december 13
-
ఆర్టీసీలో సీసీఎస్ ఎన్నికల హడావిడి
కడప అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీలో కార్మికుల పరస్పర సహకార సంఘం (సీసీఎస్) ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికల్లో ఆయా సమయాల్లో గుర్తింపు ఉన్న సంఘానికే ఎక్కువ కార్మికులు మొగ్గుచూపే అవకాశం ఉంది.నాలుగైదు రోజుల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. 13వ తేదీ సాయంత్రానికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అప్పుడు ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారనే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఉన్న ఎన్ఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ల మధ్యే ప్రధాన పోటీ అని కార్మికులు చర్చించుకుంటున్నారు. కడప రీజియన్ పరిధిలో ఎనిమిది డిపోలకుగాను 16 స్థానాలు, నాన్ ఆపరేషన్ కింద జోనల్ వర్క్‌షాప్‌లో మూడు స్థానాల్లో మొత్తం 19 స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. రీజియన్‌లో ఎనిమిది డిపోల పరి«ధిలోని అధికారులు, సిబ్బందితో కలిసి 4186 ఓట్లు ఉన్నాయి. నాన్ ఆపరేషన్ కింద జోనల్ వర్క్‌షాప్‌లో ఉన్న మూడు స్థానాలకు 320 ఓట్లు ఉన్నాయి. అభ్యర్థులు వివిధ విభాగాలలో పనిచేస్తున్నారు. కడప రీజియన్‌లోని 19 స్థానాలలో కడప డిపో, ఆర్ఎం కార్యాలయంతో కలిపి నాలుగు స్థానాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు మూడు, రాజంపేట రెండు, రాయచోటి రెండు, పులివెందుల, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగులలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. యూనియన్ల మధ్య పోటాపోటీ ఏపీఎస్ ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో ప్రధానంగా ఎంప్లాయీస్ యూనియన్‌కు వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ మద్దతు ఇవ్వడంతో మరింత బలం చేకూరిందనే చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో మరోవైపు నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు తమ కార్మికులను అభ్యర్థులుగా నిలబెట్టారు. కార్మిక పరిషత్ కూడా ఒంటరిగా తమ అభ్యర్థులను బరిలో దించింది. అయితే ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. 16వ తేదీనే ఎన్నికలు ఆ వెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు. -
ఆ దుర్దినానికి నేటితో పద్నాలుగేళ్లు
న్యూఢిల్లీ: అ దుర్దినం సరిగ్గా ఈరోజే.. నేటికి పద్నాలుగేళ్లు. గుర్తొచ్చిన ప్రతిసారి ఉలిక్కిపడేలా చేసే ఘటన. పాకిస్థాన్ ముష్కరుల బరితెగింపునకు ఆ సంఘటన ఒక సజీవసాక్ష్యం. వారి ఎత్తులు పైఎత్తులు, రక్తదాహానికి నిదర్శనం. 2001 డిసెంబర్ 13న.. పార్లమెంటు ఉభయసభలు పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. అగ్రనేతలంతా అందులోనే ఉన్నారు. సామాన్య పౌరులు కూడా కొన్ని పనుల నిమిత్తం అందులో ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ కారు పార్లమెంటు భవనం ఆవరణలో వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన వ్యక్తులు హోంశాఖ, పార్లమెంటుతో కూడిన లేబుల్స్ ధరించి ఉన్నారు. దిగిన వెంటనే భారీ మారణహోమం సృష్టించేందుకు తెరతీశారు. మొత్తం ఐదుగురు లష్కరే ఈ తోయిబా ఉగ్రవాదులు, జైషే ఈ మహ్మద్ సంస్ధకు చెందిన ఉగ్రవాదులు ఒక్కసారిగా పార్లమెంటులోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఎన్నో రౌండ్ల కాల్పులు. వారిని నిలువరించేందుకు ఒక్కరినీ కూడా పార్లమెంటు నీడను తాకకుండా చేసేందుకు పార్లమెంటు వద్ద రక్షణ బలగాలు మోహరించి ఎదురుకాల్పులకు దిగాయి. చివరికి దాడికి ప్రయత్నించిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని నిలువరించే క్రమంలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి చనిపోయాడు. ఈ ఘటన జరగడంతోనే భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన జరుగుతుండగా 40 నిమిషాలపాటు పార్లమెంటు వాయిదా వేశారు. కాల్పులు జరుగుతున్న సందర్భంలో నాటి హోమంత్రి ఎల్ కే అద్వానీ, రక్షణశాఖ సహాయమంత్రి హరీన్ పాఠక్ వంటి నేతలు సభ లోపలే ఉన్నారు. గ్రెనేడ్లు, పిస్టల్స్, ఏకే 47 తుపాకులతో ఉగ్రవాదులకు దాడులకు దిగారు. ఈ ఘటన జరిగి నేటి రోజుకు(డిసెంబర్, 13) సరిగ్గా పద్నాలుగేళ్లు. ఈ సందర్భంగా ఆదివారం పార్లమెంటులో నాటి మృతులకు ఘన నివాళి అర్పించారు. దేశ నేతలంతా అంజలి ప్రకటించారు.