YSR RTC Mazdoor Union
-
ఆర్టీసీలో సీసీఎస్ ఎన్నికల హడావిడి
కడప అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీలో కార్మికుల పరస్పర సహకార సంఘం (సీసీఎస్) ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో ఆయా సమయాల్లో గుర్తింపు ఉన్న సంఘానికే ఎక్కువ కార్మికులు మొగ్గుచూపే అవకాశం ఉంది.నాలుగైదు రోజుల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. 13వ తేదీ సాయంత్రానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అప్పుడు ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారనే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఉన్న ఎన్ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ అని కార్మికులు చర్చించుకుంటున్నారు. కడప రీజియన్ పరిధిలో ఎనిమిది డిపోలకుగాను 16 స్థానాలు, నాన్ ఆపరేషన్ కింద జోనల్ వర్క్‌షాప్‌లో మూడు స్థానాల్లో మొత్తం 19 స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. రీజియన్‌లో ఎనిమిది డిపోల పరి«ధిలోని అధికారులు, సిబ్బందితో కలిసి 4186 ఓట్లు ఉన్నాయి. నాన్ ఆపరేషన్ కింద జోనల్ వర్క్‌షాప్‌లో ఉన్న మూడు స్థానాలకు 320 ఓట్లు ఉన్నాయి. అభ్యర్థులు వివిధ విభాగాలలో పనిచేస్తున్నారు. కడప రీజియన్‌లోని 19 స్థానాలలో కడప డిపో, ఆర్ఎం కార్యాలయంతో కలిపి నాలుగు స్థానాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు మూడు, రాజంపేట రెండు, రాయచోటి రెండు, పులివెందుల, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగులలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. యూనియన్ల మధ్య పోటాపోటీ ఏపీఎస్ ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో ప్రధానంగా ఎంప్లాయీస్ యూనియన్‌కు వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ మద్దతు ఇవ్వడంతో మరింత బలం చేకూరిందనే చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో మరోవైపు నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు తమ కార్మికులను అభ్యర్థులుగా నిలబెట్టారు. కార్మిక పరిషత్ కూడా ఒంటరిగా తమ అభ్యర్థులను బరిలో దించింది. అయితే ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. 16వ తేదీనే ఎన్నికలు ఆ వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు. -
సీసీఎస్ ఎన్నికల్లో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్
అనంతపురం న్యూసిటీ : ఏపీఎస్ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ బరిలో దిగుతోందని రీజినల్ కార్యదర్శి ఆర్వీ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయాలనే నినాదంతో రీజియన్‌లోని అన్ని డిపోల్లో పోటీ చేస్తున్నామన్నారు. వచ్చే నెల 16న జరిగే ఎన్నికల్లో కార్మికులు తమ యూనియన్ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆర్టీసీ ఉనికిని ప్రమాదంలో పడేసిన ప్రభుత్వం
కడప కార్పొరేషన్: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఉనికి ప్రమాదంలో పడిందని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రీజనల్ గౌరవాధ్యక్షుడు, నగర మేయర్ కె. సురేష్‌బాబు విమర్శించారు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు నుంచి రీజనల్ మేనేజర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రై వేటీకరణ చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ఎంపీలు కేశినేని, జేసీ దివాకర్‌రెడ్డి బస్సుల వల్లే అక్రమ రవాణా పెరిగిపోతోందన్నారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల ప్రభుత్వంలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు అన్ని యూనియన్లను సమానంగా చూడకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులకు ఉజ్వల భవిష్యత్ జగన్ వల్లే సాధ్యం– ఎమ్మెల్యే ఆర్టీసీ మనుగడ, కార్మికుల ఉజ్వల భవిష్యత్ వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే సాధ్యమని కడప డివిజన్ గౌరవాధ్యక్షుడు, శాసనసభ్యుడు ఎస్బి అంజద్‌బాషా తెలిపారు. 2004 నాటికి నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి జవసత్వాలు నింపింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డేనని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారానే కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆ యూనియన్లకు సమ్మెనోటీసు ఇచ్చే ధైర్యం కూడా లేదు– రాజారెడ్డి ఆర్టీసీలో ప్రధాన యూనియన్లుగా చెప్పుకొనే రెండు యూనియన్లు కార్మికుల సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమయ్యాయని, వాటికి సమ్మెనోటీసు ఇచ్చే ధైర్యం కూడా లేదని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రాజారెడ్డి విమర్శించారు. ఆర్టీసీ రూ.3000 కోట్ల నష్టంతో, రూ.400 కోట్లు వడ్డీలు చెల్లిస్తూ కొనసాగుతోందన్నారు. ప్రతినెలా ఆర్టీసీకి రూ.2కోట్ల నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం ఒక్కపైసా చెల్లించడం లేదన్నారు. అక్రమ రవాణా వల్ల ఆర్టీసీకి రూ.1500 కోట్ల నష్టం వస్తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రెండు సంతకాలతో ఆర్టీసీకి ప్రతిఏటా రూ.500కోట్ల లబ్ధి కలిగేలా చేశారని, ప్రస్తుత ప్రభుత్వం కార్మికులకు డీఏ అరియర్స్ కూడా చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. అనంతరం వారు ఆర్టీసీ ఆర్ఎంకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ఎస్ ప్రసాద్, రీజనల్ ప్రెసిడెంట్ గోపాల్‌రెడ్డి, కార్యదర్శి ఫకద్దీన్, రీజనల్ గౌరవ ఉపాధ్యక్షులు పులి సునీల్, చిరంజీవిరెడ్డి, రెడ్డిబాషా, కడప డిపో కార్యదర్శి జయరాం తదితరులు పాల్గొన్నారు. -
రేపు ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నా
కడప అర్బన్ : వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన కార్మికుల సమస్యలపై రీజినల్ వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు యూనియన్ రీజినల్ కార్యదర్శి ఎస్బీ ఫకృద్దీన్ తెలిపారు. ఈనెల 7వ తేదీన రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి టీఎస్ఎస్ ప్రసాద్, రీజినల్ గౌరవాధ్యక్షులు కె.సురేష్‌బాబు హాజరయ్యారన్నారు. ఈనెల 19వ తేదీన ఆందోళనలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ధర్నాల్లో పాల్గొనాలన్నారు. అలాగే 26న ఛలో ఆర్ఎం కార్యాలయం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ప్రభుత్వ వైఖరి వల్లే ఆర్టీసీకి నష్టాలు
కడప కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే ఏపిఎస్ఆర్టీసీకి ఆర్థికంగా కష్టాలు, నష్టాలు సంభవిస్తున్నాయని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రాజారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఇక్కడి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాల ఊబిలోకి పోకుండా ఉండాలంటే అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని, కానీ ప్రభుత్వం ఆ పనిచేయలేకపోతోందన్నారు. సంస్థ రెవెన్యూను కాపాడటంలో, ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆయిల్‌పై పన్ను రద్దు చేయలేదని, నష్టాలు వచ్చే రూట్లలో ఎంవీ ట్యాక్సు రద్దు చేయలేదని, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్టీసీని వాడుకుంటున్నారని ఉదహరించారు. ప్రభుత్వం నిర్దేశించడం వల్ల ఆర్టీసీకి నష్టం వచ్చినా సరే కొన్ని సర్వీసులను తిప్పాల్సి వస్తోందని ఆవేధన వ్యక్తం చేశారు. లాభాలు వచ్చే రూట్లలో ప్రయివేటు బస్సులు, హైర్ బస్సులను తిప్పడం అత్యంత దారుణమన్నారు. హైర్ బస్సుల్లో కండక్టర్లకు టిమ్ మిషన్లు ఇచ్చి ఆర్థిక పరిపాలనను ప్రయివేటుకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఆటోలు విపరీతంగా తిరుగుతూ తరచూ ప్రమాదాలకు గురికావడం వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయన్నారు. ఆటోలను నియంత్రించేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకొని, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిందని, ఇవన్నీ చూస్తూ కూడా ఏపి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆర్టీసీలో కార్మికులు 8 గంటల డ్యూటీ కాకుండా 14 గంటలు పనిచేస్తున్నారని, దీంతో కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. కండక్టర్ కేటగిరీని పూర్తిగా లేకుండా చేయాలని యాజమాన్యం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. డ్రైవర్ టిమ్‌లు ఇచ్చి కండక్టర్ పనిని డ్రైవర్లపై వేస్తున్నారన్నారు. దీని వల్ల డ్రైవర్లు ఒత్తిడికి గురై ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై ఎంప్లాయీస్ యూనియన్, మజ్దూర్ యూనియన్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 23వేల మంది కండక్టర్లు ఉండగా, ప్రస్తుతం ఏపిలో 18వేలమంది ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు బెనిఫిట్లు దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్నాయని, వాటిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు వైద్య సదుపాయం కోసం విశాఖపట్నం, విజయవాడ, కడపలలో ఆర్టీసీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలన్నారు. వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌పై ఆర్టీసీ యాజమాన్యం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈయూ, ఎన్ఎంయూ నాయకులకు ఇచ్చినట్లుగానే వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నాయకులకు కూడా వర్క్ రిలీఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పార్టీలో చర్చించి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎస్ఎస్ ప్రసాద్, రీజనల్ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, కడప డిపో కార్యదర్శి జయరామయ్య, డిపో వైస్ ప్రెసిడెంట్లు భాస్కర్‌రెడ్డి, బీఎన్ రెడ్డి పాల్గొన్నారు. -
ఎంప్లాయీస్ యూనియన్ విజయఢంకా
ఫలితాలు ఇలా.. జిల్లాలో 13 డిపోలకుగాను ఎనిమిదింటిలో విజయం 5 డిపోలతో సరిపెట్టుకున్న ఎన్.ఎం.యు. ప్రభావం చూపించలేకపోయిన కార్మికపరిషత్ పట్నంబజారు(గుంటూరు) ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో గుంటూరు రీజియన్‌లో ఎంప్లాయిస్ యూనియన్ విజయశంఖారావాన్ని పూరించింది. ప్రధాన ప్రత్యర్థి నేషనల్ మజ్దూర్ యూనియన్‌పై ఘన విజయాన్ని సాధించింది. రీజియన్‌లోని 13 డిపోల్లో ఎనిమిది డిపోలు ఎంప్లాయిస్ యూనియన్ కైవసం చేసుకోగా, ఎన్ఎంయూ ఐదు డిపోలతో సరిపెట్టుకుంది. బాపట్ల, రేపల్లె, నరసరావుపేట, వినుకొండ, గుంటూరుడిపో-2, మంగళగిరి,మాచర్ల, పిడుగురాళ్ళ డిపోల్లో ఎంప్లాయిస్ యూనియన్ విజయం సాధించగా, పొన్నూరు, తెనాలి, సత్తెనపల్లి, గుంటూరు డిపో-1, చిలకలూరిపేటల్లో ఎన్ఎంయూ విజయం సాధించింది. ఎంప్లాయిస్ యూనియన్ బాపట్ల డిపోలో 62 ఓట్ల మెజార్టీ, రేపల్లె -80, నరసరావుపేట - జిల్లాకు 56, స్టేట్‌కు 61, వినుకొండ -15, సత్తెనపల్లి స్టేట్‌కు-29, గుంటూరు డిపో-2లో జిల్లాకు 61, స్టేట్‌కు-57, మంగళగిరి జిల్లా-79, స్టేట్‌కు-64, మాచర్ల జిల్లా- 37, స్టేట్‌కు-55, పిడుగురాళ్ల జిల్లా 54, స్టేట్-54 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. నేషనల్ మజ్దూర్ యూనియన్ పొన్నూరు డిపోలో 110 ఓట్లతో, తెనాలి డిపోలో 34, సత్తెనపల్లి డిపోలో 11 ఓట్లతో, చిలకలూరిపేట డిపోలో 5 ఓట్లతో, గుంటూరు డిపో-1లో 106 ఓట్లతో విజయం సాధించింది. మొత్తం కలిపి జిల్లా వ్యాప్తంగా ఎంప్లాయిస్ యూనియన్‌కు స్టేట్‌కు 2,584 ఓట్లు రాగా, జిల్లాకు 2,585 ఓట్లు వచ్చాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు స్టేట్‌కు 2270 రాగా, జిల్లాకు 2230 వచ్చాయి. వీటితోపాటు వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియర్కు స్టేట్‌కు 38, జిల్లాకు 38, కార్మిక పరిషత్‌కు స్టేట్‌కు 318, జిల్లాకు 352 ఓట్లు రాగా, ఎస్‌డబ్ల్యూఎఫ్ స్టేట్‌కు 238, జిల్లాకు 252 ఓట్లు సాధించాయి. బీడబ్ల్యూ, కార్మిక సంఘ్, యునెటైడ్ వర్కర్స్ యూనియన్ సంఘాలకు కేవలం కొద్దిపాటి ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రీజియన్ పరిధిలో ఎంప్లాయిస్ యూనియన్‌కు అధిక ఓట్లు, డిపోలు రావడంతో మెజార్టీ సాధించినట్లు అధికారులు ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల తనిఖీ.. ఆర్టీసీ బస్టాండ్‌లోని డిపో-1, డిపో-2ను కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఎల్లారావు, ఏపీఎస్ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి తనిఖీ చేశారు. ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించారు. -
ఆర్టీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం
బరిలో ఎనిమిది యూనియన్లు సాక్షి, విజయవాడ/హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ)లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 55,151 ఆపరేషనల్.. 1,287 నాన్-ఆపరేషనల్ ఓట్లతో కలిపి మొత్తం 56,438 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. ప్రతి కార్మికుడు విధిగా రెండు ఓట్లు వేయాలి. రాష్ట్ర స్థాయి(క్లాస్-3) తెలుపు రంగు బ్యాలెట్, రీజియన్ స్థాయి (క్లాస్-6) గులాబీ రంగు బ్యాలెట్‌పై ఓటు వేయాల్సి ఉంటుంది. 13 జిల్లాల్లో 152 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం ఓట్లలో 50 శాతం కంటే ఒక ఓటు ఎక్కువగా వచ్చిన యూనియన్‌కే స్థానిక గుర్తింపు (క్లాస్-6) వస్తుంది. మొత్తం పోలైన ఓట్లలో ఏ యూనియన్‌కు ఎక్కువ ఓట్లు వస్తే దాన్నే (క్లాస్-3) గుర్తింపు యూనియన్‌గా ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (బస్సు గుర్తు), నేషనల్ మజ్దూర్ యూనియన్ (కాగడా), వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ (టేబుల్ ఫ్యాన్), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (స్టార్), కార్మిక పరిషత్ (టైరు), ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ (పావురం), యునెటైడ్ వర్కర్స్ యూనియన్ (స్టీరింగ్), కార్మిక సంఘ్ (పిడికిలి గుర్తు) బరిలో ఉన్నాయి. -
గుర్తింపు దక్కేదెవరికో?
నేడే ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికలు రాత్రికే ఫలితాలు ప్రకటన ఎనిమిది యూనియన్ల పోటాపోటీ ప్రభుత్వంలో విలీనమే ప్రధాన ఎజెండా సంస్థ, కార్మికుల రక్షణా ముఖ్యమే సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న సంస్థను గట్టెక్కించడమే ప్రధాన ఎజెండా. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ హామీతోనే వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నేడు జరిగే గుర్తింపు ఎన్నికల బరిలో నిలిచింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని సాధించడమే లక్ష్యమని ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ కూడా ప్రకటించాయి. ఈ మూడు యూనియన్లతో పాటు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, యునెటైడ్ వర్కర్స్ యూనియన్, కార్మిక సంఘ్, బహుజన వర్కర్స్ యూనియన్, కార్మిక పరిషత్ పోటీలో ఉన్నాయి.జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రావులపాలెం, రాజోలు, రామచంద్రపురం, ఏలేశ్వరం, గోకవరం, తునిలలో ఆర్టీసీ డిపోలున్నాయి. అన్ని రకాల బస్సులు కలసి 673 ఉండగా సుమారు 4 వేల మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. రోజూ దాదాపు మూడు లక్షల మంది జిల్లావాసుల ప్రయాణానికి ఉపయోగపడుతున్న ఆర్టీసీ బస్సు క్రమేపీ నష్టాల ఊబిలోకి కూరుకుపోయింది. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలంటే.. ప్రభుత్వంలో విలీనం ఒక్కటే మార్గం అనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. వైఎస్సార్ సీపీ కూడా ఇదే హామీని ఇచ్చింది. వాస్తవానికి పదో షెడ్యూల్లో ఉన్న ఆర్టీసీ వంటి ప్రభుత్వ అనుబంధ సంస్థలు నష్టాల్లోకి వెళితే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ టీడీపీ సర్కారు ఈ విషయంలో మాటలకే పరిమితమవుతోంది తప్ప ఆచరణలో చూపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అక్కడ ఆర్టీసీని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసీకి రూ.200 కోట్లు, మిగతా జిల్లాల్లో రూ.75 కోట్ల ప్రత్యేక గ్రాంటు ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ నష్టాల సమస్యను ఆర్టీసీనే పరిష్కరించుకోవాలన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్లూ రాకపోవడంతో ఆర్టీసీకి జిల్లాలో ఉన్న విలువైన స్థలాలు బీవోటీ పద్ధతిలో దీర్ఘకాల లీజుకు వెళ్లిపోతున్నాయి. ప్రైవేటు రవాణా సంస్థలతో పోటీపడి ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలంటే పూర్తిస్థాయి ప్రభుత్వ సంస్థగా మార్పు చేయడం ఒక్కటే మార్గమని కార్మికులంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. సిబ్బందిపై ఒత్తిడి.. ఆర్టీసీ ప్రజాసేవా సంస్థ నుంచి లాభనష్టాలు బేరీజు వేసుకొనే ప్రైవేట్ సంస్థలా మారిపోతున్న ప్రభావం సిబ్బందిపై పడుతోంది. రోజురోజుకూ పనిఒత్తిడి పెరిగిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్, కండక్టర్ రెండు పనులూ ఒక్కరే చేస్తున్న సర్వీసుల సంఖ్య ఏటా పెరుగుతోంది. తమ విధులను లాభనష్టాల కోణంలో చూస్తుండటంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిపోల్లో మెకానిక్‌లు తదితర నిర్వహణ సిబ్బంది పరిస్థితి కూడా అంతే. నిబంధనల ప్రకారం 13 లక్షల కిలోమీటర్ల ప్రయాణం పూర్తిచేసిన బస్సులను నిలిపేయాలి. కానీ ఆ లక్ష్యం పూర్తిచేసుకున్న వాటికీ మరమ్మతులు చేసి రోడ్డు ఎక్కిస్తున్నారు. అవి మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇలాంటి బ్రేక్డౌన్లు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించడమనేదీ ఇప్పుడు ఎన్నికల ఎజెండాగా మారింది. సంక్షేమంపై దృష్టి.. విధి నిర్వహణలో ఎవరైనా ఆర్టీసీ సిబ్బంది మృతి చెందితే వారి కుటుంబానికి కేవలం రూ.లక్ష మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నారు. దీన్ని కనీసం రూ.10 లక్షలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్. ఉద్యోగ విరమణ చేసినవారికి పింఛను రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకే ఉంటోంది. దీన్ని కనీసం రూ.10 వేలు చేయాలనేది మరో డిమాండ్. వాటన్నింటినీ సాధిస్తామని ఎన్నికల బరిలో ఉన్న యూనియన్లన్నీ కార్మికులకు హామీ ఇస్తున్నాయి. పోలింగ్‌కు ఏర్పాట్లు జిల్లాలోని డిపోల్లో 3,446 మంది ఓటర్లుండగా వారంతా ఓటేందుకు డిపోలవారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5 గంటలకే పోలింగ్ మొదలై సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఆరు గంటల నుంచి లెక్కింపు ప్రారంభించి వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ప్రతి కార్మికుడూ క్లాజ్-3 (తెల్లరంగు) బ్యాలట్ పేపరుపై రాష్ట్ర గుర్తింపు సంఘానికి, క్లాజ్-6 (గులాబీ రంగు) బ్యాల ట్ పేపరుపై ప్రాంతీయ గుర్తింపు సంఘానికి రెండు ఓట్లు వేయాలి. ఏ యూనియన్కైనా 1,724 ఓట్లు వస్తేనే జిల్లా గుర్తింపు సంఘం హోదా వస్తుంది. -
ఆర్టీసీ ఎన్నికలకు రెడీ!
4946 మంది ఓటర్లు 11 చోట్ల పోలింగ్ కేంద్రాలు బరిలో 8 యూనియన్లు సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 18న జరిగే ఈ ఎన్నికలకు ఎనిమిది యూనియన్లు పోటీ పడుతున్నాయి. విశాఖ రీజియన్ పరిధిలో పది డిపోల్లోనూ, విశాఖ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో మరొకటి వెరసి 11 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. రీజియన్ వ్యాప్తంగా 4946 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటరు ఒకటి రీజియన్‌కు, మరొకటి రాష్ట్ర యూనియన్‌కు ఓటేయాల్సి ఉంటుంది. రాష్ట్ర యూనియన్‌కు తెలుపు, రీజియన్ యూనియన్‌కు గులాబీ రంగు బ్యాలెట్లు ఇస్తారు. పోలింగ్ ముగిసాక అదే రోజు ఓట్ల లెక్కింపు ఉన్నా ఫలితాన్ని ఆ రోజు వెల్లడించరు. ఎందుకంటే ఈ నెల 24న పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అయితే 18వ తేదీన ఫలితాన్ని అధికారికంగా వెల్లడించకపోయినా అనధికారికంగా ఏ యూనియన్ విజయం సాధించిందో తెలిసిపోతుంది. ఒకవేళ స్వల్ప ఓట్ల తేడా వస్తే మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికలను డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ప్రస్తుతం విశాఖ రీజియన్‌లో ఎన్ఎంయూ, రాష్ట్రంలో ఎంప్లాయీస్ యూనియన్లు గుర్తింపు యూనియన్లుగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం యూనియన్లకు కేటాయించిన గుర్తులకే ఓటేస్తారు. గెలిచిన అనంతరం ఆయా యూనియన్లు రీజియన్, డిపోల వారీగా కార్యవర్గాన్ని నియమిస్తాయి. ముగిసిన ప్రచారం: ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. కొద్దిరోజులుగా బరిలో నిలిచిన వివిధ యూనియన్లు విస్తృతంగా ప్రచారం చేశాయి. పలు బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాయి. తమ యూనియన్ను గెలిపిస్తే చేయబోయే మేళ్లను, ప్రత్యర్థి యూనియన్ల వైఫల్యాలను వివరించాయి. గత ంకంటే తగ్గిన ఓట్లు: వాస్తవానికి ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల పదవీకాలం రెండేళ్లుంటుంది. గత ఏడాదితో రెండేళ్ల పదవీకాలం ముగిసింది. అయితే సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా గత సంవత్సరం ఈ ఎన్నికలు జరగలేదు. దీంతో మూడేళ్లు గడిచిపోయింది. ఈసారి ఎన్నికల్లో గతంకంటే దాదాపు వెయ్యి ఓట్లు తగ్గాయి. మూడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో దాదాపు ఆరు వేల ఓట్లుండేవి. ఈ రీజియన్‌లో 108 బస్సుల (సిటీలో 76, జిల్లాలో 32) ను తొలగించారు. ఒక్కో బస్సుకు సగటున 7.6 మంది సిబ్బంది ఉంటారు. దీంతో ఈ బస్సుల్లో పనిచేసే సిబ్బంది సంఖ్యను కుదించేయడం ఓట్ల సంఖ్య తగ్గడానికి కారణమని కార్మిక నాయకులు చెబుతున్నారు. గుర్తింపు ఎన్నికల్లో 95 శాతానికి పైగానే ఓట్లు పోలవుతాయని వీరు అంచనా వేస్తున్నారు. మరోవైపు రీజియన్‌లో అత్యధికంగా వాల్తేరులో 776 ఓట్లు, పాడేరులో అత్యల్పంగా 183 ఓట్లు ఉన్నాయి. ఏ యూనియన్‌కు ఏ గుర్తు? గుర్తింపు యూనియన్ ఎన్నికల బరిలో నిలిచిన యూనియన్లకు గుర్తులను కేటాయించారు. అవి బ్యాలెట్ పత్రంలో వరస క్రమంలో ఇలా ఉన్నాయి. 1) ఏపీఎస్ఆర్టీసీ బహుజన్ వర్కర్స్ యూనియన్ ఎగిరే పావురం 2) ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ బస్సు 3) ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ బస్సు టైరు 4) ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘ్ కార్మికుని పిడికిలి 5) ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ కాగడా 6) ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నక్షత్రం 7) ఏపీఎస్ఆర్టీసీ యునెటైడ్ వర్కర్స్ యూనియన్ స్టీరింగ్ పట్టుకున్న డ్రైవర్ 8) వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ టేబుల్ ఫ్యాన్ -
రేపు ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికలు
ముగిసిన ప్రచారం ఓటు హక్కు వినియోగించుకోనున్న 3,450 మంది కాకినాడ సిటీ : ఈ నెల 18న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఆయా డిపోల్లో అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జిల్లాలోని తొమ్మిది డిపోల్లో జరిగే పోలింగ్‌కు కార్మిక శాఖ అధికారులు పోలింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఎక్కడికక్కడే స్థానికంగా ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. జిల్లావ్యాప్తంగా 3,450 మంది ఆర్టీసీ కార్మికులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉండగా నెల రోజులుగా డిపోల్లో జరిగిన ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. డిపోలవారీగా ఓటర్ల వివరాలు జిల్లాలోని తొమ్మిది డిపోల్లో ఓటర్ల వివరాలు.. కాకినాడలో 611, రాజమహేంద్రవరం 614, అమలాపురం 540, తుని 331, ఏలేశ్వరం 265, గోకవరం 287, రామచంద్రపురం 284, రావులపాలెం 290, రాజోలు డిపోలో 228 మంది ఓటర్లు ఉన్నారు. రెండు ఓట్లు వేయాలి గుర్తింపు సంఘ ఎన్నికలో ప్రతి ఓటరూ రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. క్లాజ్-6 పేరుతో ఉన్న పింక్ బ్యాలెట్ పేపర్‌పై జిల్లా గుర్తింపు సంఘానికి, క్లాజ్-3 పేరుతో ఉన్న వైట్ బ్యాలెట్ పేపర్‌పై రాష్ట్ర గుర్తింపు సంఘానికి ఓటు వేయాలి. బరిలో నిలిచిన సంఘాలు గుర్తింపు సంఘ ఎన్నికల బరిలో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, యుైనెటైడ్ వర్కర్స్ యూనియన్, కార్మిక సంఘ్, బహుజన వర్కర్స్ యూనియన్, కార్మిక పరిషత్ ఉన్నాయి. -
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయిస్తాం
వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నేతలను గెలిపించండి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, చింతల పీలేరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయిస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం వారు పీలేరులో పర్యటిం చారు. కొత్తపల్లెలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మిత్రులు, శ్రేయోభిలాషులు, వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ అభిమాన కార్మికులంతా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూని యన్ నేతలకు ఓట్లు వేసి గెలిపించాల ని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆయన సీఎం అయిన ఆరు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రయివేట్‌పరం చేసేందుకు అద్దె బస్సులను అడ్డగోలుగా తీసుకుం టోందన్నారు. పీలేరు, కేవీపల్లె జెడ్పీటీసీ సభ్యులు ఎం. రెడ్డిభాషా, జీ. జయరామచంద్రయ్య, ఎంపీపీ కే. మహితాఆనంద్, మండల ఉపాధ్యక్షుడు కంభం సతీష్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎస్. హబీబ్‌బాషా, వైఎస్సార్సీపీ మండల కన్వీన ర్ నారే వెంకట్రమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు వై. హరిణి, ఎం. భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఓటడిగే హక్కు వైఎస్సార్ మజ్దూర్‌కే ఉంది
అధికారంలోకి రాగానేఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం టేబుల్ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి యూనియన్ను బలపరచాలి వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి విజయవాడ (గాంధీనగర్) : ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఓటడిగే హక్కు వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌కు మాత్రమే ఉందని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో వైఎస్సార్ యూనియన్‌కు కార్మిక శాఖ టేబుల్ ఫ్యాన్‌ను ఎన్నికల గుర్తుగా కేటాయించిందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క సంతకంతో 9,600 మంది కార్మికులను పర్మినెంట్ చేశారన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు రూ. 250 కోట్లు కేటాయించి ఆదుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని రిలయన్స్‌కు, ఎంపీ కేశినేని శ్రీనివాస్‌కు ఇచ్చేందుకు కుతంత్రాలు చేస్తోందన్నారు. విద్యాధరపురంలోని ఆర్టీసీ స్థలాన్ని బాలకృష్ణ వియ్యంకుడికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. ఆస్పత్రి నిర్మాణం పేరుతో కార్మికుల వేతనాల్లోంచే రూ.100 వసూలు చేసిన పాపం చంద్రబాబుదేనన్నారు. కార్మికుల సంక్షేమం కోసం.. కార్మికుల సంక్షేమం కోసం సత్వరమే చేయాల్సిన తొమ్మిది కార్యక్రమాలను నవరత్నాల పేరిట అమలు చేయాలని వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ నిర్ణయించిందని గౌతంరెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే హామీతో తమ యూనియన్ పోటీ చేస్తోందని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ విధానానికి స్వస్తి చెప్పి, సింగిల్ డ్రైవర్ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. డ్రైవర్‌కు కండక్టర్ బాధ్యతలు తప్పిం చటం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పించటా నికి వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ సిద్ధమైందని వివరించారు. టేబుల్ ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ను బలపరచాలని కోరారు. యూనియన్ రీజియన్ కార్యదర్శి డీవీఎస్ బాల సుబ్రహ్మణ్యం, ఎన్నికల కన్వీనర్ పి.రవికాంత్, కె.అరుణ్‌కుమార్, జీకే బాబు పాల్గొన్నారు. -
'వైఎస్ఆర్ హయాంలోనే ఆర్టీసీ బలోపేతం'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పనిచేసిన కాలంలోనే ఆర్టీసీని బలోపేతం చేశారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, జ్యోతుల నెహ్రు శనివారం తెలిపారు. అధికార తెలుగుదేశం పార్టీ ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు దారదత్తం చేసేందుకు కుట్రపన్నుతోందని వారు ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తొలి సంతకం చేస్తారని ఎమ్మెల్యేలు తెలిపారు. ఆర్టీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ను గెలిపించాలని కోరారు. -
'వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ను గెలిపించండి'
విశాఖపట్నం : రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బతికి బట్టకట్టాలంటే వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ను గెలిపించాలని కార్మికులకు ఆ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఆర్టీసీ ఎన్నికల్లో తమ యూనియన్ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. టేబుల్ ఫ్యాన్ గుర్తుపై రాష్ట్రంలోని 126 డిపోల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల నేపథ్యంలో రవీంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో ఆర్టీసీ యూనియన్ నేతలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.... ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసి దివాలా తీసే యోచనలో చంద్రబాబు సర్కార్ ఉందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న యూనియన్‌కి... ప్రభుత్వాన్ని, ఆర్టీసీ మేనేజ్మెంట్ని నిలదీసే నాయకత్వం లేదన్నారు. సంస్థలో యూనియన్లు బలంగా ఉంటే రాష్ట్రంలో అద్దె బస్సులు వచ్చేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీలోని 67 మంది ఎమ్మెల్యేలతో సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూరు యూనియన్ పనిచేస్తుందని పి.రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపైనే తొలి సంతకం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. అందుకోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమిద్దాం
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణ సంస్థను పరిరక్షణకు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కొత్త బస్టాండ్‌లో ఆ సంఘం రీజినల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన రాజారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ప్రస్తుతం కిష్ట పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలే కారణమన్నారు. 1.25 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులకు జీవనోపాధి కల్పించిన సంస్థ ప్రస్తుతం రూ.3 వేల కోట్లు అప్పుల్లో ఉందని, ఈ సంస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. అయితే ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి గుర్తింపు సాధించిన ఎంప్లాయీస్ యూనియన్, రీజియన్ స్థాయి గుర్తింపు పొందిన నేషనల్ మజ్దూర్ యూనియన్లు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. హడావిడిగా సమ్మెకు నోటీసులివ్వడం, ఎలాంటి హామీలు పరిష్కారం కాకుండానే ఆందోళన విరమించుకోవడం కార్మికుల పట్ల ఆ సంఘాలకు ఉన్న చిత్తుశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు. కొందరు డిపో మేనేజర్లు, ఇతర అధికారులు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని, ఈ వైఖరిని మానుకోవాని కోరారు. సమస్యలను పరిష్కరించి సంస్థను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఎస్.ఎస్. ప్రసాద్, కార్యదర్శులు శంకర్‌రెడ్డి, కె.ఎ.ఖాన్, ప్రచార కార్యదర్శి ఎం.వి. కుమార్ పాల్గొన్నారు.