ఒంగోలు: ఇంటర్మీడియెట్ పరీక్షలను సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి పి.మనోహర్‌బాబు తెలిపారు. తన ఛాంబర్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 25 ప్రభుత్వ, 12 ఎయిడెడ్, 3 సాంఘిక సంక్షేమ కళాశాలలు, 53 ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ కాలేజీల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
ఈ ఏడాది జూనియర్ ఇంటర్ జనరల్ విభాగంలో 26,675 మంది, ఒకేషనల్ విభాగంలో 1,110 మంది, సీనియర్ ఇంటర్ జనరల్ విభాగంలో 26,941 మంది, ఒకేషనల్ విభాగంలో 988 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థి 8:30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ, పోలీసు, ఆరోగ్యశాఖ, తపాలాశాఖ, విద్యాశాఖ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారన్నారు.
పటిష్ట నిఘాలో పరీక్షలు..
ప్రతి పరీక్షా కేంద్రంలో డిపార్టుమెంటల్ ఆఫీసర్ రూంలో ఒకటి, వరండాలో రెండు లేక మూడు, పరీక్షా గదిలోను ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ఏడాది మార్కాపురంలో గౌతమి జూనియర్ కాలేజీలో పరీక్షా కేంద్రం ఉండేదని, ఈ ఏడాది అక్కడ తొలగించి మెరుగైన వసతులు ఉన్న ఎస్‌ఎస్‌ఆర్ జూనియర్ కాలేజీలో సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది అదనంగా సీఎస్‌పురంలో రత్నం జూనియర్ కాలేజీలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల సెంటర్ల వద్ద కూడా పోలీసు బందోబస్తు ఉంటుందని, సెంటర్ల వద్ద జిరాక్స్ సెంటర్లు నెట్ సెంటర్లు విధిగా మూసివేయాలని ఆదేశాలు ఉన్నాయన్నారు.
అశ్రద్ధ వహిస్తే చర్యలు..
పరీక్షల నిర్వహణలో ఏమాత్రం ఆశ్రద్ధగా ఉన్నా అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్‌ఐఓ పి.మనోహర్‌బాబు పేర్కొన్నారు. స్థానిక ఆంధ్రకేసరి విద్యాకేంద్రంలో డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్లు, ప్రైవేటు సెంటర్ల ప్రిన్సిపాళ్లు, డీఈసీ సభ్యులు, హైపవర్ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో కేవలం డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్‌ల వద్ద మాత్రమే మొబైల్ ఉండాలని, మిగిలిన ఏ ఒక్కరి వద్ద సెల్‌ఫోన్ ఉండరాదన్నారు.
ప్రతి పరీక్షా కేంద్రంలో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల వసతి కల్పించాలన్నారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా విద్యుత్ శాఖాధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. అదే విధంగా పోలీసుస్టేషన్ వద్ద నుంచి ప్రశ్నాపత్రాలను తీసుకువెళ్లేందుకు, జవాబు పత్రాలను తపాలాశాఖకు చేర్చేవరకు పోలీసు బందో బస్తు ఉంటుందన్నారు. మాల్‌ప్రాక్టీస్, వి ద్యార్థులు చిట్టీలు తీసుకుని రావడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
గూగుల్ ప్లే స్టోర్‌లో సెంటర్ లొకేటర్..
విద్యార్థులు తమ పరీక్షా కేంద్రానికి ఎలా చేరుకోవాలో సూచించే ఐపీఈ సెంటర్ లొకేటర్ అనే యాప్‌ను గూగుల్‌ప్లేస్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఏ వాహనంలో వెళ్లేందుకు ఎలాంటి మార్గం ఉందనేది కూడా సులువుగా తెలుసుకోవచ్చన్నారు. యాప్‌లో సెంటర్ కోడ్ నమోదు చేస్తే సరిపోతుందన్నారు. పరీక్షల నిర్వహణకు 5 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, మరో 5 సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించామన్నారు. తనతో పాటు హైపవర్ కమిటీ, డీఈసీ సభ్యులు ఆకస్మిక తనిఖీలు చేస్తారని, పరీక్షల విధులలో ఉన్న వారు అప్రమత్తంగా ఉండి ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించేందుకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment