు వరుసగా రానున్న ఎన్నికల ప్రకటనలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. సాధారణ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సర్వశక్తులు కూడదీసుకుంటున్న వేళ మున్సిపల్ ఎన్నికలు, మరోవైపు పల్లెల్లో ఎంపీటీసీ, జేడ్పీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తులు తీవ్రతరం చేశారు.
ఇదీ పరిస్థితి
మార్చి నెల అంటేనే పరీక్షల హడావుడి. మార్చిలో ఇంటర్ పరీక్షలు ముగుస్తాయి. నెలాఖరులో పదో తరగతి విద్యార్థుల పరీక్షలు మొదలవుతాయి. ఇదే సమయంలో నాగార్జున యూనివర్శిటీ డిగ్రీ పరీక్షలు కూడా ప్రారంభమవుతాయి. దీంతో మార్చి, ఏప్రిల్ నెలలు పూర్తిగా పరీక్షల హడావుడి కనిపిస్తుంటుంది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా నిమగ్నమవుతుంటారు. ఉపాధ్యాయులు మొత్తం పరీక్షల విధుల్లో ఉంటారు. అయితే వీరే ఎన్నికల విధులకు కూడా హాజరుకావాల్సి ఉంటుండడంతో సమస్య జఠిలంగా మారుతోంది.
కాంగ్రెస్ వైఖరే కారణమని విమర్శలు
2010లో కాలం ముగిసినా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు కూడా 2011లో గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించలేదు. అయితే సర్పంచ్ ఎన్నికలకు కాలాతీతం చేసినప్పటికి గత ఏడాది జూలై నుంచి ఆగస్టు వరకు మూడు దశల్లో ఎన్నికలు ముగించడంతో కొంతమేర సమస్య తప్పింది. అయితే ఏదో ఒక విధంగా ఎన్నికలు జరపకుండా నెట్టుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి ఇటీవల న్యాయస్థానాలు చెక్‌పెట్టాయి. వెనువెంటనే ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ హైకోర్టు, సుప్రీంకోర్టులు హెచ్చరించడంతో ఒక్కసారిగా ఎన్నికలకు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ దశలోనే రాష్ట్రపతిపాలన కూడా రావడంతో ఎన్నికలు వేగవంతంగా నిర్వహించడం ఖాయమని జనం భావిస్తున్నారు. అయితే సోమవారం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీల్లోని ఆశావహులు ఈ ఎన్నికలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. కానీ తాజాగా మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఈనెల 1న రిజర్వేషన్లు ఖరారు చేశారు. కొందరి ఆశలు అడియాశలయ్యాయి. కొత్తగా మరికొంత మంది ఆశావహుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక మొదలు ఎన్నికల ప్రక్రియ వరకు రాజకీయ పార్టీలపై పెనుభారాన్ని మోపే అవకాశం కనిపిస్తోంది.
పెరుగుతున్న ఒత్తిడి
ఈనెల 3వ తేదీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 6వ తేదీ అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఎంపీపీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ ఎన్నికలు కూడా వెంటనే జరిగే అవకాశం లేకపోలేదనేది చెబుతున్నారు. అయితే ఏ ఎన్నికలు నిర్వహించినా ఉపాధ్యాయులు కనీసం 5 రోజులపాటు ఎన్నికల విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అయితే జిల్లావ్యాప్తంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అపుడు మరో 5రోజులు విధులకు దూరం కాక తప్పదు.
వీటితోపాటు సాధారణ ఎన్నికలకు మరో 5రోజులు.. వెరసి కనీసం పదిహేను రోజులపాటు ఉపాధ్యాయులు పాఠశాలలకు దూరం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పరీక్షల వేళ ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులో లేక తీవ్ర సమస్యను ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఎన్నికలు కేవలం రాజకీయ నేతలకే తలనొప్పిగా మారుతున్నాయనుకుంటే చివరకు ఓటు హక్కు లేని విద్యార్థులపై కూడా ప్రభావం చూపనుండడం గమనార్హం.
పరీక్షల వేళ.. ఎన్నికల జాతర
Published Mon, Mar 3 2014 3:36 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement