కడప అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీలో కార్మికుల పరస్పర సహకార సంఘం (సీసీఎస్) ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో ఆయా సమయాల్లో గుర్తింపు ఉన్న సంఘానికే ఎక్కువ కార్మికులు మొగ్గుచూపే అవకాశం ఉంది.నాలుగైదు రోజుల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. 13వ తేదీ సాయంత్రానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అప్పుడు ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారనే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఉన్న ఎన్‌ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ అని కార్మికులు చర్చించుకుంటున్నారు. కడప రీజియన్ పరిధిలో ఎనిమిది డిపోలకుగాను 16 స్థానాలు, నాన్ ఆపరేషన్ కింద జోనల్ వర్క్‌షాప్‌లో మూడు స్థానాల్లో మొత్తం 19 స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. రీజియన్‌లో ఎనిమిది డిపోల పరి«ధిలోని అధికారులు, సిబ్బందితో కలిసి 4186 ఓట్లు ఉన్నాయి. నాన్ ఆపరేషన్ కింద జోనల్ వర్క్‌షాప్‌లో ఉన్న మూడు స్థానాలకు 320 ఓట్లు ఉన్నాయి. అభ్యర్థులు వివిధ విభాగాలలో పనిచేస్తున్నారు. కడప రీజియన్‌లోని 19 స్థానాలలో కడప డిపో, ఆర్‌ఎం కార్యాలయంతో కలిపి నాలుగు స్థానాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు మూడు, రాజంపేట రెండు, రాయచోటి రెండు, పులివెందుల, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగులలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
యూనియన్ల మధ్య పోటాపోటీ
ఏపీఎస్ ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో ప్రధానంగా ఎంప్లాయీస్ యూనియన్‌కు వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ మద్దతు ఇవ్వడంతో మరింత బలం చేకూరిందనే చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో మరోవైపు నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు తమ కార్మికులను అభ్యర్థులుగా నిలబెట్టారు. కార్మిక పరిషత్ కూడా ఒంటరిగా తమ అభ్యర్థులను బరిలో దించింది. అయితే ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. 16వ తేదీనే ఎన్నికలు ఆ వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు.