ప్రభుత్వ వైఖరి వల్లే ఆర్టీసీకి నష్టాలు
కడప కార్పొరేషన్:
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే ఏపిఎస్‌ఆర్‌టీసీకి ఆర్థికంగా కష్టాలు, నష్టాలు సంభవిస్తున్నాయని వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రాజారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఇక్కడి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాల ఊబిలోకి పోకుండా ఉండాలంటే అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని, కానీ ప్రభుత్వం ఆ
పనిచేయలేకపోతోందన్నారు. సంస్థ రెవెన్యూను కాపాడటంలో, ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆయిల్‌పై పన్ను రద్దు చేయలేదని, నష్టాలు వచ్చే రూట్లలో ఎంవీ ట్యాక్సు రద్దు చేయలేదని, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆర్టీసీని వాడుకుంటున్నారని ఉదహరించారు. ప్రభుత్వం నిర్దేశించడం వల్ల ఆర్టీసీకి నష్టం వచ్చినా సరే కొన్ని సర్వీసులను తిప్పాల్సి
వస్తోందని ఆవేధన వ్యక్తం చేశారు. లాభాలు వచ్చే రూట్లలో ప్రయివేటు బస్సులు, హైర్ బస్సులను తిప్పడం అత్యంత దారుణమన్నారు. హైర్ బస్సుల్లో కండక్టర్లకు టిమ్ మిషన్లు ఇచ్చి ఆర్థిక పరిపాలనను ప్రయివేటుకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఆటోలు విపరీతంగా తిరుగుతూ తరచూ ప్రమాదాలకు గురికావడం వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయన్నారు. ఆటోలను నియంత్రించేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకొని, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసిందని, ఇవన్నీ చూస్తూ కూడా ఏపి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆర్టీసీలో కార్మికులు 8 గంటల
డ్యూటీ కాకుండా 14 గంటలు పనిచేస్తున్నారని, దీంతో కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. కండక్టర్ కేటగిరీని పూర్తిగా లేకుండా చేయాలని యాజమాన్యం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. డ్రైవర్ టిమ్‌లు ఇచ్చి కండక్టర్ పనిని డ్రైవర్లపై వేస్తున్నారన్నారు. దీని వల్ల డ్రైవర్లు ఒత్తిడికి గురై ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై ఎంప్లాయీస్ యూనియన్, మజ్దూర్ యూనియన్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 23వేల మంది కండక్టర్లు ఉండగా, ప్రస్తుతం ఏపిలో 18వేలమంది ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు బెనిఫిట్లు దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్నాయని, వాటిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు వైద్య సదుపాయం కోసం విశాఖపట్నం, విజయవాడ, కడపలలో ఆర్టీసీ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలన్నారు. వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌పై ఆర్టీసీ యాజమాన్యం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈయూ, ఎన్‌ఎంయూ నాయకులకు ఇచ్చినట్లుగానే వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నాయకులకు కూడా వర్క్ రిలీఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పార్టీలో చర్చించి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎస్‌ఎస్ ప్రసాద్, రీజనల్ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, కడప డిపో కార్యదర్శి జయరామయ్య, డిపో వైస్ ప్రెసిడెంట్లు భాస్కర్‌రెడ్డి, బీఎన్ రెడ్డి పాల్గొన్నారు.