గుర్తింపు దక్కేదెవరికో? | rtc elections start now | Sakshi
Sakshi News home page

గుర్తింపు దక్కేదెవరికో?

Published Thu, Feb 18 2016 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

గుర్తింపు  దక్కేదెవరికో?

గుర్తింపు దక్కేదెవరికో?

నేడే ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికలు
రాత్రికే ఫలితాలు ప్రకటన
ఎనిమిది యూనియన్ల పోటాపోటీ
ప్రభుత్వంలో విలీనమే ప్రధాన ఎజెండా
సంస్థ, కార్మికుల రక్షణా ముఖ్యమే

 
 
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న సంస్థను గట్టెక్కించడమే ప్రధాన ఎజెండా. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ హామీతోనే వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నేడు జరిగే గుర్తింపు ఎన్నికల బరిలో నిలిచింది. ప్రభుత్వంలో  ఆర్టీసీ విలీనాన్ని సాధించడమే లక్ష్యమని ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ కూడా ప్రకటించాయి. ఈ మూడు యూనియన్లతో పాటు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, యునెటైడ్ వర్కర్స్ యూనియన్, కార్మిక సంఘ్, బహుజన వర్కర్స్ యూనియన్, కార్మిక పరిషత్ పోటీలో ఉన్నాయి.జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రావులపాలెం, రాజోలు, రామచంద్రపురం, ఏలేశ్వరం, గోకవరం, తునిలలో ఆర్టీసీ డిపోలున్నాయి. అన్ని రకాల బస్సులు కలసి 673 ఉండగా సుమారు 4 వేల మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. రోజూ దాదాపు మూడు లక్షల మంది జిల్లావాసుల ప్రయాణానికి ఉపయోగపడుతున్న ఆర్టీసీ బస్సు క్రమేపీ నష్టాల ఊబిలోకి కూరుకుపోయింది. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలంటే.. ప్రభుత్వంలో విలీనం ఒక్కటే మార్గం అనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.


వైఎస్సార్ సీపీ కూడా ఇదే హామీని ఇచ్చింది. వాస్తవానికి పదో షెడ్యూల్‌లో ఉన్న ఆర్టీసీ వంటి ప్రభుత్వ అనుబంధ సంస్థలు నష్టాల్లోకి వెళితే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ టీడీపీ సర్కారు ఈ విషయంలో మాటలకే పరిమితమవుతోంది తప్ప ఆచరణలో చూపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అక్కడ ఆర్టీసీని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసీకి రూ.200 కోట్లు, మిగతా జిల్లాల్లో రూ.75 కోట్ల ప్రత్యేక గ్రాంటు ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ నష్టాల సమస్యను ఆర్టీసీనే పరిష్కరించుకోవాలన్నట్టు  ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్లూ రాకపోవడంతో ఆర్టీసీకి జిల్లాలో ఉన్న విలువైన స్థలాలు బీవోటీ పద్ధతిలో దీర్ఘకాల లీజుకు వెళ్లిపోతున్నాయి. ప్రైవేటు రవాణా సంస్థలతో పోటీపడి ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలంటే పూర్తిస్థాయి ప్రభుత్వ సంస్థగా మార్పు చేయడం ఒక్కటే మార్గమని కార్మికులంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు.


 సిబ్బందిపై ఒత్తిడి..
ఆర్టీసీ ప్రజాసేవా సంస్థ నుంచి లాభనష్టాలు బేరీజు వేసుకొనే ప్రైవేట్ సంస్థలా మారిపోతున్న ప్రభావం సిబ్బందిపై పడుతోంది. రోజురోజుకూ పనిఒత్తిడి పెరిగిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్, కండక్టర్ రెండు పనులూ ఒక్కరే చేస్తున్న సర్వీసుల సంఖ్య ఏటా పెరుగుతోంది. తమ విధులను లాభనష్టాల కోణంలో చూస్తుండటంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిపోల్లో మెకానిక్‌లు తదితర నిర్వహణ సిబ్బంది పరిస్థితి కూడా అంతే. నిబంధనల ప్రకారం 13 లక్షల కిలోమీటర్ల ప్రయాణం పూర్తిచేసిన బస్సులను నిలిపేయాలి. కానీ ఆ లక్ష్యం పూర్తిచేసుకున్న వాటికీ మరమ్మతులు చేసి రోడ్డు ఎక్కిస్తున్నారు. అవి మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇలాంటి బ్రేక్‌డౌన్‌లు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించడమనేదీ ఇప్పుడు ఎన్నికల ఎజెండాగా మారింది.


 సంక్షేమంపై దృష్టి..
విధి నిర్వహణలో ఎవరైనా ఆర్టీసీ సిబ్బంది మృతి చెందితే వారి కుటుంబానికి కేవలం రూ.లక్ష మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నారు. దీన్ని కనీసం రూ.10 లక్షలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్. ఉద్యోగ విరమణ చేసినవారికి పింఛను రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకే ఉంటోంది. దీన్ని కనీసం రూ.10 వేలు చేయాలనేది మరో డిమాండ్. వాటన్నింటినీ సాధిస్తామని ఎన్నికల బరిలో ఉన్న యూనియన్లన్నీ కార్మికులకు హామీ ఇస్తున్నాయి.


పోలింగ్‌కు ఏర్పాట్లు
 జిల్లాలోని డిపోల్లో 3,446 మంది ఓటర్లుండగా వారంతా ఓటేందుకు డిపోలవారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5 గంటలకే పోలింగ్ మొదలై సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఆరు గంటల నుంచి లెక్కింపు ప్రారంభించి వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ప్రతి కార్మికుడూ క్లాజ్-3 (తెల్లరంగు) బ్యాలట్ పేపరుపై రాష్ట్ర గుర్తింపు సంఘానికి, క్లాజ్-6 (గులాబీ రంగు) బ్యాల ట్ పేపరుపై ప్రాంతీయ గుర్తింపు సంఘానికి రెండు ఓట్లు వేయాలి. ఏ యూనియన్‌కైనా 1,724 ఓట్లు వస్తేనే జిల్లా గుర్తింపు సంఘం హోదా వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement