ఇది సంక్షేమ సర్కారు | kamalapuram MLA Ravindranath Reddy Fired on TDP | Sakshi
Sakshi News home page

ఇది సంక్షేమ సర్కారు

Published Wed, Jan 1 2020 12:11 PM | Last Updated on Wed, Jan 1 2020 12:11 PM

kamalapuram MLA Ravindranath Reddy Fired on TDP - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి

కడప కార్పొరేషన్‌: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు, రేషన్‌కార్డులను తొలగిస్తోందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఇక్కడి వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక ప్రతిపక్షాలు పింఛన్లు, రేషన్‌కార్డులు పోతాయని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఆరోగ్యశ్రీలకు ఉన్న నిబంధనలను అందరి మేలుకోసం సరళతరం చేశారన్నారు. ఫిబ్రవరిలో రచ్చబండ కార్యక్రమం ద్వారా ఈ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో చెప్పిన హామీల్లో 80 శాతం హామీలను అమలు చేశారన్నారు.

ఆటో డ్రైవర్లకు వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్‌ ఉన్న వారికి ఏడాదికి రూ.10వేలు ఇచ్చారన్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు చెప్పిన దానికంటే ఏడాదికి రూ.13500 చొప్పున ఐదేళ్లపాటు ఇస్తున్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలో అగ్రిల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తూ, శనగ, సుబాబుల్, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర ప్రకటించారన్నారు. వైఎస్‌ఆర్‌ చేనేత హస్తం పేరుతో మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24వేలు ఇచ్చారన్నారు. జనవరి నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ  కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వనున్నారన్నారు. జనవరి 9న రాష్ట్రంలోని 46లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం ద్వారా రూ.15వేలు ఇవ్వనున్నారని పేర్కొన్నారు. ఉగాదికి అర్హులైనవారందరికీ ఉచితంగా ఇళ్లు ఇవ్వడమేగాక ఇంట్లో మహిళ పేరిట రిజిస్టర్‌ చేసి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారన్నారు. నాడు–నేడు పథకం ద్వారా ఆసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్చబోతున్నారని చెప్పారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 4.45లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం గిన్నిస్‌ రికార్డు అని తెలిపారు.  జనవరి 1వ తేది నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రజా రవాణా శాఖ కింద ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారన్నారు.  

రాజధానిపై శివరామక్రిష్ణన్‌ కమిటీ
ఎందుకు బయటపెట్టలేదు : రఘురామిరెడ్డి
రాజధానిపై శివరామక్రిష్ణన్‌ కమిటీ నివేదికను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రశ్నించారు. ఆ కమిటీ నివేదికలో ఉన్న అంశాలైమైనా  పాటించారా అని టీడీపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రం ఐక్యంగా ఉండాలని రాజధానిని త్యాగం చేసిన రాయలసీమలో రాజధాని ఎందుకు పెట్టలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. అమరావతిలో ఐదేళ్లు గ్రాఫిక్స్‌ చూపారే తప్పా ఒక్క శాశ్వత నిర్మాణం చేపట్టలేదన్నారు. అంతర్గత రహదారులూ నిర్మించలేదన్నారు. వర్షాకాలంలో అక్కడ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం సాధ్యం కాదన్నారు. శని, ఆదివారాలొస్తే ఏ ఒక్కరూ అమరావతిలో ఉండటం లేదన్నారు.  హైకోర్టును కర్నూలులో పెడితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి ప్రజల మద్దతుతోపాటు ప్రకృతి మద్దతు కూడా ఉందన్నారు. ఆరునెలలు సంక్షేమానికి కేటాయించామని, ఇకపై అభివృద్దిపై దృష్టిపెట్టనున్నామని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌ కుమార్,   రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, యువజన అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, రఘునాథరెడ్డి  పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement