ఒంగోలు వన్‌టౌన్ :జిల్లాలో మార్చి 11వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు మొత్తం 50,974 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి (ఆర్‌ఐఓ) పి.మాణిక్యం తెలిపారు. గతేడాది కంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో 548 మంది తక్కువగా పరీక్షకు హాజరవుతున్నారు. ప్రస్తుతం విద్యా సంవత్సరంలో మూడు పరీక్ష కేంద్రాలు పెరిగాయి. గత సంవత్సరం జిల్లాలో మొత్తం 51, 522 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతేడాది 23,748 మంది పరీక్షకు హాజరుకాగా ఈ ఏడాది 1,551 మంది.. అదనంగా మొత్తం 25,299 మంది పరీక్షకు హాజరవుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలో 2,099 మంది తగ్గారు. గత సంవత్సరం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 27,774 మంది పరీక్షకు హాజరుకాగా ఈ ఏడాది 2,099 మంది తక్కువగా కేవలం 25,675 మంది పరీక్షకు హాజరవుతున్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో సీఈసీ గ్రూప్‌లో సుమారు 900 మంది, ఎంపీసీలో 300, బైపీసీలో 400, హెచ్‌ఈసీలో 300 మంది విద్యార్థులు పెరగగా, ఎంఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది.
ఎంపీసీ విద్యార్థులదే సింహభాగం
ఇంటర్మీడియెట్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల్లో ఎంపీసీ విద్యార్థులే 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నారు. మొదటి సంవత్సరం పరీక్షకు హాజరవుతున్న 25,299 మందిలో ఎంపీసీ విద్యార్థులు 13,548 బైపీసీ విద్యార్థులు 3975, సీఈసీ విద్యార్థులు 5626, హెచ్‌ఈసీ 1165, ఎంఈసీ 298, ఒకేషనల్ 687 మంది పరీక్షకు హాజరవుతున్నారు. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విద్యార్థులు 14,426, బైపీసీ 3,817 మంది, సీఈసీ 4987, హెచ్‌ఈసీ 1095, ఎంఈసీ 413, ఒకేషనల్ 937 మంది పరీక్షకు హాజరవుతున్నారు. మొదటి సంవత్సరం పరీక్షకు హాజరవుతున్న 25,299 మందిలో 687 మంది ఒకేషనల్ విద్యార్థులు, 24,612 మంది జనరల్ విద్యార్థులున్నారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు హాజరవుతున్న 25,675 మందిలో 24,738 మంది జనరల్ విద్యార్థులుకాగా 937 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు.
పెరిగిన పరీక్ష కేంద్రాలు
ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలు పెరిగాయి. గతేడాది 85 పరీక్ష కేంద్రాలు కేటాయించగా ఈ ఏడాది పరీక్ష కేంద్రాలు సంఖ్య 88కు పెరిగింది. కొత్తగా చీరాలలో ఒకటి, గిద్దలూరులోని సాహితీ జూనియర్ కళాశాల, దర్శిలోని ఏపీ మోడల్ స్కూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ.. పరీక్షల టైంటేబుల్
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మార్చి 11వ తేదీ నుంచి పరీక్షలు మొదలవుతున్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు 11న సెకండ్ లాంగ్వేజీ పేపర్-1, 13న ఇంగ్లిష్ పేపర్-1, 16న మేథమ్యాటిక్స్ పేపర్-1ఏ, బోటనీ, సివిక్స్, సైకాలజీ, 18న మేథమ్యాటిక్స్ పేపర్-1బి, జువాలజీ, హిస్టరీ, 20న ఫిజిక్స్, ఎకనామిక్స్, క్లాసికల్ లాంగ్వేజ్, 24న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, 26న జువాలజీ, హోంసైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు, మేథమ్యాటిక్స్ పేపర్-1, 30న మోడల్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్-1 పరీక్షలు జరుగుతాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్చి 12వ తేదీన సెకండ్ లాంగ్వేజీ పేపర్-2, 14న ఇంగ్లిష్ పేపర్-2, 17న మేథమ్యాటిక్స్ పేపర్-2ఏ, బోటనీ, సివిక్స్, సైకాలజీ పేపర్-2, 19న మేథమ్యాటిక్స్ పేపర్-2బి, జువాలజీ, హిస్టరీ, 23న ఫిజిక్స్, ఎకనామిక్స్, క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్-2, 25న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-2, 27న జువాలజీ, హోంసైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్సు, మేథమ్యాటిక్స్ పేపర్-2, 31న మోడల్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.
= ఈ నెల 28న నైతికత, మానవ విలువలు పరీక్ష కళాశాలలో నిర్వహిస్తారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది.
= ఈ నెల 31న పర్యావరణ విద్యా పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది.
= ఫిబ్రవరి 12 నుంచి మార్చి 4వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని ఆర్‌ఐఓ మాణిక్యం వివరించారు.
ఇంటర్ పరీక్షలకు 50,974 మంది విద్యార్థులు
Published Mon, Jan 5 2015 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM
Advertisement