ఆర్టీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం
బరిలో ఎనిమిది యూనియన్లు
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ)లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 55,151 ఆపరేషనల్.. 1,287 నాన్-ఆపరేషనల్ ఓట్లతో కలిపి మొత్తం 56,438 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. ప్రతి కార్మికుడు విధిగా రెండు ఓట్లు వేయాలి. రాష్ట్ర స్థాయి(క్లాస్-3) తెలుపు రంగు బ్యాలెట్, రీజియన్ స్థాయి (క్లాస్-6) గులాబీ రంగు బ్యాలెట్‌పై ఓటు వేయాల్సి ఉంటుంది. 13 జిల్లాల్లో 152 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.
మొత్తం ఓట్లలో 50 శాతం కంటే ఒక ఓటు ఎక్కువగా వచ్చిన యూనియన్‌కే స్థానిక గుర్తింపు (క్లాస్-6) వస్తుంది. మొత్తం పోలైన ఓట్లలో ఏ యూనియన్‌కు ఎక్కువ ఓట్లు వస్తే దాన్నే (క్లాస్-3) గుర్తింపు యూనియన్‌గా ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (బస్సు గుర్తు), నేషనల్ మజ్దూర్ యూనియన్ (కాగడా), వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ (టేబుల్ ఫ్యాన్), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (స్టార్), కార్మిక పరిషత్ (టైరు), ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ (పావురం), యునెటైడ్ వర్కర్స్ యూనియన్ (స్టీరింగ్), కార్మిక సంఘ్ (పిడికిలి గుర్తు) బరిలో ఉన్నాయి.