కడప కార్పొరేషన్: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఉనికి ప్రమాదంలో పడిందని వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రీజనల్ గౌరవాధ్యక్షుడు, నగర మేయర్ కె. సురేష్‌బాబు విమర్శించారు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు నుంచి రీజనల్ మేనేజర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్‌ఎం కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రై వేటీకరణ చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ఎంపీలు కేశినేని, జేసీ దివాకర్‌రెడ్డి బస్సుల వల్లే అక్రమ రవాణా పెరిగిపోతోందన్నారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల ప్రభుత్వంలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో అలాంటి పరిస్థితే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు అన్ని యూనియన్లను సమానంగా చూడకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఆర్టీసీ కార్మికులకు ఉజ్వల భవిష్యత్ జగన్ వల్లే సాధ్యం– ఎమ్మెల్యే
ఆర్టీసీ మనుగడ, కార్మికుల ఉజ్వల భవిష్యత్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమని కడప డివిజన్ గౌరవాధ్యక్షుడు, శాసనసభ్యుడు ఎస్‌బి అంజద్‌బాషా తెలిపారు. 2004 నాటికి నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి జవసత్వాలు నింపింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డేనని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారానే కార్మికులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.
ఆ యూనియన్లకు సమ్మెనోటీసు ఇచ్చే ధైర్యం కూడా లేదు– రాజారెడ్డి
ఆర్టీసీలో ప్రధాన యూనియన్లుగా చెప్పుకొనే రెండు యూనియన్లు కార్మికుల సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమయ్యాయని, వాటికి సమ్మెనోటీసు ఇచ్చే ధైర్యం కూడా లేదని వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. రాజారెడ్డి విమర్శించారు. ఆర్టీసీ రూ.3000 కోట్ల నష్టంతో, రూ.400 కోట్లు వడ్డీలు చెల్లిస్తూ కొనసాగుతోందన్నారు. ప్రతినెలా ఆర్టీసీకి రూ.2కోట్ల నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం ఒక్కపైసా చెల్లించడం లేదన్నారు. అక్రమ రవాణా వల్ల ఆర్టీసీకి రూ.1500 కోట్ల నష్టం వస్తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ రెండు సంతకాలతో ఆర్టీసీకి ప్రతిఏటా రూ.500కోట్ల లబ్ధి కలిగేలా చేశారని, ప్రస్తుత ప్రభుత్వం కార్మికులకు డీఏ అరియర్స్ కూడా చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. అనంతరం వారు ఆర్టీసీ ఆర్‌ఎంకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్‌ఎస్ ప్రసాద్, రీజనల్ ప్రెసిడెంట్ గోపాల్‌రెడ్డి, కార్యదర్శి ఫకద్దీన్, రీజనల్ గౌరవ ఉపాధ్యక్షులు పులి సునీల్, చిరంజీవిరెడ్డి, రెడ్డిబాషా, కడప డిపో కార్యదర్శి జయరాం తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉనికిని ప్రమాదంలో పడేసిన ప్రభుత్వం
Published Wed, Oct 26 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
Advertisement
Advertisement