'వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌ను గెలిపించండి'
విశాఖపట్నం : రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బతికి బట్టకట్టాలంటే వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ను గెలిపించాలని కార్మికులకు ఆ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఆర్టీసీ ఎన్నికల్లో తమ యూనియన్ పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. టేబుల్ ఫ్యాన్ గుర్తుపై రాష్ట్రంలోని 126 డిపోల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
ఈ ఎన్నికల నేపథ్యంలో రవీంద్రనాథ్రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో ఆర్టీసీ యూనియన్ నేతలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పి.రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ.... ఆర్టీసీని ప్రైవేట్పరం చేసి దివాలా తీసే యోచనలో చంద్రబాబు సర్కార్ ఉందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న యూనియన్కి... ప్రభుత్వాన్ని, ఆర్టీసీ మేనేజ్మెంట్ని నిలదీసే నాయకత్వం లేదన్నారు.
సంస్థలో యూనియన్లు బలంగా ఉంటే రాష్ట్రంలో అద్దె బస్సులు వచ్చేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీలోని 67 మంది ఎమ్మెల్యేలతో సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూరు యూనియన్ పనిచేస్తుందని పి.రవీంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపైనే తొలి సంతకం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు రవీంద్రనాథ్రెడ్డి చెప్పారు. అందుకోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.