ఆ దుర్దినానికి నేటితో పద్నాలుగేళ్లు
న్యూఢిల్లీ: అ దుర్దినం సరిగ్గా ఈరోజే.. నేటికి పద్నాలుగేళ్లు. గుర్తొచ్చిన ప్రతిసారి ఉలిక్కిపడేలా చేసే ఘటన. పాకిస్థాన్ ముష్కరుల బరితెగింపునకు ఆ సంఘటన ఒక సజీవసాక్ష్యం. వారి ఎత్తులు పైఎత్తులు, రక్తదాహానికి నిదర్శనం. 2001 డిసెంబర్ 13న.. పార్లమెంటు ఉభయసభలు పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. అగ్రనేతలంతా అందులోనే ఉన్నారు. సామాన్య పౌరులు కూడా కొన్ని పనుల నిమిత్తం అందులో ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ కారు పార్లమెంటు భవనం ఆవరణలో వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన వ్యక్తులు హోంశాఖ, పార్లమెంటుతో కూడిన లేబుల్స్ ధరించి ఉన్నారు.
దిగిన వెంటనే భారీ మారణహోమం సృష్టించేందుకు తెరతీశారు. మొత్తం ఐదుగురు లష్కరే ఈ తోయిబా ఉగ్రవాదులు, జైషే ఈ మహ్మద్ సంస్ధకు చెందిన ఉగ్రవాదులు ఒక్కసారిగా పార్లమెంటులోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఎన్నో రౌండ్ల కాల్పులు. వారిని నిలువరించేందుకు ఒక్కరినీ కూడా పార్లమెంటు నీడను తాకకుండా చేసేందుకు పార్లమెంటు వద్ద రక్షణ బలగాలు మోహరించి ఎదురుకాల్పులకు దిగాయి. చివరికి దాడికి ప్రయత్నించిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని నిలువరించే క్రమంలో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి చనిపోయాడు. ఈ ఘటన జరగడంతోనే భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన జరుగుతుండగా 40 నిమిషాలపాటు పార్లమెంటు వాయిదా వేశారు.
కాల్పులు జరుగుతున్న సందర్భంలో నాటి హోమంత్రి ఎల్ కే అద్వానీ, రక్షణశాఖ సహాయమంత్రి హరీన్ పాఠక్ వంటి నేతలు సభ లోపలే ఉన్నారు. గ్రెనేడ్లు, పిస్టల్స్, ఏకే 47 తుపాకులతో ఉగ్రవాదులకు దాడులకు దిగారు. ఈ ఘటన జరిగి నేటి రోజుకు(డిసెంబర్, 13) సరిగ్గా పద్నాలుగేళ్లు. ఈ సందర్భంగా ఆదివారం పార్లమెంటులో నాటి మృతులకు ఘన నివాళి అర్పించారు. దేశ నేతలంతా అంజలి ప్రకటించారు.